India won the series : నెం.1 క్లీన్‌స్వీప్‌

ABN , First Publish Date - 2023-01-25T00:44:02+05:30 IST

409, 373, 390, 349, 385.. మొదట బ్యాటింగ్‌ చేసిన చివరి ఐదు వన్డేల్లో టీమిండియా స్కోర్లివి. మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కివీస్‌ బౌలింగ్‌కు మొగ్గు చూపినా.. భారత ఓపెనర్లు రోహిత్‌, గిల్‌ ఇండోర్‌

India won the series : నెం.1 క్లీన్‌స్వీప్‌

3-0తో సిరీస్‌ భారత్‌ కైవసం

చివరి వన్డేలోనూ కివీస్‌ చిత్తు

గిల్‌, రోహిత్‌ శతకాలు

కాన్వే సెంచరీ వృథా

409, 373, 390, 349, 385.. మొదట బ్యాటింగ్‌ చేసిన చివరి ఐదు వన్డేల్లో టీమిండియా స్కోర్లివి. మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కివీస్‌ బౌలింగ్‌కు మొగ్గు చూపినా.. భారత ఓపెనర్లు రోహిత్‌, గిల్‌ ఇండోర్‌ మైదానాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా మూడేళ్ల సెంచరీ లోటును హిట్‌మ్యాన్‌ తీర్చేసుకున్నాడు. భారీ షాట్లతో తనలో సత్తా తగ్గలేదని విమర్శకులకు బదులిచ్చాడు. ఇక సంచలన ఫామ్‌ను కొనసాగిస్తున్న శుభ్‌మన్‌ గిల్‌ మరో సెంచరీతో వహ్వా అనిపించాడు. అటు భారీ ఛేదనలో కాన్వే, నికోల్స్‌ దూకుడు కివీస్‌లో ఆశలు రేపినా.. కీలక సమయాల్లో శార్దూల్‌, కుల్దీప్‌ వికెట్లు తీశారు. ఫలితంగా భారత్‌కు హ్యాట్రిక్‌ విజయంతో పాటు నెంబర్‌వన్‌ ర్యాంకు వశమైంది.

తక్కువ ఇన్నింగ్స్‌ (21)లోనే నాలుగు శతకాలు బాదిన తొలి భారత బ్యాటర్‌గా గిల్‌. అలాగే మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో ఎక్కువ పరుగులు (360) సాధించిన బ్యాటర్‌గా బాబర్‌ ఆజమ్‌తో గిల్‌ సమంగా నిలిచాడు.

కివీస్‌పై తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (212) అందించిన జోడీగా రోహిత్‌-గిల్‌

ఇండోర్‌: టీమిండియా ఖాతాలో ఈ ఏడాది వరుసగా రెండో క్లీన్‌స్వీ్‌ప. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో శుభ్‌మన్‌ గిల్‌ (78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 112), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 101) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో భారత్‌ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీ్‌సను 3-0తో వశం చేసుకుంది. మరోవైపు 2020, జనవరి తర్వాత రోహిత్‌ వన్డేల్లో సాధించిన ఈ శతకం అతడి కెరీర్‌లో రెండో వేగవంతమైనది. ఓపెనర్ల ధాటికి ముందుగా భారత్‌ 50 ఓవర్లలో 385/9 స్కోరు చేసింది. హార్దిక్‌ పాండ్యా (54) అర్ధసెంచరీ సాధించాడు. డఫీ, టిక్నెర్‌కు చెరో 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో కివీస్‌ 41.2 ఓవర్లలో 295 పరుగులే చేసింది. డెవాన్‌ కాన్వే (100 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 138), నికోల్స్‌ (42), శాంట్నర్‌ (34) పోరాడారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ శార్దూల్‌, కుల్దీ్‌పలకు మూడేసి వికెట్లు దక్కగా.. చాహల్‌ 2 వికెట్లు తీశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా గిల్‌ నిలిచాడు.

