Meherbaba : యుగావతారుడు

ABN , First Publish Date - 2023-01-27T02:23:13+05:30 IST

అది 1954 ఫిబ్రవరి తొమ్మిదో తేదీ. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మహీర్‌పూర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని మహేవా అనే గ్రామ పర్యటనలో మెహెర్‌బాబా ఉన్నారు. ఆ రోజు అర్థరాత్రి దాటాక... అక్కడ ఏర్పాటు

Meherbaba : యుగావతారుడు

అది 1954 ఫిబ్రవరి తొమ్మిదో తేదీ. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మహీర్‌పూర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని మహేవా అనే గ్రామ పర్యటనలో మెహెర్‌బాబా ఉన్నారు. ఆ రోజు అర్థరాత్రి దాటాక... అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన సంజ్ఞల ద్వారా ప్రసంగిస్తూ... ఇకపై ‘‘నేను అవతార్‌ మెహెర్‌ బాబాను’’ అని ప్రకటించారు.

సంస్కృతంలో ‘అవతార్‌’ అనే పదానికి ‘భగవంతుడి నుంచి వచ్చినవాడు’ అని అర్థం. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ‘‘నేను అవతారుణ్ణి అని ప్రకటిస్తే కొందరు సంతోషించారు. కొందరు దిగ్ర్భాంతి చెందారు. మరికొందరు నన్ను మోసగాడిగా, అహంకారిగా, పిచ్చివాడిగా కూడా భావించి ఉండవచ్చు’’ అన్నారు. వీటన్నిటికీ జవాబుగా ‘‘నువ్వు మనిషివని నీకు ఎలా తెలుసో... నేను అవతారుణ్ణని నాకు బాగా తెలుసు. నా దివ్యాధికారంతో చెబుతున్నాను. నేను భగవంతుణ్ణి. భగవంతుడు ఒక్కడే సత్యం. మీరు నా మాటలు విశ్వసించండి’’ అని పలు సందర్భాల్లో తన అనుచరులకు బాబా చెప్పారు.

దయగల తండ్రి...

మెహెర్‌ బాబా మహారాష్ట్రలోని పుణేలో జన్మించారు. ఆయనకు తల్లితండ్రులు పెట్టిన పేరు మేర్వాన్‌. 1913లో... పంతొమ్మిదేళ్ళ వయసులో... కాలేజీకి వెళ్తున్నప్పుడు... చెట్టుకింద కూర్చొని ఉన్న హజ్రత్‌ బాబాజాన్‌ అనే వృద్ధ ఆధ్యాత్మిక గురువు ఆయనను తన వద్దకు రమ్మని పిలిచింది. ఆ పిలుపుతో... అయస్కాంతం వైపు ఇనుములా... ఆమె వైపు ఆకర్షితుణ్ణయ్యానని మేర్వాన్‌ చెప్పాడు. ఆ తరువాత ఆమెను తరచూ సందర్శించి, సేవ చేయడం ప్రారంభించాడు. ఒక రోజు మేర్వాన్‌ నుదుట ఆమె ముద్దు పెట్టుకోవడంతో... అతను మతిస్థిమితాన్నీ, ప్రాపంచిక స్పృహనూ కోల్పోయాడు. తిండీ, నిద్రా లేకుండా కొన్ని వారాలు గడిపాడు. 1915లో షిరిడీ సాయిబాబాను మేర్వాన్‌ దర్శించుకున్నాడు. అతణ్ణి చూడగానే ‘పర్వద్విగార్‌’ (ఓ లోకరక్షకా) అని షిరిడీ బాబా సంబోధించారు. అనంతరం షిరిడీ సమీపంలోని సాకోరి గ్రామంలో ఉన్న ఉపాసనీ మహరాజ్‌ ఆశ్రమానికి మేర్వాన్‌ వెళ్ళాడు. అతణ్ణి మహారాజ్‌ నుదుటిపై ముద్దాడి, పెద్ద గులకరాయితో కొట్టారు. ఆ ఆశ్రమంలో ఏడేళ్ళ పాటు మేర్వాన్‌ ఉన్నాడు. 1921లో వీడ్కోలు తీసుకున్నాడు. ఉపాసనీ మహరాజ్‌ శిష్యులు అతణ్ణి ‘మెహెర్‌ బాబా’ అని (‘దయగల తండ్రి’ అని తెలుగు సమానార్థకం) పిలిచేవారు. 1922లో... అహ్మద్‌నగర్‌కు దగ్గరలోని మెహెరాబాద్‌లో... తన అనుచరులతో ఒక ఆశ్రమాన్ని మెహెర్‌ బాబా స్థాపించారు. అక్కడ పేదల కోసం ఉచిత ఆసుపత్రి, అన్ని మతాలు, కులాల పిల్లల కోసం ఉచిత ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేశారు. అస్పృశ్యత విశృంఖలంగా వేళ్ళూనుకున్న ఆ రోజుల్లోనే... అగ్రవర్ణాల పిల్లలతో పాటు దళిత బాలలకు కూడా ఆ పాఠశాలలో ప్రవేశం కల్పించారు.

