ఆశ.. నిరాశే!

ABN , First Publish Date - 2023-02-02T00:49:22+05:30 IST

కేంద్రంలో వరుసగా రెండోసారి అధి కారం చేపట్టిన మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్‌గా చెప్పుకునే 2023-24 సాధారణ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి కనిపించింది.

ఆశ.. నిరాశే!
ఆదిలాబాద్‌ రైల్వే స్టేషన్‌

ఉద్యోగ వర్గాలకు కాస్త ఊరట.. ఆదాయ పన్ను పరిమితిలో మార్పు

మళ్లీ ఆర్మూర్‌-ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ ఏర్పాటుకు మొండిచేయి

సీసీఐ, ఏయిర్‌పోర్టులకు సంబంధించి జరగని కేటాయింపులు

మరింత పెరగనున్న ‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పెట్టుబడి సహాయం

ఈ పథకం కింద జిల్లాలో మొత్తం 94 వేల మంది రైతులు

వ్యవసాయ రంగానికి ఆర్థిక తోడ్పాటు

జిల్లాలో కేంద్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో వరుసగా రెండోసారి అధి కారం చేపట్టిన మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్‌గా చెప్పుకునే 2023-24 సాధారణ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి కనిపించింది. అయినా ఆశించిన స్థాయిలో జిల్లాకు బడ్జెట్‌ కేటాయింపులు జరుగలేవన్న అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌లో 2023-24 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌ అందర్నీ మెప్పించలేక పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మధ్యతరగతి లక్ష్యంగా బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నా యన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అలాగే టీవీలు, మొబైల్స్‌, కెమెరాలు, ఎలక్ర్టిక్‌ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. టైర్లు, వజ్రాలు, బంగారం, వెండి ధర లతో పాటు ముఖ్యంగా సిగరేట్లపై 16 శాతం పన్ను పెంచడంతో పొగరాయుళ్ల జేబుళ్లకు చిల్లులు పడడం కాయంగా కనిపిస్తుంది. గ్రామీణ మహిళల అభివృద్ధి కి కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ధీర్ఘకాలిక సమస్యలుగా చెప్పుకునే సీసీఐ, ఎయిర్‌పోర్టు, రైల్వేలైన్‌కు సంబంధించి న కేటాయంపులు కనిపించక పోవ డంతో జిల్లా వాసులు నిరాశకు గురయ్యారు. మొత్తం బడ్జెట్‌ రూ.45.03 లక్షల కోట్లు కాగా, ఇందులో జిల్లాకు ప్రత్యేకమైన కే టాయింపులు కల్పించ లేదు. మొత్తానికి కేంద్ర బడ్జెట్‌పై జిల్లా వాసుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. కేంద్ర బడ్జెట్‌పై జిల్లావాసులు ఆతృతగా ఎదురుచూసినా.. చెప్పుకోదగ్గ కేటాయింపులు లేకపోవడంతో నిరాశ పరచిందనే చెప్పొచ్చు.

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చినట్లే కనిపించింది. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్లు కేటా యించారు. ముఖ్యంగా వ్యవసాయంలో డిజిటల్‌ సేవల విస్తరణ, పత్తి సాగు పెంపు, మార్కెటింగ్‌, గ్రామీణ స్థాయిలో గిడ్డంగుల నిర్మాణం లాంటి అంశాలకు ప్రాధాన్యత కనిపించింది. అలాగే చిరుధాన్యాలను పండించే రైతులను ప్రోత్స హించేందుకు శ్రీఅన్నా పథకం ప్రవేశ పెట్టనున్నారు. మత్స్య సంపదను మరింత గా పెంచేందుకు అదనంగా రూ.6వేల కోట్లను కేటాయించారు. సేంద్రియ సాగు ను మరింత పెంచేందుకు బయో ఇన్‌ఫుట్‌ రిసోర్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేయ నున్నారు. అలాగే రైతులకు రుణాలు ఇచ్చేందుకు రూ.2.4 లక్షల కోట్లను కేటా యించారు. ఇది వరకే కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని మరింత పెం చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం జిల్లాలో మొత్తం 94 వేల మంది రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందుతుంది. దీని ద్వారా యేడాదిలో మూడు సార్లు రూ.2వేల చొప్పున రూ.6 వేలను చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని మరింతగా పెంచనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో జిల్లా రైతులకు కొంతమే లు జరిగే అవకాశం కనిపిస్తుంది.

వేతన జీవులకు ఊరట

కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరటను కలిగించే విధంగా నిర్ణయా లు తీసుకున్నట్లు కనిపించింది. ఆదా యం పన్ను పరిమితిలో భారీ మార్పు లు చేసింది. అయితే, గతంలో ఉన్న రూ.ఐదు లక్షల ఆదాయ పన్ను పరి మితిని.. ప్రస్తుతం రూ.ఏడు లక్షల వరకు పెంచుతు నిర్ణయం తీసుకుంది. రూ.ఏడు లక్షల లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులకు ఎలాంటి పన్నును చెల్లించే అవసరం ఉండదని ప్రకటించిం ది. రూ.తొమ్మిది లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.15లక్షల వరకు 20 శాతం పన్ను, రూ.15 లక్షలకు పైగా ఆదా యం ఉన్న వారికి 30 శాతం పన్నును విధించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా జిల్లాలో పన్ను చెల్లించే మొత్తం ఉద్యోగులు సుమారుగా 13 వేల మంది ఉండగా.. పింఛనర్లు రెండు వేల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో 12వేల మంది ఉద్యోగులు సంవత్సరానికి 20వేల నుంచి 50వేల రూపాయల వరకు పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తారని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుం ది. మరో రెండు మూడు వేల మంది ఉద్యోగులు లక్ష వరకు పన్ను చెల్లించే వారిలో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగ వర్గాలకు కొంతమేలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది చిన్నస్థాయి ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

