రాష్ట్ర బడ్జెట్‌లో ఆసిఫాబాద్‌ జిల్లాకు కంటి తుడుపు కేటాయింపులే..

ABN , First Publish Date - 2023-02-06T22:48:46+05:30 IST

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌): ఎన్నికల ముంగిట ప్రవేశపెట్టిన భారీబడ్జెట్‌లో ఆసిఫాబాద్‌ జిల్లాకు కంటి తుడుపు కేటాయింపులే జరిగాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారీగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టవచ్చని ఆశించినా కొత్త పథకాల ఊసే లేదు. జిల్లాలో కీలకమైన గ్రామీణ రోడ్డు నెట్‌వర్క్‌ కోసం నిధుల కేటాయింపుపైన ఆర్థిక మంత్రి శీతకన్ను వేశారు.

రాష్ట్ర బడ్జెట్‌లో ఆసిఫాబాద్‌ జిల్లాకు కంటి తుడుపు కేటాయింపులే..

-జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు రూ.40కోట్లు

-నిరుద్యోగ భృతికి మొండి చేయి

-మధ్యాహ్న భోజన కార్మికులకు వేతన పెంపు హామీ

-రాష్ట్ర బడ్జెట్‌పై భిన్నస్వరాలు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌):

ఎన్నికల ముంగిట ప్రవేశపెట్టిన భారీబడ్జెట్‌లో ఆసిఫాబాద్‌ జిల్లాకు కంటి తుడుపు కేటాయింపులే జరిగాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారీగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టవచ్చని ఆశించినా కొత్త పథకాల ఊసే లేదు. జిల్లాలో కీలకమైన గ్రామీణ రోడ్డు నెట్‌వర్క్‌ కోసం నిధుల కేటాయింపుపైన ఆర్థిక మంత్రి శీతకన్ను వేశారు.

అసెంబ్లీలో సోమవారం ఆర్థికమంత్రి హరీష్‌రావు రూ.2.90లక్షల కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆసిఫాబాద్‌ జిల్లాకు ఆశించిన రీతిలో కేటాయింపులు కన్పించలేదు. ముఖ్యంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ఎప్పటిలానే అరకొర నిధులే కేటాయించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రహదారుల నెట్‌వర్క్‌కు సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేయకపోయిన ఆర్‌అండ్‌బీకి చేసిన నిధుల నుంచే జిల్లా రహదారులకు నిధులు కేటాయించవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ రోడ్డు నెట్‌వర్క్‌కు సంబంధించి గిరిజన సంక్షేమంలో భాగంగా రూ.13,85 కోట్లతో 2500 కిలోమీటర్ల రహదారులు నిర్మించే అవకాశం ఉన్నట్టు ప్రకటించినందున ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధిక గిరిజన ఆదివాసీ గూడాలు కలిగిన ప్రాంతాలకు నిధులు మంజూరు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో ప్రకటించినట్టుగా మధ్యాహ్నభోజన కార్మికులకు ఈసారి రూ.3వేల వేతనాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఎప్పటి నుంచో డిమాండు చేస్తున్న సెర్ప్‌ ఉద్యోగుల వేతన సవరణకు బడ్జెట్‌లో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఆసిఫాబాద్‌ జిల్లాలో వివిధ కేటగిరిలో పనిచేస్తున్న 149మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటివరకు డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు పెద్దగా జరగలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సొంత జాగ కలిగిన పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం రూ.3లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే గతంలోనే నిర్ణయించినట్టుగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1100మందికి దళితబంధు కింద యూనిట్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. జిల్లాకు కొత్తగా మంజూరైన వైద్యకళాశాలకు అనుబంధంగా కొత్తగా నర్సింగ్‌ కాలేజీని మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే కొత్తగా ఏర్పడిన జిల్లాలో సీనియర్‌, జూనియర్‌ జిల్లా జడ్జిల కోర్టుల ఏర్పాటుకు అవసరం అయిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఏప్రిల్‌ నుంచి సెర్ప్‌ ఉద్యోగులకు పే స్కేల్‌ అమల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే గతఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలకు సంబంఽధించి ప్రస్తుత బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావనలు చేయలేదు. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా అత్తెసరు కేటాయింపులు జరపటంతో రైతులకు మరోసారి మొండిచేయి లభించినట్లయింది. గుడ్డిలో మెల్ల అన్నట్టు ఆయిల్‌పామ్‌ సాగు కోసం ప్రోత్సాహకాలు ప్రకటించినందున జిల్లా ఉద్యానవన శాఖకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు కోసం వేయి ఎకరాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇవికాకుండా మహిళా శిశు సంక్షేమం, గ్రామీణ రోడ్ల నిర్మాణం, పురపాలకశాఖ, పరిశ్రమలశాఖకు కేటాయింపులు జరిపారు. అలాగే గిరిజన సంక్షేమానికి రూ.1523 కోట్లు కేయించగా, షెడ్యూల్డు కులాల అభివృద్ధి కోసం రూ.36750 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి రూ.6229 కోట్లు కేటాయించారు. అలాగే విద్యారంగానికి రూ.19,093 కోట్లు కేటాయించారు. ఏజేన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న కేసీఆర్‌ న్యూట్రిషియన్‌ కిట్‌ పథకానికి కూడా రూ.200 కోట్లు కేటాయించారు.

