శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా..

ABN , First Publish Date - 2023-01-24T01:25:28+05:30 IST

ధరణి పోర్టల్‌ ద్వారా నిషేధిత జాబితాలో భూముల సవరణ, తొలగింపునకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉంది. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశాలు, సూచనలతో పెండింగ్‌ భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి.. ధరణి పోర్టల్‌లోని ఆప్షన్లను వినియోగిస్తున్నారు.

శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా..

‘ధరణి’తో భూవివాదాలకు చెక్‌పెట్టేందుకు యంత్రాంగం కృషి

ఆప్షన్ల సద్వినియోగంలో ఖమ్మం జిల్లా ముందంజ

ఖమ్మం కలెక్టరేట్‌, జనవరి 23 : ధరణి పోర్టల్‌ ద్వారా నిషేధిత జాబితాలో భూముల సవరణ, తొలగింపునకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉంది. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశాలు, సూచనలతో పెండింగ్‌ భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి.. ధరణి పోర్టల్‌లోని ఆప్షన్లను వినియోగిస్తున్నారు. అయితే జీఎల్‌ఎం(గ్రీవెన్స లాండ్‌ మ్యాటర్స్‌) నిషేధిత జాబితాలో భూముల సవరణ, తొలగింపు తదితర అంశాలపై సీసీఎల్‌ఏ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు గత నవంబరులో ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నో నిషేధిత భూములకు మోక్షం లభించినట్లైంది. కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టారు. రిజిస్ర్టేషన్ల చట్టం సెక్షన్‌ 22(ఏ-ఈ( లోని నిషేధిత జాబితా, పీవోబీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములకు మోక్షం కల్పించేందుకు జాబితాలో సవరణలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

జాబితాకు ఎలా వచ్చాయంటే..

ప్రభుత్వం నిర్దేశించిన సర్వేనెంబర్లతో పాటు పట్టాభూములు కోర్టు కేసులున్న భూములు ఇలా అనేక రకాల భూములకు సర్వేనెంబర్లు ఈ జాబితాలో చేరిపోయాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ భూ సమస్యలపై 45,667దరఖాస్తులు ధరిణి ద్వారా కలెక్టర్‌కు అందాయి. వీటిలో మ్యుటేషన్‌ 12,166, ఎల్‌ఫాం సమస్యలు 1097, గ్రీవెన్స లాండ్‌ మ్యాటర్స్‌ కింద 7082, సక్సేషన వితఔట్‌ పీపీబీ 729, వ్యక్తిగత పీవోబీ 14,607 ప్రవాసీయుల పీపీబీలు 109, కోర్టు కేసుల్లో 256, నాలా పీపీబీ 276, పెండింగ్‌ నాలా, సెమీ అర్బన్‌ ల్యాండ్స్‌, ఇళ్ల స్థలాల నాలా, ఖాతా మెర్జింగ్‌ రిపోర్టులు పీపీబీ డేటా కరెక్షన 7,963 ఇలా 17విభాగాల్లో 45,667దరఖాస్తులు ధరణి వెబ్‌సైట్‌లో అందాయి.

38,861 దరఖాస్తుల పరిష్కారం

కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ పారదర్శకంగా ధరణి ద్వారా వచ్చిన సమస్యల సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. ఈ నేపథ్యంలో ధరణి సమస్యల పరిష్కారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా దాదాపు ప్రథమ స్థానానికి చేరింది. జిల్లాలో 45,667 దరఖాస్తుల్లో 38,861 పరిష్కారమవగా.. మరో 24,698 దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నాయి. వీటిలో 7740 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.అధికారుల పొరబాట్లుతో నిషేధిత జాబితాలో చేరితే ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయకపోవడంతో చాలా భూములు నిషేధిత జాబితాలో ఉండిపోయి భూ యజమానులకు పాస్‌ పుస్తకాలు లేక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభించింది. ప్రస్తుతం భూముల విక్రయాలు, రిజిస్ర్టేషన్లు సులువవగా.. రైతులు ఇలాంటి సమస్యలపై కలెక్టరేట్‌కు రావడం, సమస్యలు నమోదవ్వడం తగ్గిపోయింది. అలాగే ఎర్రుపాలెం మండలం జమలాపురం, రేమిడిచర్ల ప్రాంతాల్లో, పెనుబల్లి మండలం తాళ్లపెంట, మండాలపాడు, లంకపల్లి , సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి, సింగరేణి మండలంల మాధారం, కల్లూరు మండలం లోకారం గ్రామాల్లో బల్క్‌గా భూసమస్యలను సుమోటోగా తీసుకుని యాజమాన్యపు హక్కులను కల్పించారు. 1,158.32ఎకరాల భూమికి 582మంది రైతులకు యాజమాన్యపు హక్కులు పొందగలిగారు. జిల్లా వ్యాప్తంగా ధరణి ప్రాజెక్టు ద్వారా 52,652 రిజిస్ర్టేషన్లు వివిధ తహసీల్దార్‌ కార్యాలయాల్లో లావాదేవీలు జరిగాయి.

Updated Date - 2023-01-24T01:25:28+05:30 IST