మళ్లీ రైల్వేలైన్‌ ఊసేలేదు

జిల్లావాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్మూర్‌-ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌కు సంబంధించిన నిధుల కేటాయింపులపై బడ్జెట్‌లో ఊసే కనిపించ లేదు. దీంతో జిల్లావాసులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గత బడ్జెట్‌లో రూ.2700 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం, ఆ తర్వాత ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ లలో ప్రత్యేక నిధుల కేటాయింపులు చేయలేదు. ఇప్పటికే రాష్ట్రం తన వాటాగా కొంత సొమ్మును చెల్లించినా.. కేంద్ర ప్రభుత్వం దీనిని అంతగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. పలుమార్లు ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి విన్నవించినా.. ప్రయోజనమే లేకుండా పోయింది. బీజేపీ పార్టీకి చెందిన అభ్యర్థే పార్లమెంట్‌ సభ్యుడిగా గెలుపొందినా.. ఏమాత్రం కదలిక కనిపించడం లేదు. కేంద్ర పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని అం దరూ భావించినా.. అవేమీ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుత ఎంపీ సోయం బాపురావు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి రైల్వే పనులను ప్రారంభిం చాలని కోరినా.. ఫలితం లేకుండానే పోయింది. అసలు రైల్వేలైన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందో? లేదో?నన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్‌ కావడంతో నిధుల కే టాయింపులు ఉంటాయని అందరూ అంచనా వేసిన, చివరకు నిరాశే మిగిలింది. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లోపైనా పనులు ప్రారంభమవుతాయని అందరూ భా వించిన అది సాధ్యమయ్యేలా? కనిపించడం లేదు. దీంతో ఇప్పట్లో ఆర్మూర్‌-ఆది లాబాద్‌ రైల్వే నిర్మాణం పనులు ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు.

జిల్లాకు దక్కని చోటు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌ కేటాయింపులో జిల్లాకు సంబంధించిన సమస్యల ప్రస్తావన ఏమీ కనిపించ లేదు. ఇప్పటికే ఉట్నూర్‌కు గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం దానిని ములుగు జిల్లాకు తరలించుకుపోవడంతో ఆదివాసీ గిరిజనుల ఆశలు ఆవిరయ్యాయి. అలాగే రెండు దశాబ్దాలకుపైగా మూతబడి కనిపిస్తున్న సీసీఐ పునరుద్ధరణ జోలికి కూడా కేంద్రం వెళ్లినట్లు కనిపించ లేదు. ఇప్పటికే తాంసి బస్టాండ్‌, స్పిన్నింగ్‌ మిల్లు వద్ద రైల్వే అండర్‌, ప్లైఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి పనులు ప్రారంభమైనా.. ఆశించినస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. అలాగే ఎరోడ్రమ్‌ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయడం లేదన్న విమర్శ లు వస్తున్నాయి. అంతేకాకుండా గత యేడాదిలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధి కారులు జిల్లాలో పర్యటించిన ఆర్మూర్‌-ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ పనులు అడుగు ముందుకు పడడం లేదు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా, విద్య, వైద్యం, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రత్యేక నిధులేమీ కేటాయించక పోవడంపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారమేది?

: జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌

జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలకు బడ్జెట్‌లో పరిష్కారమే చూపలేదు. ప్రత్యేక కేటాయింపులు కనిపించ లేదు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మొండిచేయే దక్కింది. జిల్లా ఎంపీగా బీజేపీ అభ్యర్థినే గెలిపించినా.. ఏం ప్రయోజనం కనిపించడం లేదు. బీజేపీ గొప్పలు చెప్పడమే తప్ప సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమవుతోంది. ముఖ్యంగా సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణ, ఎరోడ్రమ్‌, కేంద్రీయ విశ్వ విద్యాలయం లాంటి సమస్యలకు పరిష్కారం చూపకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చొరవతో జిల్లాలో ఐటీ హాబ్‌ను ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది.

ఇది అందరినీ మెప్పించే బడ్జెట్‌

: సోయం బాపురావు, ఎంపీ, ఆదిలాబాద్‌

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాధారణ బడ్జెట్‌ అందరినీ మెప్పించే విధంగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం, మహిళలకు పెద్దపీట వేసింది. గతంలో ఏ ప్రభుత్వం కేటాయించని విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి నిధులు కేటాయించి ప్రాధాన్యతనిస్తోంది. ఆర్మూర్‌-ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌పై రాష్ట్ర ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తోంది. ఈ కారణంగానే బడ్జెట్‌లో ప్రత్యేక నిధుల కేటాయింపు జరుగలేదు. ఆదివాసీ గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేలా బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయి. ముఖ్యంగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి సహాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దీంతో రైతులకు ఎంతో మేలు జరుగనుంది.

Updated Date - 2023-02-02T00:49:24+05:30 IST