ప్రాజెక్టుల వారిగా.. ఇవీ కేటాయింపులు..

ఆసిఫాబాద్‌ జిల్లాలో అరకొర నిధులతో నత్తనడకన సాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు ఎన్నికల ముందు చివరి బడ్జెట్‌గా భావిస్తున్న తాజాబడ్జెట్‌లో భారీగా కేటాయింపులు జరుగుతాయని ఆశించినా నిరాశే ఎదురైంది. సాగునీటి రంగానికి రూ.26వేల కోట్లకు పైగా బడ్జెట్‌ ప్రకటించిన ఆర్థికమంత్రి ఆసిఫాబాద్‌ జిల్లాలోని ప్రాజెక్టులపై మాత్రం శీతకన్ను వేశారు. ముఖ్యంగా వట్టివాగు, ఎన్టీఆర్‌సాగర్‌, అడ(కుమరం భీం), జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టులకు సంబంధించి కేవలం రూ.39 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో వట్టివాగు ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులు, పూడికతీతల కోసం రూ.3.07కోట్లు, ఎన్టీఆర్‌ సాగర్‌కు రూ.1.01కోట్లు, కుమరం భీం ప్రాజెక్టుకు రూ.23.27 కోట్లు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టుకు రూ.12కోట్లు, ఎర్రవాగు పీపీరావు ప్రాజెక్టుకు 1.01కోట్లు కేటాయించారు.

కేటాయింపులు ఘనం నిధులు శూన్యం..

-విశ్వప్రసాద్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు

రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్‌రావు సోమవారం సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కాగితాలపై అంకెల గారడి తప్ప మరొకటి కాదు. గతేడాది లాగే కాగితాలపై ఘనమైన బడ్జెట్‌ కూర్చి నిధుల విడుదలలో మాత్రం రిక్తహస్తం చూపించారు. ఈ సారి అదే పరిస్థితి చేశారు. కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ ఘనం గా ఉండాలన్న ఆర్భాటం కన్పిస్తే తప్పా ఇది ఆచరణాత్మక బడ్జెట్‌ కాదు. కీలకమైన విద్యారంగానికి కేటాయింపులు లేదు. అలాగే గతంలో అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల విషయం కూడా ప్రస్తావించలేదు.

అంకెల గారడి..

-డాక్టర్‌ హరీష్‌బాబు, బీజేపీ నేత, సిర్పూరు

రాష్ట్ర బడ్జెట్‌ అంకెల గారడి తప్ప వాస్తవికమైంది కాదు. బడ్జెట్‌లో జిల్లా ప్రాజెక్టులక నిధుల కేటాయింపులను విస్మరించారు. గతంలో ప్రకటించిన పథకాలకు నిధులు, ఎన్నికల హామీలకు ఒక్కపైసా విధించలేదు. బడ్జెట్‌లో ప్రాణహిత చేవేళ్ల కనీస ప్రస్తావన కూడా చేయలేదు. ఇస్తారన్న నిరుద్యోగ భృతికి సంబంధించి మొక్కుబడి ప్రకటన కూడా లేదు.

విద్యారంగానికి ఆశించిన నిధులు కేటాయించలేదు..

-అన్నం నాగార్జున, కాగజ్‌నగర్‌

విద్యారంగానికి ఈ సారి బడ్జెట్‌లో ఆశించినమేర నిధులు కేటాయించలేదు. ఫీజు రీయింబర్స్‌మెంటు విషయం ప్రస్తావన రాలేదు. విద్యారంగానికి రూ.2300 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది. స్కాలర్‌షిప్‌, యూనివర్శిటీ అభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయించలేదు. కేవలం అంకెల గారడీ తప్ప మరెమీ కన్పించడం లేదు. గురుకులాలకు నూతన భవనాల విషయం కనీసం ప్రస్తావన కూడా రాలేదు.

Updated Date - 2023-02-06T22:48:48+05:30 IST