ఆరంభం బాగున్నా..: భారీ ఛేదనలో కివీస్‌ 25 ఓవర్లలోనే 184/2 స్కోరుతో అత్యంత పటిష్టంగా కనిపించింది. తొలి ఓవర్‌లోనే ఆ జట్టు ఓపెనర్‌ ఆలెన్‌ (0) వికెట్‌ కోల్పోయినా.. కాన్వే, నికోల్స్‌ విజృంభణ భారత్‌ను వణికించింది. కానీ 26వ ఓవర్‌లో శార్దూల్‌ 2 వికెట్లు తీసి జట్టు లయను దెబ్బతీయడం కలిసొచ్చింది. అలాగే కివీస్‌ ఆశించినట్టు మంచు ప్రభావం అంతగా కనిపించలేదు. అంతకుముందు ఓపెనర్‌ కాన్వే, నికోల్స్‌ బంతిని చక్కగా అంచనా వేస్తూ బౌలర్లను సులువుగా ఎదుర్కొన్నారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో వేగంగా స్కోరు పెంచారు. ఓవర్‌కు 11 రన్‌రేట్‌తో దూసుకెళ్లిన స్కోరుబోర్డుకు ముందుగా కుల్దీప్‌ బ్రేక్‌ వేశాడు. 15వ ఓవర్‌లో నికోల్స్‌ను ఎల్బీ చేయడంతో రెండో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు కాన్వే 58 రన్స్‌ దగ్గరున్నప్పుడు ఇషాన్‌ స్టంపౌట్‌ను మిస్‌ చేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ అతను 24వ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో 71 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇక పది బంతుల వ్యవధిలోనే డారిల్‌ మిచెల్‌ (24), కెప్టెన్‌ లాథమ్‌ (0), ఫిలిప్స్‌ (5)ను శార్దూల్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఇక, కాన్వే జోరుకు ఉమ్రాన్‌ బ్రేక్‌ వేయడంతో అప్పటిదాకా ఛేదన వైపు సాగుతున్న కివీస్‌ వెనక్కి తగ్గింది. తొలి వన్డే హీరో బ్రేస్‌వెల్‌ (26) కుల్దీప్‌ ఓవర్‌లో స్టంప్‌ కావడంతో కివీస్‌ ఆశలు పూర్తిగా అడుగంటాయి. అప్పటికి 116 పరుగులు కావాల్సి ఉండగా శాంట్నర్‌ పోరాటం ఫలితాన్నివ్వలేదు.

ఓపెనర్ల ద్విశతక భాగస్వామ్యం: వాస్తవానికి భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభానికి.. ముగిసిన తీరుకు సంబంధమే లేదు. ఓపెనర్లు రోహిత్‌, గిల్‌ బాదుడుకు జట్టు 26 ఓవర్లలోనే 212 స్కోరు సాధించింది. అప్పటికింకా సగం ఓవర్లు ఉండడంతో స్కోరు 450+ పక్కా అనిపించింది. కానీ మెరుపు ఆరంభాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పటిలాగే మిడిలార్డర్‌ విఫలమైంది. అయితే ఆఖర్లో హార్దిక్‌ పుణ్యమా అని స్కోరు 380+ వరకు చేరింది. చాన్నాళ్లుగా మూడంకెల స్కోరు సాధించలేకపోతున్న కెప్టెన్‌ రోహిత్‌ ఈ మ్యాచ్‌లో చెలరేగాడు. 6 సిక్సర్లు, 9 ఫోర్లతో కివీ్‌సను హడలెత్తించి కెరీర్‌లో 30వ శతకం సాధించాడు. తొలి 26 ఓవర్లపాటు హిట్‌మ్యాన్‌, గిల్‌ ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చూపారు. ఫెర్గూసన్‌ ఓవర్‌లో 4,0,4,4,6,4తో గిల్‌ 22 రన్స్‌ సాధించాడు. పదో ఓవర్‌లో రోహిత్‌ 4,6,6తో బ్యాట్‌ ఝుళిపించాడు. పోటాపోటీ ఆటతీరుతో 26వ ఓవర్‌లోనే ఇద్దరి సెంచరీలు పూర్తి కావడం విశేషం. గిల్‌కిది చివరి నాలుగు వన్డేల్లో మూడో శతకం. తర్వాతి ఓవర్‌లోనే బ్రేస్‌వెల్‌ తక్కువ ఎత్తుతో వేసిన బంతికి రోహిత్‌ బౌల్డయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 212 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే గిల్‌ను టిక్నెర్‌ అవుట్‌ చేయగా.. మిడిలార్డర్‌లో కోహ్లీ (36), ఇషాన్‌ (17), సూర్యకుమార్‌ (14) ప్రభావం చూపలేదు. అయితే 313/6 స్కోరుతో ఉన్న జట్టుకు హార్దిక్‌, శార్దూల్‌ (25) జోడీ ఏడో వికెట్‌కు 54 పరుగులతో విలువైన భాగస్వామ్యం అందించింది. చివరి పది ఓవర్లలో భారత్‌ 87 పరుగులే సాధించింది.

