Women Premier League : మహిళల లీగ్‌లో అదానీ, అంబానీ
ABN , First Publish Date - 2023-01-26T00:34:23+05:30 IST
అహ్మదాబాద్ టీమ్‌ను అదానీ స్పోర్ట్స్‌లైన్ అత్యధికంగా రూ. 1289 కోట్లకు ఖరీదు చేసింది. ఐపీఎల్లో అహ్మదాబాద్ టీమ్‌ను

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) జట్ల వేలం బీసీసీఐకు ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. ఆరంభ లీగ్‌లో ఐదు జట్ల అమ్మకానికిగానూ బోర్డుకు రూ. 4669.99 కోట్ల ఆదాయం సమకూరింది. లీగ్‌ను ప్రకటించినప్పటి నుంచే కార్పొరేట్ కంపెనీలు ఫ్రాంచైజీలను దక్కించుకొనేందుకు ఉత్సాహం కనబర్చడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లో ఐపీఎల్ తర్వాత అ‘ధర’హో అనిపించింది. బిగ్‌బాష్ లీగ్, హండ్రెడ్ లీగ్ సహా ఏ దేశవాళీ లీగ్ కూడా డబ్ల్యూపీఎల్‌కు దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. బుధవారం ముంబైలో ఐదు జట్లు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లఖ్‌నవూలకు సంబంధించిన బిడ్లను బీసీసీఐ ఖరారు చేసింది. మొత్తం 17 బిడ్లు దాఖలైనట్టు బోర్డు తెలిపింది.
అహ్మదాబాద్‌కు భారీ ధర..: అహ్మదాబాద్ టీమ్‌ను అదానీ స్పోర్ట్స్‌లైన్ అత్యధికంగా రూ. 1289 కోట్లకు ఖరీదు చేసింది. ఐపీఎల్లో అహ్మదాబాద్ టీమ్‌ను దక్కించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమైన అదానీ గ్రూప్.. మహిళల లీగ్ ద్వారా ఎట్టకేలకు భారత క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు పోటీపడి.. ముంబై, బెంగళూరు, ఢిల్లీ జట్లను కొనుగోలు చేశాయి. కాగా, లఖ్‌నవూ టీమ్‌ను కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేజిక్కించుకుంది. ప్రసార హక్కుల ద్వారా సమకూరిన రూ. 951 కోట్లతో కలిపి.. ఒక్క బంతికూడా పడకుండానే మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా బోర్డు రూ. 5,650.99 కోట్ల రెవెన్యూ ఆర్జించినట్టయింది. కోల్‌కతా రూ. 666 కోట్ల బిడ్ వేసినా.. మిగతా పోటీదారులు అంతకంటే ఎక్కువ కోట్ చేశారు. దాఖలైన టెండర్లలో రాజస్థాన్ రాయల్స్ రూ. 180 కోట్ల బిడ్ అన్నింటికంటే అత్యల్పం. 2008లో ఐపీఎల్ టీమ్‌ల ద్వారా వచ్చిన దానికంటే ఈ మొత్తం ఎంతో ఎక్కువని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు. అప్పుడు ముంబై ఇండియన్స్ రూ. 446 కోట్లతో అత్యధిక ధర పలికిన జట్టుగా టాప్‌లో నిలిచింది. ‘2008 ఐపీఎల్ రికార్డులను డబ్ల్యూపీఎల్ బద్దలుకొట్టింది. మహిళల క్రికెట్లో విప్లవానికి ఇది నాంది. అవసరమైన సంస్కరణలు తీసుకువస్తుంద’ని షా ట్వీట్ చేశాడు. ప్రముఖ స్నాక్స్ కంపెనీ హల్దీరామ్స్ కూడా బిడ్ దాఖలు చేసింది. వచ్చే నెలలో క్రికెటర్ల వేలం జరగనుంది. మొత్తం రూ. 12 కోట్ల పర్స్ మనీ నుంచి కనీసం 15 మంది ప్లేయర్లు.. గరిష్ఠంగా 18 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీరిలో ఐదుగురు విదేశీ క్రికెటర్లను మాత్రమే ఖరీదు చేయాలి.
డబ్ల్యూపీఎల్‌లో జట్లను ఖరీదు చేసిన ఫ్రాంచైజీలు..
ఫ్రాంచైజీ జట్లు ధర
అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అహ్మదాబాద్ రూ. 1289 కోట్లు
ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై రూ. 912.99కోట్లు
రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు రూ. 901 కోట్లు
జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ రూ. 810 కోట్లు
కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లఖ్‌నవూ రూ. 757 కోట్లు