US: అగ్రరాజ్యం అమెరికాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తెలుగమ్మాయి దుర్మరణం!

ABN , First Publish Date - 2023-01-25T13:05:38+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది.

US: అగ్రరాజ్యం అమెరికాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తెలుగమ్మాయి దుర్మరణం!

సీటెల్: అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన ఓ తెలుగమ్మాయి దుర్మరణం చెందింది. అక్కడి పోలీసు వాహనం ఢీకొని మృత్యువాత పడింది. సౌత్ లేక్ యూనియన్‌లోని సీటెల్ పోలీసు పెట్రోలింగ్ వాహనం (Seattle Police Patrol Vehicle) సోమవారం రాత్రి ఢీకొనడంతో భారత్‌కు చెందిన 23 ఏళ్ల జాహ్నవి కందుల చనిపోయినట్లు సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.

సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చెప్పిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల సోమవారం రాత్రి 8 గంటల (అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో డెక్స్టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో పోలీసుల వాహనం ఢీకొట్టింది. వాహనం ఢీ కొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సీటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి మెడికో టీమ్ వచ్చే లోపు ఆమెను బతికించేందుకు అధికారులు సీపీఆర్ చేశారు. వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత వారు ఆమె ప్రాణాలు రక్షించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే జాహ్నవిని హార్బర్‌వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది.

అయితే, ప్రమాదానికి కారణమైన అధికారి వివరాలను పోలీసులు వెల్లడించ లేదు. ట్రాఫిక్ కొలిజన్ ఇన్వెస్టిగేషన్ స్క్వాడ్ డిటెక్టివ్స్ ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు. నిజానికి అమెరికాలో చదువు, ఉద్యోగాల కోసం వెళుతున్న అనేక మంది తెలుగువారు, భారతీయులూ తరచూ ఇలా ఊహించని ఘటనలతో మృత్యువాత పడతున్నారు. గన్ కల్చర్, రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కన్నవారిని, పుట్టిన గడ్డను వదిలేసి విదేశాల్లో మంచి భవిష్యత్ కోసం ప్రయత్నిస్తున్న ఎంతో మంది భారతీయులు ఇలాంటి మరణాల బారిన పడడం చాలా బాధాకరం.

Updated Date - 2023-01-25T13:05:39+05:30 IST