Heerabai lobby : ఆ రెండు కలలూ తీరాలి...

ABN , First Publish Date - 2023-02-02T02:30:48+05:30 IST

పేదరికం, నిరక్షరాస్యత, దురలవాట్లతో మగ్గిపోతున్న గిరిజనానికి ఆశాకిరణంగా నిలిచారు హీరాబాయ్‌ లోబీ. మహిళల స్వయంసమృద్ధి, పిల్లలందరికీ విద్య లక్ష్యాలుగా...

Heerabai lobby : ఆ రెండు కలలూ తీరాలి...

పేదరికం, నిరక్షరాస్యత, దురలవాట్లతో మగ్గిపోతున్న గిరిజనానికి ఆశాకిరణంగా నిలిచారు హీరాబాయ్‌ లోబీ. మహిళల స్వయంసమృద్ధి, పిల్లలందరికీ విద్య లక్ష్యాలుగా... తన స్ఫూర్తిదాయకమైన కృషి కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న అరవై రెండేళ్ళ రైతు కూలీ జీవన ప్రయాణం ఇది.

‘‘దుఃఖంలో మునిగిపోయి ఏడవకు. ఆనందాన్ని వెతకడం ఆపెయ్యకు...’’ ఇవి మా బామ్మ నాకు చెప్పిన మాటలు. కానీ నా చుట్టూ ఉన్న వారిలో అంతులేని దుఃఖాన్ని చూస్తూనే పెరిగాను. వాళ్ళు హుందాగా, ఆనందంగా బతకాలంటే ఏం చెయ్యాలనే ఆలోచన ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉండేది. మాది గుజరాత్‌ రాష్ట్రంలోని మధుపూర్‌ జంబూర్‌ గ్రామం. గిర్‌ అరణ్యానికి సమీపంలో ఉంటుంది. నా చిన్నతనంలోనే మా అమ్మ, నాన్న మరణించడంతో... బామ్మ దగ్గరే పెరిగాను. మాది సిద్ధి గిరిజన తెగ. మా గ్రామ జనాభాలో ప్రధానంగా ఉండే సిద్ధీలు సామాజికంగానే కాదు, ఆర్థికంగానూ ఎంతో వెనుకబడిన వర్గం. ఎక్కువమంది వ్యవసాయ కూలీలుగా పని చేస్తూనో, అడవుల్లో కట్టెలు ఏరుకొని అమ్ముతూనో బతుకులు వెళ్ళదీస్తూ ఉంటారు. నేను, నా భర్త వ్యవసాయ కూలీలమే. పురుషుల్లో చాలామంది సంపాదన దురలవాట్లకే ఖర్చయ్యేది. కొట్లాటలూ, కేసులు పెట్టుకోవడం సర్వసాధారణంగా ఉండేది. బడికి వెళ్ళే పిల్లల సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. నేను చదువుకోలేదు కానీ చదువు విలువేమిటో తెలుసు. అయితే పిల్లలను విద్యవైపు మళ్ళించడం మా గ్రామంలో ఉన్న పరిస్థితుల్లో సాధ్యమయ్యేలా కనిపించలేదు.

ఫౌండేషన్‌ ద్వారా...

