భరోసా ఇవ్వని బడ్జెట్‌

ABN , First Publish Date - 2023-02-07T01:27:51+05:30 IST

వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌ జిల్లాకు భరోసానిచ్చే విధంగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భరోసా ఇవ్వని బడ్జెట్‌
ఏళ్ల తరబడి మూతబడి ఉన్న జిల్లా కేంద్రంలోని సీసీఐ

సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులేవీ?

బోథ్‌లో కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కటకట

గత ఏడేళ్లుగా పడుతూ.. లేస్తున్న కోర్టా-చనకా బ్యారేజీ నిర్మాణ పనులు

ఏళ్ల తరబడి పునరుద్ధరణకు నోచుకోని సీసీఐ పరిశ్రమ

ఏజెన్సీ సమస్యలపై స్పష్టత కరువు

సొంత స్థలం కలిగి ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం

కుల వృత్తులు, సంక్షేమ పథకాలకు భారీగా నిధుల కేటాయింపు

రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లాలో మిశ్రమ స్పందన

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌ జిల్లాకు భరోసానిచ్చే విధంగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి చివరి బడ్జెట్‌గా చెప్పుకునే ఈ బడ్జెట్‌ కేటాయింపుల్లో జిల్లాకు ప్రత్యేకమైన కేటాయింపులు ఏమీ లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సోమవారం ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభలో ప్రవేశ పెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ రూ.2లక్షల 90వేల 396 కోట్లు కాగా, ఇందులో ప్రధానంగా సంక్షేమ పథకాలు, కుల వృత్తుల సంక్షేమానికి భారీ నిధులు కేటాయించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దమొత్తంలో రూ.26వేల 831కోట్లు, హరితహారానికి రూ.1471 కోట్లు, రైతు రుణమాఫీకి రూ.6385 కోట్లు కేటాయించగా రూ.లక్ష లోపు పంట రుణం తీసుకున్న వారికి వర్తింప చేసే అవకాశం ఉందంటున్నారు. దాదాపుగా జిల్లాలో లక్ష మంది రైతులకు పైగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లకు రూ.3210 కోట్లు, రైతుబంధుకు రూ.15వేల 75కోట్లు, రైతుబీమాకు రూ.1589 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.12వేల కోట్లు, గిరిజన సంక్షేమం రూ.3960 కోట్లు, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15వేల 223 కోట్లు, ఆయిల్‌పామ్‌ల ప్రోత్సాహానికి రూ.వెయ్యి కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ యేడు భారీ వర్షాలు కురిసిరోడ్లు దెబ్బతినడం తో రోడ్లు భవనాల శాఖకు రూ.2500 కోట్లు కేటాయించారు. ఇకపై పల్లె, పట్టణ ప్రగతి కోసం ఆర్థిక సంఘం నిధులను నేరు గా స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలకు ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. అలాగే జిల్లాలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టు కోర్టా చనకా పెండింగ్‌ నిధుల కేటాయింపుల పై ప్రత్యేక ప్రస్థావన ఏమి కనిపించ లేదు. మొత్తానికి రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లాలో మిశ్రమ స్పందనే కనిపిస్తోంది.

గొళ్ల, కుర్మలకు మంచి రోజులు

రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్ల క్రితం గొళ్ల, కుర్మలకు ఉచిత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో 4,282 యూనిట్లను పంపిణీ చేశారు. రెండో వి డతలో భాగంగా 4,267 యూనిట్లను మం జూరు చేసి ఇందులో నుంచి కేవలం 720యూనిట్లను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. మిగితా 3547 యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉం ది. అయితే లబ్ధిదారుల వాటా కింద ఇప్పటి వరకు 2076 మంది గొళ్ల, కుర్మలు ఒక్కో యూనిట్‌కు రూ.43వేల 750 చెల్లించారు. దీంతో రూ.9కోట్ల 8లక్షల రూపాయలు ప్రభుత్వం ఖాతాలో జమ ఉంది. అయితే తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో గొర్రెల పంపిణీ పథకానికి రూ.వంద కోట్లను కేటాయించారు. అలాగే సంక్షేమ పథకా లకు పెద్దపీట వేసినట్లు కనిపిస్తుంది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకానికి రూ.3210 కోట్లు కేటాయించగా ఇప్పటికే దళితబంధు పథకం కింద జిల్లావ్యాప్తంగా 249 కుటుంబాలకు దళితబంధు కింద రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ బడ్జెట్‌లో రూ.17వేల 700 కోట్లు కేటాయించడంతో మిగితా లబ్ధిదారులకు లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తుంది. ఆసరా పింఛన్లకు రూ.12వేల కోట్లు కేటాయించడంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికి ఆసరా పింఛన్లను మంజూరు చేయనున్నారు.

