TDP కంచుకోటలో చంద్రబాబునే ఓడిస్తామంటూ వైసీపీ కంకణం..

ABN , First Publish Date - 2023-01-23T13:04:49+05:30 IST

చిత్తూరు జిల్లా కుప్పం ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ కంచుకోటలో చంద్రబాబునే

TDP కంచుకోటలో చంద్రబాబునే ఓడిస్తామంటూ వైసీపీ కంకణం..

టీడీపీ కంచుకోటలో పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయా?.. అధికార అండతో వైసీపీ కవ్వింపు చర్యలకు దిగుతోందా?.. దాడులు, దౌర్జన్యాలతో టీడీపీని బలహీన పర్చేందుకు సిద్ధమయ్యారా?.. ఆ నియోజకవర్గ పోలీసులు కూడా వన్‌సైడ్‌గా వ్యవహరిస్తున్నారా?.. లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు జగన్‌ పార్టీ ప్రయత్నాలు చేస్తోందా?.. ఇంతకీ.. ఏంటా నియోజకవర్గం?.. ఆ నియోజకవర్గంలో టీడీపీని వైసీపీ ఎందుకు టార్గెట్‌ చేసింది?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-250235.jpg

వైసీపీ.. రకరకాల ఎత్తుగడలు

చిత్తూరు జిల్లా కుప్పం ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ కంచుకోటలో చంద్రబాబునే ఓడిస్తామంటూ.. అధికారంలోకి వచ్చినప్పటినుంచి కంకణం కట్టుకున్న వైసీపీ.. రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుప్పంపై సామదానభేదదండోపాయాలను ప్రయోగిస్తోంది. టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయి. ప్రశాంతతకు మారుపేరైన కుప్పంలో.. వైసీపీ పుణ్యమా అని.. ఆ వాతావరణమే లేకుండా పోయింది. దీంతో.. వైసీపీ అరాచకాలపై టీడీపీ వీరోచిత పోరాటం చేయాల్సి వస్తోంది. అక్రమ కేసుల కారణంగా టీడీపీ శ్రేణులు జైళ్ళకు వెళ్ళక తప్పడం లేదు. అయితే.. వైసీపీ కక్షపూరిత చర్యలు.. ఒక్క టీడీపీ శ్రేణులకే కాదు.. స్థానిక ప్రజానీకానికి కూడా తీవ్ర ఇబ్బందిగా మారాయి.

Untitled-2254.jpg

వైసీపీ లేనిపోని కవ్వింపు చర్యలు

ఇక.. కుప్పం టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు చంద్రబాబు.. మూడు, నాలుగు నెలలకొకసారి సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే.. ఆయన కుప్పం వెళ్లిన ప్రతిసారి వైసీపీ లేనిపోని కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పరస్పరం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. పోలీసులు మాత్రం వన్‌సైడ్‌గా వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అధికార పార్టీ వారిని వదలిపెట్టి.. కేవలం టీడీపీ నేతలు, కార్యకర్తలపైనే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ శ్రేణులను అరెస్టులు చేసి జైళ్ళకు తరలించడం, వాళ్లు.. కోర్టులను ఆశ్రయించి ఉపశమనం పొందడం పరిపాటిగా మారిపోయింది. గత మూడు పర్యటనల్లో ఇలాంటి పరిణామాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. చంద్రబాబుకు ప్రజాదరణ పెరుగుతుండడంతో జీర్ణించుకోలేక.. వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

Untitled-2455.jpg

చంద్రబాబును ఓడించి తీరుతామంటూ పెద్దిరెడ్డి కంకణం

వాస్తవానికి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కుప్పంలోనే చంద్రబాబును ఓడించి తీరుతామంటూ పెద్దిరెడ్డి కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగా.. స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని రీతిలో టీడీపీని దెబ్బతీశారు. ఆయా ఎన్నికల్లో జరిగిన పరిణామాలు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. టీడీపీని కుప్పంలోనే ఓడించామని, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడం ఓ లెక్కా అంటూ సాక్షాత్తు సీఎం జగన్‌రెడ్డే వ్యాఖ్యలు చేయడం మరింత చర్చకు దారి తీశాయి. ఇటు.. టీడీపీని బలహీన పరుస్తూనే.. అటు.. వైసీపీ బలపడేందుకు ఉన్న అడ్డదారులను యథేచ్చగా వాడుకోవడం మొదలుపెట్టింది.

