Shubman Gill : గిల్‌.. జిగేల్‌

ABN , First Publish Date - 2023-02-02T00:56:14+05:30 IST

వరుసగా విఫలమవుతూ పొట్టి ఫార్మాట్‌లో చోటు అవసరమా? అనే విమర్శలకు శుభ్‌మన్‌ గిల్‌ కళ్లు చెదిరే ఆటతీరుతో

Shubman Gill : గిల్‌.. జిగేల్‌

వరుసగా విఫలమవుతూ పొట్టి ఫార్మాట్‌లో చోటు అవసరమా? అనే విమర్శలకు శుభ్‌మన్‌ గిల్‌ కళ్లు చెదిరే ఆటతీరుతో సమాధానమిచ్చాడు. ఇంతకుముందు ఆడిన 5 టీ20ల్లో తను చేసింది 76 పరుగులే. కానీ కివీస్‌తో జరిగిన సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌లో మాత్రం చక్కటి డ్రైవ్స్‌, పుల్‌ షాట్లతో టాప్‌గేర్‌లో సాగిన అతడి ఆటతీరుకు అలవోకగా శతకం వచ్చి చేరింది. ఇక భారీ ఛేదనలో కివీస్‌ బ్యాటర్లు కనీసం వంద రన్స్‌ కూడా చేయలేకపోయారు. నిప్పులు చెరిగే బంతులతో పేసర్లు కివీస్‌ను కకావికలు చేయడంతో భారత్‌ సిరీస్‌ అందుకుంది.

అహ్మదాబాద్‌: సొంత గడ్డపై జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్‌ జైత్రయాత్ర సాగిస్తోంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 126 నాటౌట్‌) అజేయ శతకానికి తోడు.. హార్దిక్‌ (30; 4/16) బ్యాట్‌, బంతితో మెరిశాడు. దీంతో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో భారత్‌ 168 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. వన్డే సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు స్వదేశంలో టీమిండియాకిది వరుసగా 12వ సిరీస్‌ విజయం కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు చేసింది. త్రిపాఠి (44), సూర్యకుమార్‌ (24) వేగంగా ఆడారు. ఆ తర్వాత ఛేదనలో కివీస్‌ 12.1 ఓవర్లలో 66 పరుగులకు కుప్పకూలింది. మిచెల్‌ (35), శాంట్నర్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఉమ్రాన్‌, మావి, అర్ష్‌దీప్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గిల్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా హార్దిక్‌ పాండ్యా నిలిచారు.

పేసర్ల హవా: భారీ లక్ష్యం కళ్లముందుండగా కివీస్‌ ఆటతీరు మాత్రం మరోలా సాగింది. కనీసం గిల్‌ ఒక్కడి స్కోరునైనా అధిగమించలేకపోయింది. మూడు ఓవర్లు కూడా పూర్తికాకముందే నలుగురు బ్యాటర్లు అవుటయ్యారు. అప్పటికి స్కోరు 7 పరుగులు మాత్రమే. తొలి ఓవర్‌లోనే ఆలెన్‌ (3)ను హార్దిక్‌ అవుట్‌ చేయగా.. రెండో ఓవర్‌లో అర్ష్‌దీప్‌ రెండు వికెట్లతో వణికించాడు. సూర్యకుమార్‌ గాల్లోకి ఎగిరి అద్భుత క్యాచ్‌ తీసుకోవడంతో ఫిలిప్స్‌ (2) పేలవ ఫామ్‌ కొనసాగినట్టయింది. ఉమ్రాన్‌ సూపర్‌ లెంగ్త్‌ బాల్‌కు బ్రేస్‌వెల్‌ (8) మిడ్‌ వికెట్‌ నేలకూలింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో డారిల్‌ మిచెల్‌, కెప్టెన్‌ శాంట్నర్‌ ఆరో వికెట్‌కు అత్యధికంగా 32 పరుగులు జోడించారు. తొమ్మిదో ఓవర్‌లో శాంట్నర్‌, సోధీ (0)లను శివమ్‌ మావి అవుట్‌ చేయడంతో 53/7 స్కోరుతో కివీస్‌కు తమ పరిస్థితి అర్థమైంది. ఆఖరి మూడు వికెట్లు మరో నాలుగు ఓవర్లలోనే కోల్పోయి చిత్తుగా ఓడింది.