సాకారం కానున్న సొంతిటి కల

గడిచిన ఏడేళ్లలో జిల్లాకు ప్రభుత్వం మూడు విడతల కింద 3,862 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 3,381 ఇళ్లకు పరిపాలన అనుమతులు వచ్చాయి. కాగా 3,098 ఇళ్లకు టెండర్లను పిలువగా.. 1,902 ఇళ్లకు మాత్రమే టెండర్లను పూర్తి చేశారు. ఇప్పటికి 1,298 ఇళ్ల నిర్మాణాల పనులు వివిధ దశల్లోనే కనిపిస్తున్నాయి. ఇందులో 518 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. తాజాగా డబుల్‌ బెడ్‌ రూం పథకానికి రూ.12వేల కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సొంత స్థలం కలిగి ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించడంతో సొంతింటి కల సాకారమయ్యే అవకాశం కనిపిస్తుంది. జిల్లాలో వేల సంఖ్యలో దరఖాస్తులు రాగా, కేవ లం వందల సంఖ్యలోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా రూ.3లక్షల పథకాన్ని వెంటనే అమలు చేస్తే ఎందరో మందికి సొంతిళ్లు సొంతమయ్యే అవకాశం ఉంది.

జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు ఏవీ?

వెనుకబడిన జిల్లాకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు కరువయ్యాయ న్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ధీర్ఘకాలిక సమ స్యలకు పరిష్కారం చూపలేదన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లా ప్రస్థావనే రాలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బోథ్‌ నియోజకవర్గంలో నిర్మించనున్న కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటా యింపు కనిపించ లేదు. ఇప్పటికే పనులు ప్రారంభించిన కోర్టా-చనకా బ్యారేజీ నిర్మాణానికి అంతంతమాత్రంగానే నిధులు కేటాయించినట్లు అధికారులు పే ర్కొంటున్నారు. దీంతో గత ఏడేళ్లుగా బ్యారేజీ నిర్మాణం పనులు పడుతూ లేస్తున్నాయి. రెండేళ్లలో పూర్తి చేయాల్సిన బ్యారేజీ ఏడేళ్లు గడుస్తున్నా.. అర ఎకరమైన తడుపలేదన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నిధుల కొరతతోనే పనులు నిలిచిపోతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే యేళ్ల తరబడి మూ తబడి ఉన్న సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణపై ఏ మాత్రం స్పష్టత కనిపించ లేదు. ఎరోడ్రమ్‌ నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఏజెన్సీ ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు లేవన్న అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీసారి బడ్జెట్‌ కేటాయింపుల్లో జిల్లా ధీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి మొండిచేయే కనిపిస్తోంది. కాగా, దళితబంధు కింద రూ.12వేల 980 కోట్లు కేటాయించిన ప్రభుత్వం నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనుంది.

కేటాయింపులే తప్ప.. ఖర్చేదీ?!

: పాయల శంకర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతీసారి ప్రకటించిన బడ్జెట్‌లో కేటాయింపులు చేయడమే తప్ప ఖర్చు మాత్రం చేయడం లేదు. మరోసారి జిల్లా ప్రజలను మోసగించేందుకే బడ్జెట్‌ కేటాయింపులు చేశారు. ప్రత్యేకంగా ఈసారి కూడా బడ్జెట్‌తో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. గత బడ్జెట్‌లో జిల్లాకు ఎంత కేటాయించారో? ఎంత ఖర్చు చేశారో? బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలకు చెప్పాలి. అవేమీ చెప్పకుండా అంకెల గారడి చేస్తూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. వాస్త పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారు.

అంతా అంకెల గారడే...

: సాజిద్‌ఖాన్‌, డీసీసీ అధ్యక్షుడు, ఆదిలాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అంతా అంకెల గారడిగానే కనిపిస్తోం ది. ప్రతియేటా కేటాయింపులు చేయడం మరిచిపోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. గతంలో కేటాయించిన నిధులు ఎంత ఖర్చు చేశారో? చెప్పకుండానే కొత్త బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినా.. ఏం లాభం ఉండదు. ప్రభుత్వం చెప్పేదొకటి, ఆ తర్వాత చేసేది మరొకటి. ఇప్పటికే ఇచ్చిన హామీల ను నెరవేర్చకుండా బడ్జెట్‌ కేటాయింపులు చేస్తుంది. రైతు సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నా.. ఏకకాలంలోనే రుణమాఫీ చేయాలి.

బడ్జెట్‌లో లేకపోయినా.. ఐటీ టవర్‌కు రూ.40కోట్లు

: జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌

బడ్జెట్‌ పద్దుల్లో లేకపోయినా.. ఐటీ టవర్‌కు ప్రభుత్వం రూ.40 కోట్లను కేటాయించింది. దీంతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. అలాగే త్వరలోనే ఎస్‌డీఎఫ్‌ నిధులు కాకుండా మున్సిపాలిటీకి రూ.74కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ప్రజా సంక్షేమం, దళితబంధు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. అలాగే పేదలకు అండగా నిలిచేందుకు షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాలకు భారీ నిధులు కేటాయించింది. ప్రతీ నియోజకవర్గానికి 3వేల ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-02-07T01:27:53+05:30 IST