Untitled-2354.jpg

దీంతో.. అప్రమత్తమైన చంద్రబాబు.. సహజ సంపదలను వైసీపీ దుర్వినియోగం చేయడంపై కన్నెర్ర చేశారు. గ్రానైట్‌, ఇసుక అక్రమ వ్యాపారాలపై.. కేంద్ర పర్యావరణ ట్రిబ్యునల్ వరకు వెళ్ళారు. రానురాను ఆ పరిణామాలన్నీ పెద్దిరెడ్డి, ప్రభుత్వంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపింది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను పెద్దిరెడ్డి స్పీడప్‌ చేశారు. అవకాశం దొరికినపుడుల్లా కుప్పంలో టీడీపీని టార్గెట్‌ చేసి.. చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు.

Untitled-2065.jpg

చంద్రబాబు పర్యటనలకు విశేష స్పందన

మరోవైపు.. సీఎం జగన్.. కుప్పంలో పర్యటించేలా చేసి.. చంద్రబాబుపై అనేక అభాండాలు వేసి, స్థానిక ప్రజల్లో టీడీపీని బలహీన పరిచే ప్రయత్నాలు చేసారు. వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ పవర్‌ తగ్గకపోగా.. మైలేజ్‌ మరింత పెరిగినట్లు అయింది. చంద్రబాబు ఎక్కడా తగ్గకుండా.. మూడు నెలలకొకసారి కుప్పంలో పర్యటిస్తూ వస్తున్నారు. అయితే.. ఈ మధ్యకాలంలో.. మునుపెన్నడూ లేనంతగా చంద్రబాబు పర్యటనలకు విశేష స్పందన లభిస్తోంది. చంద్రబాబుకు ప్రజాదరణ పెరగడంతో వైసీపీ విస్తుపోతోంది. దీంతో.. ఎలాగైనా సరే.. అటంకాలు, అడ్డంకులు సృష్టించాలనే ధ్యాసతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఆ క్రమంలోనే.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందంటూ టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు చేయడం రాజకీయంగా హీట్‌ పుట్టిస్తోంది. తాజాగా.. జోవో నెంబర్ వన్ తీసుకొచ్చిన వైసీపీ.. ఈ నెల 4, 5, 6 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటనలను అడ్డుకోవడం జరిగింది. టీడీపీ శ్రేణులపై లాఠీలు ఝుళిపించడంతో పలువురు గాయాలు అయ్యాయి. కానీ.. పోలీసులు మాత్రం.. గాయాలైన బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేసే వరకు వెళ్లడం ప్రకంపనలు సృష్టించింది.

తండ్రి పెద్దిరెడ్డి లాగానే.. మిథున్‌రెడ్డి ..

ఇదిలావుంటే.. ఈ నెల 27 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. కుప్పం నుంచే యువగళం గర్జన పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు. అయితే.. ఆదిలోనే పాదయాత్రను నిర్వీర్యం చేసేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందనే టీడీపీ ఆరోపణలకు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. కుప్పంలో వైసీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయగా.. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు. కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామని.. తండ్రి పెద్దిరెడ్డి లాగానే.. మిథున్‌రెడ్డి కూడా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు.. కుప్పంలో చంద్రబాబుకు వచ్చిన మెజారిటీ అంతా.. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన దొంగ ఓటర్లదేనని.. దానిపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామనడం వివాదాస్పదంగా మారింది. అలాగే.. పాదయాత్రకు ఎవరూ వ్యతిరేకం కాదు.. ఎవరైనా చేసుకోవచ్చు.. కానీ.. చంద్రబాబు లాగా జగన్‌రెడ్డిపై హద్దులు మీరి మాట్లాడితే మాత్రం.. వైసీపీ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేయడం రాజకీయంగా హీట్ పెంచుతోంది.

Untitled-26584.jpg

మొత్తంగా.. కుప్పం రాజకీయాలు ఎన్నికలకు ముందే హీటెక్కుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుప్పాన్ని టార్గెట్‌ చేసిన వైసీపీ.. అధికార అండగా ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. టీడీపీ కంచుకోటలో చంద్రబాబు పర్యటనలనే అడ్డుకుంటూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. మరికొద్దిరోజుల్లో కుప్పం నుంచే లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అధికార పార్టీ శ్రేణుల నుంచి ఇంకెన్ని అటంకాలు ఎదురవుతాయో చూడాలి మరి.

Updated Date - 2023-01-23T13:08:54+05:30 IST