అరకొర కేటాయింపులతోనే సరి

ABN , First Publish Date - 2023-02-06T22:25:54+05:30 IST

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. పద్దులు బాగానే కేటాయించినప్పటికి కేవలం అంకెల గారడిగానే అగుపిస్తోంది.

 అరకొర కేటాయింపులతోనే సరి

మంచిర్యాల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. పద్దులు బాగానే కేటాయించినప్పటికి కేవలం అంకెల గారడిగానే అగుపిస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌లో ఈసారి పెద్ద మొత్తంలో కేటాయింపులు జరుగుతాయని ఆశించిన వివిధ శాఖలకు ఆశనిపాతమే ఎదురైంది. విద్యారంగానికి మొండి చేయి చూపినట్లు ఉపాధ్యాయులు ఏకరువు పెడుతున్నారు. 2023-24 మొత్తం బడ్జెట్‌లో విద్యాశాఖకు కేవ లం 5.54 శాతం కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. విద్యా రంగంపై చిత్తశుద్ధి లోపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, మహిళల సంక్షేమం, సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి బడ్జెట్‌లో స్థానం కల్పించినప్పటికీ ప్రజల సంఖ్యకు సరిపడా కేటాయింపులు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. మధ్యాహ్న భోజన కార్మికులకు మూడు రెట్లు వేతనాలు పెంచు తున్నట్లు ప్రకటించి బడ్జెట్‌లో చోటు కల్పించడంపై హర్షం వ్యక్తమవుతుం డగా, అసంఘటిత కార్మికులకు న్యాయం జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బడుల బాగుకు అంతంతే

మన ఊరు-మన బడి పేరుతో విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించారు. పాఠ శాలల్లో చేపట్టే పనులు పెండింగ్‌లో ఉండే అవకాశం ఉంది. ఉపాధ్యా యుల వైద్య పరీక్షలకు కేటాయించిన నిధులపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కేటాయించిన మేరకు కార్పొరేట్‌ వైద్యం పక్కన పెడితే నాణ్యమైన వైద్యం అయినా అందేలా లేదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

సొంత ఇంటి కల నెరవేరేనా?

ఇల్లు లేని నిరుపేదలు సొంత స్థలంలో నిర్మించుకునేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో చోటు కల్పించడం కొంత ఉపశమనం కలిగించే అంశం. ప్రతీ ఇంటికి రూ.3 లక్షల చొప్పున కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. అందుకు సంబంధించిన విధివిధానాలు త్వరగా విడుదల చేసి పేదల సొంతింటి కల నిజం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే బీసీ సంక్షేమానికి రూ.6229 కోట్లు కేటాయించింది. అయితే 2016 నుంచి వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు చేయ లేదు. దీంతో బీసీ రుణాల కోసం జిల్లాలో దాదాపు 10 వేల పైచిలుకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. యేటా కొత్త యూనిట్‌లు మంజూరు చేస్తున్నామని ప్రకటించడమే తప్ప బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడంతో ఏండ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు.

విద్యాశాఖకు అరకొరే

వైద్య శాంతికుమారి, టీఎస్‌టీయూఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

బడ్జెట్‌లో విద్యారంగానికి యేటా కేటాయింపులు తగ్గిస్తూ వస్తోంది. 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నాం. సెకండరీ, ఉన్నత విద్యకు సంబంధించి కేటాయింపులు తగ్గాయి. మన ఊరు- మన బడిలో భాగంగా పాఠశాలల్లో మూడు దశల్లో మౌలిక వసతులు కల్పి స్తానని చెప్పారు. ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌లో భాగంగా నామమాత్రంగా రూ.362 కోట్లు కేటాయించారు. ఉద్యోగుల వైద్య పరీక్షలకు ఇవి ఏ మాత్రం సరిపోవు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆరోగ్య విషయమై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఉపాధ్యాయులకు ప్రతీ నెల మొదటి తేదీన జీతాల చెల్లింపు చేపట్టాలి.

మోసపూరిత బడ్జెట్‌

మేకల దాసు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి

పేదలు, రైతులు, కార్మికులకు బడ్జెట్‌ ఏ మాత్రం మేలు చేసే విధంగా లేదు. ఔట్‌ సోర్సింగ్‌ విధానం రద్దు చేస్తామని మాట తప్పారు. మెడికల్‌ కాంట్రాక్టు కార్మికులు, స్కీమ్‌ వర్కర్లకు ఏ మాత్రం ఊరట లేదు. మధ్యా హ్న భోజన కార్మికుల శ్రమ దోచుకుంటున్నారు. అసంఘటిత కార్మికుల వేతనాలు బడ్జెట్‌తో పెరిగే అవకాశం లేదు. అసంఘటిత కార్మికులను మరోసారి మోసం చేశారు.

అంకెల గారడి

కలవేన శంకర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు

బడ్జెట్‌ అంతా అంకెల గారడీగా ఉంది. సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు ప్రజలకు ఎంత మాత్రం సరిపోదు. పరిశ్రమలకు రూ.437 కోట్లు కేటాయించారు. కాని ఇండస్ర్టియల్‌ కారిడార్ల ఏర్పాటు ప్రకటనకే పరిమితమయ్యారు. విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది.

నిరాశపరిచిన బడ్జెట్‌

డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి , మోతె జయకృష్ణ

రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిరాశపర్చింది. విద్యాశాఖకు కేవలం 5.54 శాతం, ఉన్నత విద్యకు 1శాతం మాత్రమే కేటాయింపులు చేయడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలుస్తుంది. మన ఊరు - మన బడి పథకం నిధులు లేక ముందుకు సాగడం లేదు. ఈ బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు ఉంటాయని ఆశించినప్పటికి ఆ మేర జరగలేదు.

ఇది ఎన్నికల బడ్జెట్‌

సబ్బనికృష్ణ, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి

బెల్లంపల్లి: ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రవేశపెట్టిన ఎన్నికల బడ్జెట్‌. అసంఘటిత కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, మహిళలకు బడ్జెట్‌ వల్ల ఎలాంటి లాభం లేదు. సింగరేణి కార్మికులకు ఇన్‌కంట్యాక్స్‌ రద్దు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌, రైతులకు గిట్టుబాటు ధరలు, తాగు, సాగునీరుపై బడ్జెట్‌లో ఆశించిన కేటాయింపులు లేవు.

Updated Date - 2023-02-06T22:25:57+05:30 IST