H-1B వీసా రద్దు.. మరో ట్విస్ట్ ఇచ్చిన అమెరికన్ నేత వివేక్ రామస్వామి

ABN , First Publish Date - 2023-09-18T20:38:41+05:30 IST

హెచ్-1బీ వీసా రద్దు వ్యాఖ్యలపై మరింత వివరణ ఇచ్చిన భారత సంతతి అమెరికన్ నేత వివేక్ రామస్వామి.

H-1B వీసా రద్దు.. మరో ట్విస్ట్ ఇచ్చిన అమెరికన్ నేత వివేక్ రామస్వామి

ఎన్నారై డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి(US presidential elections) దిగేందుకు ఉవ్విళ్లూరుతున్న భారత సంతతి రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) హెచ్-1బీ వీసాపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇది పెద్ద దుమారానికి దారితీయడంతో వివేక్ తన వ్యాఖ్యలపై తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈ విషయమై స్థానిక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ క్లిప్‌ను సోషల్ మీడియా ‘ఎక్స్’ లో షేర్ చేశారు.


‘‘నా కామెంట్స్ విన్న ఓ వార్తాసంస్థ నేను అడ్డంగా దొరికిపోయాననుకుంది. హెచ్-1బీ వీసాను(H-1B Visa) రద్దు చేస్తానన్న నేను గతంలో నా కంపెనీలో హెచ్-1బీ ఉద్యోగులను తీసుకున్న విషయాన్ని ప్రస్తావించింది. వాస్తవానికి అమెరికాలో విద్యుత్, ఇంధన రంగాలూ పాడయ్యాయి. కానీ నేను రోజు విద్యుత్, నీరు వాడట్లేదా? వాస్తవానికి హెచ్-1బీ వీసాలో ఏ అంశం సంస్కరించాలనే దానిపై నాకు స్పష్టత ఉంది. ఫారిన్ వీసాల్లో లాటరీ విధానం అర్థరహితం. ఇక హెచ్-1బీ వీసాలు కచ్చితంగా వెట్టిచాకిరీనే. కార్పొరేట్ లాబీయింగ్ కారణంగా ఇది ఉనికిలోకి వచ్చింది. నేను దీనిలో మార్పులు చేస్తా’’ అని పోస్ట్ చేశారు. దీంతో, హెచ్-1బీ వీసా విషయంలో ఆయన కాస్త దూకుడు తగ్గించినట్టు కనబడుతోందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా ఎన్నికల బరిలోకి దిగేందుకు వివేక్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, రిపబ్లికన్ల మద్దతు ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్‌కు మెండుగా ఉంది. ఆయనే ప్రస్తుతం పార్టీలో నెం.1 అభ్యర్థిగా ఉన్నారు. మరోవైపు, వివేక్ తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఇతర కీలక నేతలైన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీకి గట్టి పోటీ ఇస్తున్నారు. తన దూకుడు, వగ్ధాటితో క్రమంగా పాప్యులారిటీ పెంచుకుంటున్నారు.

Updated Date - 2023-09-18T21:15:57+05:30 IST