తొలి శతకంతో అదుర్స్‌: సహజంగా ఇక్కడ టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ వైపు మొగ్గు చూపుతుంది. కానీ కెప్టెన్‌ పాండ్యా వైపు బ్యాటింగ్‌కు సై అన్నాడు. అయితే ఎప్పటిలాగే ఓపెనర్‌ ఇషాన్‌ (1) రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో పొట్టి ఫార్మాట్‌లో తడబడుతున్న మరో ఓపెనర్‌ గిల్‌ ఏం చేస్తాడోననిపించింది. కానీ తను మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. మైదానం నలువైపులా చక్కటి షాట్లతో హోరెత్తిస్తూ జట్టుకు భారీ స్కోరునందించాడు. హార్దిక్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 40 బంతుల్లోనే 103 పరుగులందించడం విశేషం. మూడో ఓవర్‌లోనే రెండు ఫోర్లతో బ్యాట్‌కు పనిచెప్పగా.. ఇక ఐదో ఓవర్‌లో మరో మూడు ఫోర్లతో కదం తొక్కాడు. అటు త్రిపాఠి మరింత వేగం కనబర్చి ఫైన్‌ లెగ్‌ వైపు భారీ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. దీంతో గిల్‌ కాస్త నిదానించాడు. అయితే అర్ధసెంచరీ ఖాయమనుకున్న త్రిపాఠిని తొమ్మిదో ఓవర్‌లో సోధీ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఆ తర్వాత గిల్‌ విజృంభణకు కివీస్‌ బౌలర్లు కుదేలైపోయారు. 35 బంతుల్లో తొలి ఫిఫ్టీ పూర్తి చేసిన తను ఆ తర్వాత మరో ఫిఫ్టీకి కేవలం 19 బంతులే అవసరమయ్యాయి. ఉన్న కాసేపు వేగంగా ఆడిన సూర్య (24) 13వ ఓవర్‌లో వెనుదిరిగాడు. అయితే గిల్‌-హార్దిక్‌ చివరి 30 బంతుల్లో 61 పరుగులు అందించారు. 16వ ఓవర్‌లో గిల్‌ రెండు సిక్సర్లు.. తర్వాతి ఓవర్‌లో 6,4,6తో పరుగుల వరద పారించాడు. మరో ఫోర్‌తో 54 బంతుల్లోనే కెరీర్‌లో తొలి శతకం పూర్తి చేశాడు. 19వ ఓవర్‌లో 4,4,6తో 17 రన్స్‌ రాబట్టినా.. చివరి ఓవర్‌లో మిచెల్‌.. హార్దిక్‌ వికెట్‌ తీయడంతో పాటు 6 పరుగులే ఇచ్చాడు.

ఐసీసీ శాశ్వత సభ్య దేశాల మధ్య జరిగిన టీ20ల్లో అతి భారీ విజయం (168) సాధించిన జట్టుగా భారత్‌

అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక స్కోరు (126 నాటౌట్‌) సాధించిన బ్యాటర్‌గా గిల్‌. అలాగే కివీస్‌పై ఓవరాల్‌గా వన్డే (208), టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన ఏకైక బ్యాటర్‌గా గిల్‌

అన్ని ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన అత్యంత పిన్నవయస్కుడి (23 ఏళ్లు)గా గిల్‌. ఓవరాల్‌గా ఐదో భారత బ్యాటర్‌. గతంలో రైనా, రోహిత్‌, రాహుల్‌, విరాట్‌ సాధించారు.

స్కోరుబోర్డు

భారత్‌: ఇషాన్‌ (ఎల్బీ) బ్రేస్‌వెల్‌ 1; గిల్‌ (నాటౌట్‌) 126; త్రిపాఠి (సి) ఫెర్గూసన్‌ (బి) సోధీ 44; సూర్యకుమార్‌ (సి) బ్రేస్‌వెల్‌ (బి) టిక్‌నెర్‌ 24; హార్దిక్‌ (సి) బ్రేస్‌వెల్‌ (బి) మిచెల్‌ 30; హుడా (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 234/4. వికెట్ల పతనం: 1-7, 2-87, 3-125; 4-228. బౌలింగ్‌: లిస్టర్‌ 4-0-42-0; బ్రేస్‌వెల్‌ 1-0-8-1; ఫెర్గూసన్‌ 4-0-54-0; టిక్నెర్‌ 3-0-50-1; సోధీ 3-0-34-1; శాంట్నర్‌ 4-0-37-0; మిచెల్‌ 1-0-6-1.

కివీస్‌: ఆలెన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ 3; కాన్వే (సి) హార్దిక్‌ (బి) అర్ష్‌దీప్‌ 1; చాప్‌మన్‌ (సి) ఇషాన్‌ (బి) అర్ష్‌దీప్‌ 0; ఫిలిప్స్‌ (సి) సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ 2; మిచెల్‌ (సి) మావి (బి) ఉమ్రాన్‌ 35; బ్రేస్‌వెల్‌ (బి) ఉమ్రాన్‌ 8; శాంట్నర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) మావి 13; సోధీ (సి) త్రిపాఠి (బి) మావి 0; ఫెర్గూసన్‌ (సి) ఉమ్రాన్‌ (బి) హార్దిక్‌ 0; టిక్నెర్‌ (సి) ఇషాన్‌ (బి) హార్దిక్‌ 1; లిస్టర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 12.1 ఓవర్లలో 66. వికెట్ల పతనం: 1-4, 2-4, 3-5, 4-7; 5-21, 6-53, 7-53, 8-54, 9-66, 10-66. బౌలింగ్‌: హార్దిక్‌ 4-0-16-4; అర్ష్‌దీప్‌ 3-0-16-2; ఉమ్రాన్‌ 2.1-0-9-2; కుల్దీప్‌ 1-0-12-0; మావి 2-0-12-2.

Untitled-7.jpg

Updated Date - 2023-02-02T07:06:20+05:30 IST