ఓటు బ్రహ్మాస్త్రం

ABN , First Publish Date - 2023-01-24T22:33:22+05:30 IST

దేశంలో 18 ఏళ్లు నిండిన పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు. ఐదేళ్ల మన భవిష్యత్‌ను నిర్ణయించుకొనే ఏకైక అస్త్రం. తమ ప్రాంతాన్ని ఐదేళ్ల వరకు పాలించే నాయకున్ని ఎన్నుకొనే బ్రహ్మాస్త్రం ఓటు అనే విషయాన్ని ప్రజలు విస్మరించవద్దు.

ఓటు బ్రహ్మాస్త్రం

మంచిర్యాల, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో 18 ఏళ్లు నిండిన పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు. ఐదేళ్ల మన భవిష్యత్‌ను నిర్ణయించుకొనే ఏకైక అస్త్రం. తమ ప్రాంతాన్ని ఐదేళ్ల వరకు పాలించే నాయకున్ని ఎన్నుకొనే బ్రహ్మాస్త్రం ఓటు అనే విషయాన్ని ప్రజలు విస్మరించవద్దు. నిక్కచ్చిగా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కుకు అర్థం వస్తుంది. ఓటుతో సమర్థవంతుడైన నాయకుడిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకొనే వెసలుబాటు పౌరులకు ఉంది. ఓటు వేయడంలో నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా అనామకులను అందలమెక్కించిన వారవుతారు. నేషనల్‌ ఓటర్స్‌ డే 2023లో ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ‘నఽథింగ్‌ లైక్‌ ఓటింగ్‌....ఐ ఓట్‌ ఫర్‌ ష్యూర్‌’’ (ఓటింగ్‌ను దేనితో పోల్చలేము....కచ్చితంగా నేను ఓటు వేయాలి) అనే నినాదాన్ని ప్రవేశపెట్టింది.

ప్రలోభాలకు లొంగవద్దు

ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. డబ్బు, మద్యం కోసం ఓటు హక్కును దుర్వినియోగం చేసే ఓటర్లూ లేకపోలేదు. ఓటు వేస్తే మాకేంటి అనే ధోరణి కొందరిలో కనిపిస్తుంటుంది. నాయకుల ప్రలోభాలకు లొంగకుండా సమర్థవంతుడైన నాయకున్ని ఎన్నుకొనే బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది. దేశంలో యేటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం జరుపుకొంటు న్నాం. ఓటు హక్కు, దాని వినియోగంపై పౌరులకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులను ఓటర్లుగా గుర్తించేందుకు జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. కొత్త ఓటర్ల నమోదు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు విలువలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తోంది.

జిల్లాలో మొత్తం ఓటర్లు

ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ 1-1-2023 నాటికి జిల్లాలో 5,86,686 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,94,160 మంది, మహిళలు 2,92,481 మంది ఉన్నారు. వీరితోపాటు ఇతరులు 45 మంది ఉండగా, ఎన్‌ఆర్‌ఐ, సర్వీసు (దేశ భద్రత బలగాలు) ఓటర్లు మరో 663 మంది ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 7,163 మంది ఓటర్లు తగ్గారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఒకే ముఖం గల (ఫొటో సిమిలర్‌ ఎంట్రీస్‌) వ్యక్తుల జాబితాను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపడంతో ఇతర చోట్ల నమోదైన ఓటర్లను తొలగించారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య తగ్గింది. కొత్తగా నమోదైన 18, 19 సంవత్సరాలు గల యంగ్‌ ఓటర్లు 4724 మంది ఉన్నారు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఓటర్లు ఇలా...

చెన్నూరు నియోజకవర్గం

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,76,455 మంది ఉండగా పురుష ఓటర్లు 88,497 మంది, మహిళలు 87,947, ఇతరులు 11 మంది ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓట్లు పురుషులవి 6, సర్వీస్‌ ఓటర్లు 142 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 138 మంది, స్త్రీలు 4 గురు ఉన్నారు.

బెల్లంపల్లి నియోజకవర్గం

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,61,249 మంది ఉండగా పురుషులు 80,894, మహిళలు 80,341 మంది, ఇతరులు 14 మంది ఉన్నారు. వీరితోపాటు ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు పురుషులు 2, సర్వీస్‌ ఓటర్లు 161 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 154, స్త్రీలు 7 గురు ఉన్నారు.

మంచిర్యాల నియోజకవర్గం

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,48,982 మంది ఉండగా పురుషులు 1,24,769 మంది, మహిళలు 1,24,193 మంది, ఇతరులు 20 మంది ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 21 మంది ఉండగా పురుషులు 16 మంది, మహిళలు 5 గురు ఉన్నారు. అలాగే సర్వీసు ఓటర్లు 331 మంది ఉండగా, వీరిలో పురుషులు 322 మంది, మహిళలు 9 మంది ఉన్నారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి

జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి

ఓటు హక్కును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి. యువతపై దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల ముందు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. తప్పనిసరిగా ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి.

Updated Date - 2023-01-24T22:33:22+05:30 IST