ఏపీలో మారుతున్న రాజకీయాలు.. తాడేపల్లిగూడెంలో టీడీపీ పోటీ చేయడం ఖాయమా..?

ABN , First Publish Date - 2023-01-26T11:42:13+05:30 IST

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించాలని టీడీపీ కంకణం కట్టుకుంది. జగన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో

ఏపీలో మారుతున్న రాజకీయాలు.. తాడేపల్లిగూడెంలో టీడీపీ పోటీ చేయడం ఖాయమా..?

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ దృష్టి సారించిందా?.. కొంతమంది అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసిందా?.. కొందరిని బహిరంగంగా ప్రకటిస్తున్న టీడీపీ అధినేత.. మరికొన్ని చోట్ల అంతర్గతంగా పూర్తి చేశారా?.. అభ్యర్థులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే కాకుండా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలని సంకేతాలు ఇచ్చారా?.. ఇంతకీ.. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ పరిస్థితేంటి?... తాడేపల్లిగూడెం అభ్యర్థి ఎంపికపై హైకమాండ్ ఆలోచనేంటి?..అనే మరిన్నివిషయాలు ఏబీఎన్ ఇన్ సైడ్ లో తెలుసుకుందాం..

Untitled-1565.jpg

అధికార వైసీపీని ఓడించాలని టీడీపీ కంకణం

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించాలని టీడీపీ కంకణం కట్టుకుంది. జగన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో.. దాన్ని క్యాష్‌ చేసుకుని ఘనవిజయం సాధించాలని చూస్తోంది. దానికి తగ్గట్లే.. ఏడాదిన్నర ముందే.. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధిష్టానం ఫోకస్‌ పెట్టింది. గతంలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేసే హైకమాండ్.. ఈ సారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కొన్నిచోట్ల ముందుగానే అభ్యర్థుల ఎంపిక చేస్తోంది. ఈ క్రమంలో.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపై దృష్టి పెట్టిన అధిష్టానం.. కొన్నిస్థానాల్లో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గోపాలపురం టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా.. పోటీకి సిద్ధంగా ఉండాలంటూ మరికొందరు ఆశావహులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే టాక్‌ నడుస్తోంది. అదేవిధంగా.. తాడేపల్లిగూడెం టీడీపీ అభ్యర్థిగా వలవల మల్లిఖార్జునరావు అలియాస్‌ బాబ్జీకి కూడా సంకేతమిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయా పరిణామాలు చూస్తుంటే.. తాడేపల్లిగూడెం నుంచి టీడీపీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. జనసేనతో పొత్తు ఉంటే, తాడేపల్లిగూడెం స్థానాన్ని ఆ పార్టీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు లోకల్‌గా ప్రచారం సాగుతోంది. కానీ.. టీడీపీ అభ్యర్థిని రెడీగా ఉండాలని అధిష్టానం ఇండికేషన్స్‌ ఇవ్వడంతో అక్కడ టీడీపీ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.

జనసేన రంగప్రవేశంతో ఫలితాలు వైసీపీకి

వాస్తవానికి.. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పట్టు ఉంది. కానీ.. 2014 ఎన్నికల్లో అప్పట్లో బీజేపీ పొత్తు నేపథ్యంలో ఆ పార్టీకి కేటాయించింది. దాంతో పార్టీ వర్గాల్లో కొంత అసంతృప్తి ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా.. జనసేన రంగప్రవేశంతో ఫలితాలు వైసీపీకి అనుకూలంగా మారాయి. దీంతోపాటు.. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈలి నాని సరైన రీతిలో ఓటర్లను ఆకర్షించలేకపోయారనే ప్రచారం ఉంది. ఆయా పరిణామాల తర్వాత నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఈలి నానిని తప్పించి, వలవల మల్లిఖార్జునరావు పేరును ప్రకటించింది. అయితే.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఆయన్ను నియమించినా... బయటకు తెలియకుండా దాదాపు ఆరు నెలల పాటు ఓ జిల్లా స్థాయి నేత తొక్కి పట్టినట్లు ప్రచారం ఉంది. చివరికి.. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కల్పించుకోవడంతో.. పేరు వెల్లడించారు. ఇక.. టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన వలవల బాబ్జీ.. పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేపట్టి.. అధిష్టానం దగ్గర మంచి మార్కులే కొట్టేశారు. దాంతో పలుమార్లు పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు ఆయన్ను పిలిచి, నియోజకవర్గంలో పరిస్థితిని అడిగి తెలుసుకోవడమే కాకుండా, వారి దగ్గరున్న సర్వే రిపోర్టులతో సరిపోల్చుకున్నారు. అన్ని పరిణామాలు అనుకూలంగా ఉండడంతో వలవల బాబ్జీని ఎన్నికలకు రెడీగా ఉండాలని సూచించారు.

Untitled-1455.jpg

ఈసారి తాడేపల్లిగూడెం నుంచి పోటీ ఖాయం

ఇదిలావుంటే.. టీడీపీ అభ్యర్థిగా ఇప్పట్లో ప్రకటించమని.. ఎన్నికల సమయంలో ప్రకటిస్తామని.. అన్నిటికి రెడీగా ఉండాలంటూ వలవల బాబ్జీకి హైకమాండ్ పెద్దలు సూచించినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు.. గతంలో పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇచ్చామని.. దాని వల్ల పార్టీ వర్గాల్లో చాలా అసంతృప్తి ఉంది.. ఈసారి అలా కాకుండా తాడేపల్లిగూడెం నుంచి పోటీ ఖాయమని అధిష్టానం క్లియర్‌గా చెప్పిందట. ఇదంతా ఒక ఎత్తయితే.. పార్టీకి దూరంగా పెట్టిన ఈలి నానిని మళ్లీ రంగంలోకి దింపేందుకు కొందరు నాయకులు చేసిన ప్రయత్నాలు వికటించాయి.

Untitled-1698.jpg

ఈలి నానిని పార్టీలోకి తీసుకొద్దామని.. వలవల బాబ్జీతో కలిసి పనిచేస్తారని జిల్లా స్థాయిలోని ఓ నాయకురాలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే సదరు నాయకురాలి పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ పెద్దలు.. గతంలో ఈలి నాని పార్టీకి వ్యతిరేకంగా చేసిన పనులను ఆమెకు వివరించి.. ఆ ప్రయత్నాలు మానుకోవాలని సుతిమెత్తగా చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. అయితే.. ఆయా పరిణామాలు వలవల బాబ్జీ శిబిరంలో జోష్‌ నింపాయి. దాంతోపాటు.. కొద్దిరోజుల క్రితం అచ్చెన్నాయుడు కూడా బాబ్జీ ద్వారా నియోజకవర్గంలోని పరిస్థితిపై ఆరా తీసి.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. రెడీగా ఉండాలని చెప్పినట్లు బాబ్జీ వర్గంలో టాక్‌ నడుస్తోంది.

Untitled-1858.jpg

మొత్తంగా.. అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధిష్టానం గతానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఎక్కడికక్కడ పరిస్థితులను చక్కదిద్దుతూ.. ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లో క్యాండేట్లను కూడా ప్రకటించుకుంటూ వస్తోంది. అదే లెక్కన.. తాడేపల్లిగూడెం సీటుపైనా హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే.. టీడీపీ- జనసేన పొత్తు ఖాయం అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల నాటికి పరిస్థితులు మారతాయా?.. లేదా అన్నది చూడాలి మరి.

Updated Date - 2023-01-26T12:28:11+05:30 IST