స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌: ఫిన్‌ అలెన్‌ (బి) హార్దిక్‌ 0, డెవాన్‌ కాన్వే (సి) రోహిత్‌ (బి) ఉమ్రాన్‌ 138, హెన్రీ (ఎల్బీ) కుల్దీప్‌ 42, డారిల్‌ మిచెల్‌ (సి) ఇషాన్‌ (బి) శార్దూల్‌ 24, లాథమ్‌ (సి) హార్దిక్‌ (బి) శార్దూల్‌ 0, ఫిలిప్స్‌ (సి) కోహ్లీ (బి) శార్దూల్‌ 5, బ్రేస్‌వెల్‌ (స్టంప్‌) ఇషాన్‌ (బి) కుల్దీప్‌ 26, శాంట్నర్‌ (సి) కోహ్లీ (బి) చాహల్‌ 34, ఫెర్గూసన్‌ (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 7, డఫీ (ఎల్బీ) చాహల్‌ 0, టిక్నర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 41.2 ఓవర్లలో 295 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-106, 3-184, 4-184, 5-200, 6-230, 7-269, 8-279, 9-280, 10-295; బౌలింగ్‌: హార్దిక్‌ పాండ్యా 6-0-37-1, వాషింగ్టన్‌ సుందర్‌ 6-0-49-0, శార్దూల్‌ ఠాకూర్‌ 6-0-45-3, ఉమ్రాన్‌ మాలిక్‌ 7-0-52-1, కుల్దీప్‌ యాదవ్‌ 9-0-62-3, చాహల్‌ 7.2-0-43-2.

వన్డేల్లో ఎక్కువ సెంచరీలు (30) చేసిన మూడో బ్యాటర్‌గా పాంటింగ్‌ను సమం చేసిన రోహిత్‌. సచిన్‌ (49), కోహ్లీ (46) ముందున్నారు.

ఓ వన్డే మ్యాచ్‌లో అత్యధిక (100) పరుగులిచ్చిన మూడో కివీస్‌ బౌలర్‌గా జాకబ్‌ డఫీ

విజయాగ్రస్థానం..

ఇటీవల శ్రీలంకతో.. తాజాగా కివీస్‌పై అద్భుత ప్రదర్శన కారణంగా అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ రోహిత్‌ సేన నెంబర్‌వన్‌ (114 పాయింట్లు) స్థానానికి చేరింది. భారత్‌తో రెండో వన్డేలో ఓటమితోనే కివీస్‌ టాప్‌ ర్యాంకు నుంచి రెండో స్థానానికి పడిపోయింది. ఆ సమయంలో ఇంగ్లండ్‌కు అగ్రస్థానం దక్కింది. అయి తే, తాజాగా కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం తో భారత్‌ ఇప్పుడు మూడు నుంచి ఒకటో స్థానంలో నిలిచింది. ఇక వైట్‌వా్‌షకు గురైన కివీస్‌ జట్టు ఆసీస్‌ తర్వాత నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా, ఈ టాప్‌-4 జట్ల మధ్య కేవలం ఒక్కో పాయింట్‌ తేడా మాత్రమే ఉండడం గమనార్హం.

Updated Date - 2023-01-25T07:04:30+05:30 IST