నిర్మల్‌ జిల్లాలో BRSకు తలనొప్పిగా మారిన మాస్టర్‌ ప్లాన్‌..

ABN , First Publish Date - 2023-01-25T11:57:10+05:30 IST

తెలంగాణలో మాస్టర్‌ మంటలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా.. మాస్టర్ ప్లాన్

 నిర్మల్‌ జిల్లాలో BRSకు తలనొప్పిగా మారిన మాస్టర్‌ ప్లాన్‌..

మాస్టర్‌ మంటలు నిర్మల్‌ జిల్లాలోనూ రగులుతున్నాయా?.. ఆ మంత్రికి కూడా మాస్టర్ ప్లాన్ సెగ తగులుతోందా?.. బీఆర్ఎస్ నేతలు, బడా బాబుల కోసమే ప్లాన్ రూపొందించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయా?.. చెరువులు, కుంటలను పూర్తిగా చెరబట్టడానికి మాస్టర్ ప్లాన్ వేశారా?.. ఇంతకీ.. మాస్టర్‌ ప్లాన్‌ సెగ తగులుతోన్న ఆ మంత్రి ఎవరు?.. అధికార పార్టీ నేతలపై విమర్శలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయి?.. అనే మరిన్నివిషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-1354.jpg

బడానేతలకు అనుకూలంగా మాస్టర్‌ప్లాన్‌

తెలంగాణలో మాస్టర్‌ మంటలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా.. మాస్టర్ ప్లాన్ సెగ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి తగులుతోంది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న నిర్మల్‌ మున్సిపాలిటీలో మాస్టర్‌ప్లాన్‌పై రగడ మొదలైంది. ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్ వెనుక.. బీఆర్‌ఎస్ నేతలకు వేరే ఆలోచనలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి. బడానేతలకు అనుకూలంగా మాస్టర్‌ప్లాన్‌ డ్రాఫ్ట్‌ రూపొందించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే.. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువులు, సర్కారు భూములను చెరబట్టిన బీఆర్ఎస్‌ నేతలు.. వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు కొత్త మాస్టర్ ప్లాన్‌ తయారు చేశారన్న చర్చ సాగుతోంది. సామాన్య రైతుల వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్‌ జోన్‌లోకి, ఇండస్ట్రియల్‌ జోన్‌ పరిధిలోని భూములను రెసిడెన్షియల్‌ జోన్‌లుగా చూపడంలో బీఆర్ఎస్‌ నేతల ఒత్తిడి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Untitled-145654.jpg

నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్‌ రగడలో.. ప్రధానంగా.. బైపాస్‌ రోడ్ల నిర్మాణాలకు సామాన్య రైతుల పంట పొలాలను చూపించడం.. రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. కమర్షియల్‌, ఇండస్ట్రీయల్‌, గ్రీన్‌ జోన్‌ల మార్పుతోపాటు చెరువుశిఖం, బఫర్‌జోన్‌ భూములను రిక్రియేషన్‌ జోన్‌ల పరిధిలోకి చేర్చడంపై వివాదాలు తలెత్తుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నేతల భూములను బఫర్‌జోన్‌ పరిధి నుంచి తప్పించేందుకే రిక్రియేషన్‌ జోన్‌ పరిధిలోకి మార్చారన్న వాదనలున్నాయి. దీంతో.. బడా బాబుల భూములను కాపాడుకునేందుకు.. అమాయకులు బలయ్యేలా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేశారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

పెద్దలకు లబ్ధి చేకూర్చేందుకే కొత్త మాస్టర్ ప్లాన్‌!

ఇదిలావుంటే.. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ధర్మాసాగర్‌ చెరువుతోపాటు సీతాసాగర్‌, కంచరోణి చెరువు, పల్లె చెరువు, మోతి తలాబ్‌ చెరువులకు సంబంధించిన శిఖం, బఫర్‌ జోన్‌ భూముల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఈ భూములను కొన్నిచోట్ల రెసిడెన్షియల్‌ జోన్‌గా చూపడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే.. చెరువు భూములు పెద్దఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. ఇప్పుడు కొత్తగా మాస్టర్‌ ప్లాన్‌ పేరిట మిగిలిన భూములను కూడా కబ్జా చేసేందుకు ప్లాన్ వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌పై బీజేపీ ఆందోళన బాట పట్టింది. అటు.. ఇష్టారీతి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కూడా ప్రత్యక్ష ఆందోళనలకు పిలుపునిచ్చింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు కోట్ల విలువైన చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెద్దలకు మరింత లబ్ది చేకూర్చేందుకే కొత్త మాస్టర్ ప్లాన్‌ రూపొందించారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

Untitled-15554.jpg

నిర్మల్ మున్సిపాలిటీలోనూ అదే పరిస్థితి

ఇక.. మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా.. ఆందోళనలు ఊపందుకోవడంతో గత అనుభవాల దృష్ట్యా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముందుగానే అలెర్ట్‌ అయ్యారు. ప్రస్తుతం తయారు చేసిన ప్లాన్..​కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనని, అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే.. కొత్త ప్లాన్‌ అమలు చేస్తామని ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. రైతుల ఆందోళనలతో ఇప్పటికే కామారెడ్డి, జగిత్యాల మున్సిపాలిటీల్లో మాస్టర్ ప్లాన్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కొత్తగా నిర్మల్ మున్సిపాలిటీలోనూ అదే పరిస్థితి కనిపిస్తుండడం చర్చగా మారుతోంది.

మొత్తంగా.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మాస్టర్ ప్లాన్ వివాదాలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. ప్రధానంగా.. అధికార బీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కొత్తగా తెరపైకి వచ్చిన నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్‌ రగడ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Updated Date - 2023-01-25T12:50:56+05:30 IST