ఇల్లు కట్టుకోమని డబ్బులిస్తే.. నలుగురు భార్యలు జంప్.. అసలు విషయం ఇదీ..

ABN , First Publish Date - 2023-02-08T12:56:32+05:30 IST

సొంతం ఇల్లు తొందరలోనే పూర్తవుతుందిలే అనుకున్నారు కానీ వారు అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి..

ఇల్లు కట్టుకోమని డబ్బులిస్తే.. నలుగురు భార్యలు జంప్.. అసలు విషయం ఇదీ..

'ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు మంజూరు అయ్యాయి, ఇక ఎలాంటి సమస్య ఉండదులే..' అనుకున్నారు ఆ భర్తలు. కానీ వారు అనుకున్నది ఒకటి అయితే అక్కడ జరిగినది మరొకటి. జీవితభాగస్వాములే మోసం చేయడంతో ఏకంగా నలుగురు భర్తలు దిక్కుతెలియని స్థితిలో ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకి జిల్లాలోజరిగిన సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. పేదలకు ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేసిన డబ్బు నలుగురు భర్తలు మోసపోవడానికి కారణం అయ్యింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 40 మంది లబ్దిదారులకు మొదటి విడత నిధులు మంజూరు అయ్యాయి. ఇందులో ప్రతి ఒక్క లబ్దిదారునికి 50వేల రూపాయలు మంజూరు చేసారు. డబ్బు మంజూరు అయిన తరువాత జిల్లాలో పలు ప్రాంతాల్లో నలుగురు వ్యక్తుల భార్యలు కనిపించకుండా పోయారు. బ్యాంక్ ఖాతాలలో డబ్బు కూడా మాయమైంది. ఏమయ్యిందని ఆరాతీయగా ఇంటి నిర్మాణం కోసం మంజూరైన డబ్బును బ్యాంక్ అకౌంట్ నుండి డ్రా చేసుకుని నలుగురు మహిళలు తాము ప్రేమించిన వ్యక్తులతో పారిపోయారు.

మహిళలు డబ్బు తీసుకుని పారిపోవడంతో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఇంటి పనులను పర్యవేక్షించే నిర్మాణాధికారులు ఎలాంటి పనులు జరగకపోవడం గమనించి నిర్ణీత గడువులో ఇంటినిర్మాణ పనులు మొదలుపెట్టకపోతే ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బును రికవరీ చేస్తామని చెప్పారు. దీంతో సదరు మహిళల భర్తల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇంటి పనులు జరుపుకోవాలంటే ప్రస్తుతం డబ్బుకావాలి, ఉన్న డబ్బు కాస్తా భార్యలు తీసుకుని వెళ్ళిపోయారు. కనీసం ప్రభుత్వానికి డబ్బు వెనక్కు ఇచ్చెయ్యాలన్నా వారికి డబ్బు అవసరం. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలాగా తయారయ్యింది వారి పరిస్థితి. వారు మాత్రం మాకు రెండవ విడతగా మంజూరు చెయ్యాల్సిన నిధులను ఆపుచేయండి అని వాపోతున్నారు.

Updated Date - 2023-02-08T16:35:09+05:30 IST