Rathasaptami : ప్రత్యక్ష నారాయణుడు

ABN , First Publish Date - 2023-01-27T02:19:10+05:30 IST

సూర్యభగవానుణ్ణి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడని శ్రీమద్రామాయణం వర్ణించింది. ఆయన త్రిమూర్త్యాత్మకుడనీ, సర్వదేవతలకూ ప్రతీక అనీ, ఋగ్యజుస్సామవేద త్రయీమయుడనీ

Rathasaptami : ప్రత్యక్ష నారాయణుడు

సూర్యభగవానుణ్ణి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడని శ్రీమద్రామాయణం వర్ణించింది. ఆయన త్రిమూర్త్యాత్మకుడనీ, సర్వదేవతలకూ ప్రతీక అనీ, ఋగ్యజుస్సామవేద త్రయీమయుడనీ త్రిగుణాత్మకుడనీ, సూర్యమండలం మధ్యలో కొలువై ఉంటాడనీ పేర్కొంది. వేదమండలం ఋగ్వేదం. మధ్యభాగం (సుర్యుడు ఉండేది) యజుర్వేదం, కిరణావళి సామవేదం అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. సూర్యుడు జగచ్ఛక్షువని యజుర్వేదం వర్ణించింది. మనం చేసే కర్మలన్నిటికీ ఆయన సాక్షి. సూర్యుణ్ణి రుద్రునిగా శతరుద్రీయం సంభావించింది.

‘నారము’ అంటే నీరు. ఆ నీటికి నిలయమైన మేఘం నారాయణ స్వరూపం. మేఘాలను వర్షించేలా చేసి, ప్రాణికోటికి అన్నపానాదులతో పాటు వెలుగును, తేజస్సును ప్రసాదించేవాడు సూర్యభగవానుడు. ఆయన ప్రత్యక్ష నారాయణుడు. సూర్యుడు ఈ భూమండలంపై తొలిగా తన వెలుగు ప్రసరించిన రోజు మాఘ శుద్ధ సప్తమిగా పురాణాలు పేర్కొన్నాయి. అదే ‘సూర్యజయంతి’గానూ, ఈ రోజున సూర్యుడు రథాన్ని అధిష్టించి, ఉత్తర దిశగా పయనం ప్రారంభిస్తాడు కాబట్టి ‘రథ సప్తమి’ అని ప్రసిద్ధి పొందింది. సూర్యుడికి వివశ్వతుడనే పేరు ఉంది. సూర్యుడి కుమారుడు వైవశ్వతుడు. అతని పేరు మీద వైవశ్వత మన్వంతరం ప్రారంభమైనది కూడా రథ సప్తమి నాడే. మత్స్యపురాణంలో రథ సప్తమికి సంబంధించిన వివరాలు చాలా ఉన్నాయి. మాఘమాసంలో శుద్ధ సప్తమికి రథ సప్తమి అని పేరు. మా+అఘం... మాఘం. ‘అఘము’ అంటే పాపాలు, దుఃఖాలు. వాటిని ‘మా’ అంటే పోగొట్టేది మాఘం. సప్తమి రోజున ఉత్తర దిశగా ప్రయాణం ఆరంభించే సూర్యుడు... లోకపాలన చేస్తూ, తనను ఆరాధించేవారి చింతలను దూరం చేస్తాడు. సూర్యుణ్ణి ‘సహస్రార్చి స్సప్త జిహ్వః / సప్తైధాః సప్త వాహనః’ అని ప్రస్తుతించింది విష్ణు సహస్రనామం. ఏడు నాలుకలు కలిగిన సూర్యుడు అగ్ని స్వరూపుడు. ఆ నాలుకలు అగ్ని శిఖలు. ఏడు రంగులలో ప్రకాశిస్తున్నాయి. ఆ అగ్ని శిఖలే అశ్వాలు. ఏడు అశ్వాలు కలిగిన రథాన్ని సూర్యుడు అధిరోహించి... లోక సంచారం చేస్తాడు. సూర్య గమనాన్ని బట్టే ఆయనాలు, ఋతువులు, వాతావరణ మార్పులు, శీతగాలులు వీచడం లాంటివి సంభవిస్తున్నాయి. సూర్యుడి నుంచి వచ్చే వేడి కారణంగా నదులు, సముద్రాల్లోని నీరు ఆవిరిగా మారి, మేఘాలుగా రూపొంది, తిరిగి శీతల గాలుల వల్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ విధంగా సకల ప్రాణి కోటికీ తాగు నీటిని, సాగు నీటిని అందిస్తున్న జీవనాధారుడు సూర్యుడు.

సూర్యారాధన వల్ల విజ్ఞానం, వర్చస్సు, విద్య, చైతన్యం, ఆయుష్షు, సంతానభాగ్యం కలుగుతాయని, వాత, పిత్త, కఫ దోషాల నివారణ జరుగుతుందని వైద్య, యోగ శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుడు ఆరోగ్యప్రదాత. అందుకే ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అన్నారు పూర్వులు. ప్రత్యక్ష దైవమైన ఆ ఆదిత్యుడి జయంతి రోజున... సూర్యారాధన చేస్తే ఆరోగ్యం, సంపదలు కలుగుతాయన్నది పెద్దల మాట.

ఎ. సీతారామారావు

Updated Date - 2023-01-27T02:19:11+05:30 IST