కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు జరిపించండి

ABN , First Publish Date - 2023-01-18T04:15:43+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరిపించాలని బీజేపీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్‌ కోరారు.

కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు జరిపించండి

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాజీ ఎంపీ వివేక్‌

తెలంగాణలో కేసీఆర్‌ సొంత రాజ్యాంగం: సుధాకర్‌ రెడ్డి

న్యూఢిల్లీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరిపించాలని బీజేపీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్‌ కోరారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మంగళవారం ప్రవేశపెట్టిన సామాజిక - ఆర్థిక తీర్మానంపై వివేక్‌, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం పేరిట సీఎం కేసీఆర్‌ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని వివేక్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని కేంద్రమే తెలంగాణలో అమలు చేయాలని కోరారు. ఆర్థిక ప్రగతితోనే దళిత, బహుజనులపై వివక్ష తగ్గుతుందని, దళిత పారిశ్రామికవేత్తల వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ను రూ.5200 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పొంగులేటి సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తోన్న కేసీఆర్‌ భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుదని తెలిపారు. కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆయా పథకాల అమలుపై సమీక్ష నిర్వహించాలని కోరారు.

Updated Date - 2023-01-18T04:15:43+05:30 IST