నలభై నాలుగేళ్ళ మౌనం...

మెహెర్‌బాబా 1925 జూలై పది నుంచి భౌతిక శరీరం చాలించేవరకూ... అంటే సుమారు 44 సంవత్సరాలు కఠిన మౌనం పాటించారు. ‘‘నేను మౌనంగా ఉన్నా... నా ప్రేమికుల హృదయాలతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నా’’నని ఆయన అనేవారు. 1931 నుంచి 1939 వరకూ యూరప్‌, అమెరికాతో సహా పలు దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. అలాగే ఆసేతు హిమాచలం కాలినడకన పర్యటన సాగించారు. 1949 నుంచి 1952 ఫిబ్రవరి వరకూ ‘నవజీవనం’ పేరిట కఠినమైన భిక్షాటనతో జీవనం సాగించారు. ‘నవజీవనం’లో భాగంగా హైదరాబాద్‌లోని ఖాజగూడ ప్రాంతంలో ఉన్న కొండ గుహలో ‘మనోనాశ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికాలోని ఒక్లహామాలో, పుణే సమీపంలోని సతారాలో ఆయన కారు ప్రమాదాలకు గురయ్యారు. అలాంటి సమయాల్లో కూడా ఆయన మౌనం వీడలేదనీ, ఎంతో సహకరించారని వైద్యులు పేర్కొన్నారు. ఇక 1953 జనవరి, 1954 ఫిబ్రవరి నెలల్లో తెలుగునాట పలు పట్టణాల్లో, పల్లెల్లో మెహెర్‌బాబా విస్తృతంగా పర్యటించారు.

ప్రేమే నా మతం...

మాయ, అహంకారం, సంస్కారాలు, జన్మ-పునర్జన్మ, హింస-అహింస, ధ్యానం, ప్రేమ, భగవత్సాక్షాత్కారం లాంటి అనేక అంశాల మీద మెహెర్‌బాబా ప్రవచనాలు ఇచ్చారు. పలు గ్రంథాలు రాశారు. ‘‘మీరు చూస్తున్న జీవితం ఒక కలలాంటిది. భగవంతుడు ఒక్కడే సత్యం. జన్మ-పునర్జన్మలు లేకుండా బ్రహ్మైక్య సాధనే మానవ జీవిత లక్ష్యం కావాలి. అందుకోసం మీ తీరిక సమయాన్ని మీ ఇష్టదైవ నామస్మరణలో గడపండి. దేనికీ చింతించవద్దు, సంతోషంగా ఉండండి’’ అని ఆయన బోధించారు. ఇతరులను సంతోషపెట్టడంలోనే ఆనందం ఉందనీ, తానేమీ కొత్త మతాన్ని స్థాపించడానికి రాలేదనీ, ప్రేమే తన మతం అనీ, అన్ని మతాలనూ ఒక తీగపై పూసల్లా తీసుకురావడమే తన లక్ష్యం అనీ స్పష్టం చేశారు. 1969 జనవరి 31న మెహెర్‌బాబా భౌతిక దేహత్యాగం చేశారు. ఆయన భౌతిక శరీరాన్ని మెహెరాబాద్‌లో ముందుగా నిర్మించిన సమాధిలో ఉంచారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో మెహెర్‌బాబా అమరతిథిని ఆయన అనుయాయులు ఘనంగా నిర్వహిస్తారు.

డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌

9959553218

Updated Date - 2023-01-27T02:23:15+05:30 IST