కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ట్రా‘ఫికర్‌’

ABN , First Publish Date - 2023-01-25T22:08:35+05:30 IST

ఆసిఫాబాద్‌, జనవరి 25: ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోంది. ఎక్కడ చూసినా వాహనాల రద్దీ. ఫుట్‌ పాత్‌లపైనే వాహనాలు, తోపుడు బండ్లు. దీంతో వాహనదారులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోంది. ఇరుకు రోడ్లతో ట్రాఫిక్‌ తలెత్తుతోంది.

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ట్రా‘ఫికర్‌’

- అస్తవ్యస్తంగా ట్రాఫిక్‌

- ఇరుకుగా రోడ్లు

- పెరిగిన వాహనాల రద్దీ

- పార్కింగ్‌కు స్థలాలు కరువు

- రోడ్లపైనే వాహనాలు నిలిపివేత

- జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ కష్టాలు రెట్టింపు

ఆసిఫాబాద్‌, జనవరి 25: ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోంది. ఎక్కడ చూసినా వాహనాల రద్దీ. ఫుట్‌ పాత్‌లపైనే వాహనాలు, తోపుడు బండ్లు. దీంతో వాహనదారులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోంది. ఇరుకు రోడ్లతో ట్రాఫిక్‌ తలెత్తుతోంది. డివిజన్‌ కేంద్రంగా ఉన్న సమయంలోనే ప్రజలకు ఇబ్బందిగా మారిన ట్రాఫిక్‌ సమస్య జిల్లా కేంద్రం అయ్యే సరికి రెట్టింపు అయింది. జిల్లా కేంద్రం ఏర్పాటు కావడంతో వాహనాల తాకిడి పెరగడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. అటు జిల్లాస్థాయి అధికారుల వాహనాలు, ఇతర మండలాల నుంచి వచ్చిపోయే వారి వాహనాలతో రద్దీ ఎక్కువైంది. పార్కింగ్‌ ప్రదేశం లేక రోడ్లకు ఇరువైపులా పార్కింగ్‌ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. రోడ్లపైనే ఆటో స్టాండ్‌లు ఏర్పాటు చేశారు. మొదలే ఇరుకైన రోడ్లు, వాటిపై నిర్వహిస్తున్న ఫుట్‌పాత్‌ వ్యాపారం కారణంగా వాహనదారుల రాక పోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంచితే చివరకు పాదాచారులు సైతం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంది. ప్రజలు జిల్లా కేంద్రంలోని రోడ్లపై తిరగాలన్నా అటుగుండా ప్రయాణించాలన్నా వెళ్లలేని పరిస్థితి. జిల్లా కేంద్రం మీదుగా హైదరాబాద్‌- నాగ్‌పూర్‌ అంతర్రాష్ట్ర రహదారి ఉంది. రోడ్డుకు ఇరువైపులా వ్యాపార, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు ఉండడంతో పార్కింగ్‌ కోసం స్థలం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. నిత్యం ఈ రహదారి వెంట వేల సంఖ్యలో ఇటు హైదరాబాద్‌ వైపు, అటు మహారాష్ట్ర వైపు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రద్దీగా ఉండే ఈ రోడ్డుకు ఇరువైపులా వాహనాలను పార్కింగ్‌ చేయడంతో దూర ప్రాంతాలకు వెళ్లె భారీ వాహనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కేంద్రంగా మారిన నేపథ్యంలోనైనా ట్రాఫిక్‌ దుస్థితిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ కష్టాలు..

జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లయిన అంబేద్కర్‌చౌక్‌, వివేకానందచౌక్‌, గాంధీచౌక్‌లలో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రధాన కూడళ్లలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉండడం, వీటి సమీపంలోనే ఆర్టీసీ బస్టాండు, డిపో ఉండడంతో నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గాంధీ చౌక్‌, వివేకానందచౌక్‌లలో తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు రోడ్లపైనే తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రోడ్లు విస్తారంగా లేకపోవడం ఇరువైపులా వ్యాపార సముదాయాలు ఉండడంతో వినియోగదారులు వస్తువుల క్రయ విక్రయాల కోసం వచ్చినప్పుడల్లా ద్విచక్ర వాహనాలను, నాలుగు చక్రాల వాహనాలను రోడ్డుపైనే ఉంచి తమ పనులను కొనసాగిస్తున్నారు. వాహనాలను రోడ్లపైనే పార్కు చేయడంతో ఇతర వాహనాల రాక పోకలు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లా కేంద్రానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఆయా పాఠశాలలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్రాఫిక్‌ సమస్యపై దృష్టి సారించాలి

- ప్రణయ్‌,ఆసిఫాబాద్‌

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకు ఎక్కువ అవుతోంది. రద్దీ పెరగడంతో రోడ్లపై వాహనాలను నడపాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు దృష్టి సారించి ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలి.

రోడ్డుపైనే తోపుడు బండ్లు పెడుతున్నారు

- చిరంజీవి, ఆసిఫాబాద్‌

జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో రోడ్లపైనే తోపుడు బండ్లు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో పార్కింగ్‌తోపాటు ట్రాఫిక్‌ సమస్య తలెత్తు తోంది. అదికారులు దృష్టిసారించి రోడ్లపై తోపుడు బండ్లను తొలగించి పార్కింగ్‌ కోసం స్థలాలను ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చుడాలి.

Updated Date - 2023-01-25T22:08:37+05:30 IST