Smell of Money: డబ్బు వాసన!

ABN , First Publish Date - 2023-01-10T22:31:42+05:30 IST

అక్బర్‌ రాజ్యంలో ధ్యాన్‌ చంద్‌ అనే వ్యాపారి ఉండేవాడు. అతను స్వీట్స్‌కి ఫేమస్‌. అతని అంగడిలోని తీపిపదార్థాలను తినాలని ప్రతి ఒక్కరూ ఆశపడేవారు.

 Smell of Money: డబ్బు వాసన!

కథ

అక్బర్‌ రాజ్యంలో ధ్యాన్‌ చంద్‌ అనే వ్యాపారి ఉండేవాడు. అతను స్వీట్స్‌కి ఫేమస్‌. అతని అంగడిలోని తీపిపదార్థాలను తినాలని ప్రతి ఒక్కరూ ఆశపడేవారు. ఆ స్వీట్‌ షాప్‌లోంచి వచ్చే వాసన అద్భుతం. ఒక రోజు ఆ వాసన చూసి గోపు అనే పేదవాడు ఆ షాప్‌ పక్కనే కూర్చున్నాడు. నెయ్యితో చేసిన తీపి పదార్థాల వాసన పీలుస్తూ తన చద్దన్నాన్ని తినటం ప్రారంభించాడు. ఆ పేదవాడు. అతనికి ఆరోజు ఇంటి భోజనం ఆ వాసన పీల్చుకుంటూ తింటుంటే కడుపు నిండి పోయింది. సంతృప్తికరంగా తిన్నానని సంతోషపడ్డాడు.

మరుసటి రోజు కూడా ఆ స్వీట్‌షాప్‌ దగ్గరకు వచ్చి మధ్యాహ్నం భోజనం చేశాడు. ఒక వారం పాటు అలానే చేశాడు. ఇది చూసి ధ్యాన్‌చంద్‌కి కోపం వచ్చింది. ‘నా షాప్‌ పక్కన ఉండకు. వెళ్లిపో’ అంటూ అరిచాడు. ‘నా ఇష్టం’ అన్నాడు గోపు. ‘వారం రోజుల పాటు ఇక్కడ కూర్చుని భోజనం చేస్తున్నావు. చూశా. నువ్వు డబ్బులు కట్టు లేకపోతే ఇక్కడ కూర్చోనివ్వను’ అంటూ పరుషంగా మాట్లాడాడు. ‘నీకెందుకు కట్టాలి?’ అన్నాడు గోపు. ‘నేను కష్టపడి నేతి మిఠాయిలు చేశా. ఆ వాసన పీల్చాలంటే డబ్బు ఇవ్వాల్సిందే’ అన్నాడు. ఇద్దరికీ గొడవ వచ్చి.. పంచాయితీ కాస్త రాజ్యంలోకి తీసుకెళ్లారు. అక్బర్‌, బీర్బర్‌ ఆసీనులైన సమయమది. అధికారులతో పాటు పలు ప్రజలు ఉన్నారు. కోపంతో ఊగిపోతూ ధ్యాన్‌ చంద్‌ రాజుకు విన్నవించాడు. బీర్బల్‌ వారి ఇద్దరి మాటలు విన్నాక .. గోపును దగ్గరకి పిలిచాడు. ఈ నాణెం తీసుకో అన్నాడు. గోపు తీసుకున్నాడు. ‘ధ్యాన్‌చంద్‌ ముక్కులో ఈ నాణెం ఉంచు. ఆ వాసన చూస్తాడు. తనకి డబ్బు వాసన కదా!’ అన్నాడు. విషయం అర్థమైన ధ్యాన్‌చంద్‌ సిగ్గుపడ్డాడు. ఇంత చిన్నదానికి పంచాయితీ ఇక్కడకు తెచ్చానా? అనుకున్నాడు. వెంటనే బీర్బల్‌ ఇలా అన్నాడు.. ‘గోపు.. నీకు ఇచ్చిన నాణెంతో ఆ వ్యాపారి దగ్గర నీకు ఇష్టమైన స్వీట్స్‌ కొనుక్కో’ అన్నాడు. గోపుతో పాటు ధ్యాన్‌చంద్‌ సంతోషపడ్డారు.

Updated Date - 2023-01-10T22:31:43+05:30 IST