వీడియో కాల్ లో భార్యతో గొడవ.. ఉరి బిగించుకున్న భర్త.. కాల్ కట్ చేసి మరీ ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-01-31T14:41:13+05:30 IST

వీడియో కాల్ చేసి లైవ్ లోనే ఉరి బిగించుకున్నా..

వీడియో కాల్ లో భార్యతో గొడవ.. ఉరి బిగించుకున్న భర్త.. కాల్ కట్ చేసి మరీ ఆమె ఏం చేసిందంటే..

అతడు భార్యతో గొడవ పడ్డాడు. గొడవ వల్ల భార్య చాలా బాధపడింది. 'నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, నీ దగ్గర ఉండను' అని చెప్పింది. 'బెదిరిస్తున్నావా పోతే పో.. నాకేమి బాధలేదు' అని అన్నాడు అతను. గొడవ జరిగింది మాత్రమే కాకుండా భర్త అలా అనేసరికి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే ఆ తరువాత అతను వీడియో కాల్ చేసి లైవ్ లోనే ఉరి బిగించుకున్నాడు. ఊహించని పరిణామానికి ఆమె షాక్ కు గురయ్యింది. ఈ సంఘటనకు సంబందించి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లాలో గిర్వాయ్ ప్రాంతలో మన్మోహన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతని భార్య పేరు కవిత. ఇతను ప్రైవేట్ ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మన్మోహన్ భార్య కవితతో గొడవ పడ్డాడు. గొడవ తరువాత అతని భార్య కవిత పుట్టింటికి వెళుతున్నా అతను ఆపలేదు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తరువాత రెండురోజుల వరకు అతనికి ఏమీ అనిపించలేదు. కానీ కోపం తగ్గిపోయాక భార్య బాగా గుర్తొచ్చింది. అతను భార్యకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచాడు, ఎంతో బతిమలాడాడు. కానీ ఆమె ససేమీరా రానని మొండిగా చెప్పింది.

ఎన్ని సార్లు పిలిచినా ఆమె రాకపోయేసరికి అతను మేడపైన గదిలోకి వెళ్ళి ఆమెకు వీడియో కాల్ చేసాడు. 'ఇదిగో చూడు నువ్వు కనుక ఇంటికి రాకపోతే నేను ఉరి వేసుకుని చస్తాను' అని అన్నాడు. 'అదంతా ఒట్టి బెదిరింపే నన్ను తిరిగి ఇంటికి వచ్చేలా చెయ్యడానికి డ్రామా ప్లే చేస్తున్నాడు' అనుకుంది అతని భార్య. దాంతో ఇంకా మొండి చేస్తూ 'నేను రాను, నీ డ్రామాలకు నేను బెదిరిపోను' అని చెప్పింది. దీంతో మనస్తాపం చెందిన మన్మోహన్ 'సరే నీకు బెదిరింపుగా ఉందా చూడు అయితే' అని లైవ్ లోనే ఉరి వేసుకున్నాడు. అతని భార్య వెంటనే షాక్ నుండి తేరుకుని ఫోన్ కట్ చేసి తన అత్తమామలకు, మరిదికి ఫోన్ చేసి అలర్ట్ చేసింది. వారు పైనున్న గదికి చేరుకుని చూడగా మన్మోహన్ ఉరికి వేలాడుతూ గిలగిలా కొట్టుకుంటూ కనిపించాడు. వెంటనే ఉరితాడు కోసి అతడిని హాస్పిటల్ కు తరలించారు. సరైన సమయంలో అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్ళడం వల్ల ప్రమాదం తప్పిందని డాక్టర్లు తెలిపారు. భార్య ఇంటికి రాలేదనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసిందని, అతను కాస్త కోలుకున్నాక అతని వాంగ్మూలాన్ని బట్టి విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-01-31T14:41:15+05:30 IST