Tej Narine : తేజ్‌ నరైన్‌ అరుదైన డబుల్‌

ABN , First Publish Date - 2023-02-07T02:54:53+05:30 IST

ఓపెనర్‌ తేజ్‌ నరైన్‌ చందర్‌పాల్‌ (207 నాటౌట్‌) అరుదైన డబుల్‌ సెంచరీ ఫీట్‌తో.. జింబాబ్వేతో తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ భారీ స్కోరు చేసింది.

Tej Narine : తేజ్‌ నరైన్‌ అరుదైన డబుల్‌

వెస్టిండీస్‌ 447/6 డిక్లేర్డ్‌

జింబాబ్వే 114/3

బులవాయో: ఓపెనర్‌ తేజ్‌ నరైన్‌ చందర్‌పాల్‌ (207 నాటౌట్‌) అరుదైన డబుల్‌ సెంచరీ ఫీట్‌తో.. జింబాబ్వేతో తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 221/0తో మూడో రోజు ఆటను కొనసాగించిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను 447/6 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. మొదటి వికెట్‌కు కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ (182), చందర్‌పాల్‌ 336 పరుగులతో విండీస్‌ తరఫున అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, ద్విశతకానికి చేరువలో మసకద్జా బౌలింగ్‌లో బ్రాత్‌వైట్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. బ్రెండన్‌ మవుటా (5/140) ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన జింబాబ్వే సోమవారం ఆఖరికి 3 వికెట్లకు 114 పరుగులు చేసింది. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు జింబాబ్వే ఇంకా 333 పరుగులు వెనుకబడింది.

టెస్టుల చరిత్రలో సుదీర్ఘంగా 686 బంతుల్లో 335 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్‌ జోడీగా శ్రీలంకకు చెందిన జయసూర్య-ఆటపట్టు జోడీ నిలవగా.. బ్రాత్‌వైట్‌-తేజ్‌ నరైన్‌ జంట 685 బంతుల్లో 336 పరుగులు చేసింది.

9.jpg

తండ్రిని మించిన తనయుడు..:

కొన్ని నెలల క్రితమే కరీబియన్‌ టీమ్‌లోకి వచ్చిన తేజ్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. టెస్టుల్లో నమోదు చేసిన తొలి సెంచరీనే ద్విశతకంగా మార్చాడు. దీంతో క్రికెట్‌లో ‘డబుల్‌’ ఘనతను అందుకొన్న రెండో తండ్రీ-కొడుకులుగా అరుదైన రికార్డు నమోదైంది. విండీస్‌ మాజీ బ్యాటర్‌ శివ్‌నరైన్‌ చందర్‌పాల్‌ కుమారుడే తేజ్‌ నరైన్‌. సీనియర్‌ చందర్‌పాల్‌ 2005లో దక్షిణాఫ్రికాపై, 2012లో బంగ్లాదేశ్‌పై అజేయంగా 203 పరుగుల స్కోరును రెండుసార్లు చేశాడు. ఇప్పుడు టెస్టుల్లో తండ్రి అత్యధిక స్కోరును కుమారుడు తేజ్‌ అధిగమించాడు. పాకిస్థాన్‌కు చెందిన హనీఫ్‌ మహ్మద్‌-షోయబ్‌ మహ్మద్‌ టెస్టుల్లో డబుల్‌ సెంచరీ చేసిన తొలి తండ్రీకొడుకులు. హనీఫ్‌ (337) ట్రిపుల్‌ సెంచరీ చేయగా.. షోయబ్‌ 203 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా, లాలా-మొహిందర్‌ అమర్‌నాథ్‌, విజయ్‌-సంజయ్‌ మంజ్రేకర్‌, ఇఫ్తికార్‌-మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీలు శతకాలు సాధించారు.

Updated Date - 2023-02-07T02:54:54+05:30 IST