‘మార్పు ఎలా తేవాలి?’ అనే ఆలోచనలో ఉన్నప్పుడు... దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రజల కోసం అగా ఖాన్‌ ఫౌండేషన్‌ పని చేస్తున్నట్టు తెలిసింది. ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడాను. ఒక మహిళ ఆర్థిక స్వావలంబన సాధిస్తే... ఆమె కుటుంబం మొత్తం ప్రయోజనం పొందుతుందని వారు చెప్పిన మాట నాకు నచ్చింది. వారి సహకారంతో మా గ్రామంలో మహిళా మండలిని స్థాపించాను. మా జిల్లా మొత్తం మీద అదే మొదటి మహిళా మండలి. కొందరు మహిళలం కలిసి సేంద్రియ ఎరువు తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టాం. కొద్ది కొద్దిగా పొదుపు చేసి... పశువుల పెంపకానికి, వేప నూనె తయారీకి రుణాలు ఇచ్చాం. ఆ తరువాత వేర్వేరు మహిళా మండళ్ళను ఏర్పాటు చేసి... గ్రామంలోని మహిళలందరినీ భాగస్వాములుగా చేశాను. సిద్ధి మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడానికి... 2004లో ‘మహిళా వికాస్‌ ఫౌండేషన్‌’ను స్థాపించాను. దాని ద్వారా మా గ్రామంలోనూ, చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ పిల్లల చదువు కోసం బాల్వాడీలను ఏర్పాటు చేశాను. పిల్లలను తప్పనిసరిగా బడికి పంపాలనే నిబంధన పెట్టుకున్నాం. మహిళలకు బ్యాంక్‌ ఖాతాలు తెరవడం, డబ్బు పొదుపు చేసుకోవడం నేర్పించాను. అలాగే వ్యవసాయ పనుల్లో మహిళలకు శిక్షణను మా సంస్థ అందిస్తోంది. మరోవైపు అడవుల సంరక్షణకు కూడా చర్యలు చేపట్టింది. దాదాపు 700 మందికి పైగా మహిళలు, అంతకు రెట్టింపు సంఖ్యలో పిల్లలు ఈ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందారు. కొందరు మహిళలు టైలరింగ్‌ చేస్తున్నారు, మరి కొందరు కిరాణా దుకాణాల్లాంటివి నడుపుతున్నారు. మా బాల్వాడీల్లో అక్షరాలు దిద్దుకున్న పిల్లలు చాలామంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు మా గ్రామమే కాదు, మా చుట్టుపక్కల పధ్నాలుగు గ్రామాల మహిళలు స్వయంసమృద్ధి సాధించారు.

వారిద్దరే స్ఫూర్తి...

ఇందిరాగాంధీ, నరేంద్ర మోడీ... వీరిని నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. దేశ ప్రధానిగా... మహిళల ప్రతిభా సామర్థ్యాలను ఆమె ఘనంగా చాటిచెప్పారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు నన్ను జునాగఢ్‌లో సన్మానించారు. అలాగే స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక సంస్థ నగదు బహుమతితో సత్కరించింది. రిలయన్స్‌ సంస్థ నుంచి ‘రియల్‌’ అవార్డు, ‘జానకీ దేవి ప్రసాద్‌ బజాజ్‌’ అవార్డు, ‘గ్రీన్‌’ అవార్డు లాంటివి అందుకున్నాను. ఇప్పుడు మన దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’కి నన్ను ఎంపిక చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. నా భర్త నాలుగేళ్ళ కిందట మరణించారు. నా కుమార్తె, ఒక కొడుకు రైతు కూలీలు. మరో అబ్బాయి ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వ్యక్తిగతంగా నాకు ఏ కోరికలూ లేవు. అయితే నాకు తీరని కలలు రెండు ఉన్నాయి. నాకు కొంచెం భూమి కేటాయిస్తే... గిరిజన మహిళలకు వృత్తి శిక్షణ కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాను. రెండోది... అడవుల్లో నివసించే గిరిజనులందరికీ పక్కా ఇళ్ళు ఉండాలి. వీటిని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నా.’’

సిద్ధి మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడానికి... 2004లో ‘మహిళా వికాస్‌ ఫౌండేషన్‌’ను స్థాపించాను. దాని ద్వారా మా గ్రామంలోనూ, చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ పిల్లల చదువు కోసం బాల్వాడీలను ఏర్పాటు చేశాను. పిల్లలను తప్పనిసరిగా బడికి పంపాలనే నిబంధన పెట్టుకున్నాం. అలాగే వ్యవసాయ పనుల్లో మహిళలకు శిక్షణను మా సంస్థ అందిస్తోంది. మరోవైపు అడవుల సంరక్షణకు కూడా చర్యలు చేపట్టింది.

Updated Date - 2023-02-02T02:30:50+05:30 IST