కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వంతెనల నిర్మాణం పూర్తయ్యేనా?

ABN , First Publish Date - 2023-02-01T22:51:53+05:30 IST

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 1: దశాబ్ధాలు గడుస్తున్నా జిల్లాలోని మారుమూల గ్రామాలను అనుసంధానించే వంతెన నిర్మాణల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రతీ ఎడాది వర్షాకాలంలో మారుమూల గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వంతెనల నిర్మాణం పూర్తయ్యేనా?

- దశాబ్దాలు గడుస్తున్నా పూర్తికాని పనులు

- మారుమూల గ్రామాల ప్రజలకు తప్పనితిప్పలు

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 1: దశాబ్ధాలు గడుస్తున్నా జిల్లాలోని మారుమూల గ్రామాలను అనుసంధానించే వంతెన నిర్మాణల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రతీ ఎడాది వర్షాకాలంలో మారుమూల గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. భౌగోళికంగా భిన్నమైన స్వరూపం కలిగిన ఆసిఫాబాద్‌ జిల్లా ఏజెన్సీలో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకమే. గూడేల నుంచి ప్రధాన పట్టణాలకు రావాలంటే భగీరథ ప్రయత్నం చేయాల్సిందే. జిల్లాలోని 334పైగా ఆవాసాలకు నేటికీ అసలు రహదారి సౌకర్యమే లేదంటే ఉన్న గ్రామాలకు వాగులు, వంకల రూపంలో వర్షాకాలమంతా అష్టదిగ్బంధనమే. ఇటు ఆసిఫాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అయిదు ఏజెన్సీ మండలాలతో పాటు కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికలపేట, కాగజ్‌నగర్‌ వరకు అన్ని మండలాల్లో ప్రజలు ఒకే రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో చిన్నచిన్న వాగులు మొదలుకుని ఎర్రవాగు, పెద్దవాగు, ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని వంకలపై నేటికీ వంతెనలు లేకపోవడంతో ప్రజానీకం బయట ప్రపంచానికి చేరుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో ఇలా చిన్నా చితక కల్వర్టు మొదలుకుని భారీవంతెనల వరకు ఏవీ పూర్తి కాకపోవడంతో ప్రజానీకానికి ఇక్కట్లు తప్పడం లేదు. పనులను వేగిరం చేయాల్సిన అధికార యంత్రాం గం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో నిర్మాణల పనులు నిలిచిపోయాయని ప్రజలు వాపోతున్నారు. కెరమెరి మండలంలో పెండింగ్‌లో ఉన్న అనార్‌పల్లి, లక్మాపూర్‌ వంతెనల నిర్మాణపనులను చేపట్టాలని పది గ్రామాల ప్రజలు సోమవారం కెరమెరి మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు.

ఏళ్లుగా కొనసా...గుతున్న వంతెనల నిర్మాణాలు..

గ్రామాలకు రవాణా కష్టం తీర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి పూర్తిస్థాయిలో సఫలీకృతం కావడం లేదు. ఆసిఫాబాద్‌ మండలంలోని పెద్దవాగుపై గుండి వంతెన నిర్మాణ పనులు దశాబ్దన్నరగా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుండి గ్రామానికి వర్షాకాలంలో వెళ్లడానికి ప్రజలు అవస్థలు పడు తున్నారు. కెరమెరి మండలంలోని అనార్‌పల్లి, లక్మాపూర్‌ వంతెన నిర్మాణపనులు అసంపూర్తిగా ఉండడం వల్ల 12గ్రామాల ప్రజలకు ప్రతి వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతాయి. కాగజ్‌నగర్‌- వాంకిడి మండలాల మధ్య కనర్‌గాం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు 15సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ అసంపూర్తిగానే ఉంది. దీంతో ఆయాగ్రామాల ప్రజలు వర్షాకాలంలో రాకపోకలకు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.అలాగే పెంచికల్‌పేట్‌-దహెగాం మండలాల మధ్య పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన అప్రోచ్‌రోడ్డు పూర్తి కాకపోవడంతో ఆయా మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఆందోళనకు దిగుతున్న గ్రామల ప్రజలు..

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వంతెన నిర్మాణపనులను వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలోని పెద్దవాగుపై గుండి వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని గతంలో గుండి గ్రామస్థులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. గ్రామం నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్రగా వచ్చి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. తాజాగా సోమవారం కెరమెరి మండలంలోని అనార్‌పెల్లి, లక్మాపూర్‌ వంతెన నిర్మాణపనులను చేపట్టాలని మండలంలోని అనార్‌పెల్లి, బోరిలాల్‌గూడ, కరంజివాడ, గోండుగూడ, అందుగూడ, శంకర్‌లోద్ది, జన్కాపూర్‌, కోటా, పరందోళి, ముకద్దంగూడ, మహారాజ్‌గూడ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

వంతెన నిర్మాణ పనులు చేపట్టాలి..

- జాబిరే అరుణ, సర్పంచ్‌, గుండి

గుండి పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు వెంటనే ప్రారంభించాలి. 15 ఏళ్లుగా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రతి ఏటా వర్షాకాలంలో మా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి రావాలంటే వాంకిడి మండలం ఖమాన మీదుగా రావాల్సి వస్తోంది.

చాలా ఇబ్బందులు పడుతున్నాం..

- రాథోడ్‌ శేషరావు, సర్పంచ్‌, అనార్‌పల్లి

మండలంలోని అనార్‌పల్లి, లక్మాపూర్‌ వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంతో ఏటా వర్షాకాలంలో 12గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. పెండింగ్‌ వంతెన నిర్మాణ పనులను చేపట్టడంలో అదికారులు, పాలకులు నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసర సమయాల్లో 108రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. మండల కేంద్రానికి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పటం లేదు.

Updated Date - 2023-02-01T22:51:55+05:30 IST