Knowledge : జ్ఞానమే శ్రేష్టం

ABN , First Publish Date - 2023-01-27T02:20:53+05:30 IST

పూర్వం వారణాసి నగరం వెలుపల ఉన్న పల్లెలో మాతంగుడు అనే జ్ఞాని ఉండేవాడు. తక్కువ కులంవాడయినా... శీల, గుణ సంపదల్లో మేటి. అతను తనను అవమానించిన మంగళికను వివాహం చేసుకున్నాడు.

 Knowledge : జ్ఞానమే శ్రేష్టం

పూర్వం వారణాసి నగరం వెలుపల ఉన్న పల్లెలో మాతంగుడు అనే జ్ఞాని ఉండేవాడు. తక్కువ కులంవాడయినా... శీల, గుణ సంపదల్లో మేటి. అతను తనను అవమానించిన మంగళికను వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక పండితుడి పుత్రిక. మొదట ఆమె అతణ్ణి ఈసడించుకుంది. కానీ ఆ తరువాత తన తల్లితండ్రులు కాదన్నప్పటికీ అతణ్ణే వివాహం చేసుకుంది. పశు చర్మాలను శుద్ధి చేస్తూ, వీధులను చిమ్ముతూ జీవించే మాతంగుడు... తన జ్ఞానాన్ని మరింత మెరుగుపరచుకోవాలనుకున్నాడు. ఒక రోజు తన భార్యతో ‘‘మంగళికా! నేను హిమాలయాలకు వెళ్ళి వస్తాను’’ అని చెప్పాడు.

ఆమె అప్పటికే గర్భం దాల్చింది. ఆ సంగతి భర్తకు చెప్పింది. ‘‘త్వరలోనే తిరిగి వస్తాను’’ అని చెప్పి అతను వెళ్ళిపోయాడు.

ఆ తరువాత రోజులు, నెలలు గడిచాయి. మంగళిక మగబిడ్డకు జన్మను ఇచ్చింది. మాండవ్యుడు అని పేరు పెట్టింది. ఏళ్ళు గడుస్తున్నాయి. ఆ బాలుడు పెరిగి, పెద్దవాడయ్యాడు. గురుకులంలో చేరాడు. వేద విద్యలు నేర్చాడు. శాస్త్ర విద్యలలో మేటిగా రాణించాడు. అతని కీర్తి జంబూద్వీపం మొత్తం వ్యాపించింది. ఎందరో పండితులు మాండవ్యునితో వాదంలో ఓడిపోయారు. దానితో అతని శిష్య పరంపర పెరిగిపోయింది. కీర్తి ప్రతిష్టలతో పాటు సంపద కూడా వచ్చి చేరింది. దానితో నెమ్మదిగా గర్వం తలెత్తింది.

ఈ విషయం మాతంగునికి తెలిసి వారణాసి వచ్చాడు. తన కుమారుడు మాండవ్యుని ఇంటి ముందు నిలబడి... భిక్ష అడిగాడు.

‘‘ఓరీ! మురికి సన్నాసీ! బూడిద పులుముకొని దెయ్యంలా ఉన్నావు. మలిన వస్త్రాలు చుట్టావు. తోలు పీలికలు మెడకు చుట్టావు. చండాలునిలా ఉన్నావు. నీవు ఈ వీధికి, రావచ్చా? నా గుమ్మం ఎదుట నిలబడవచ్చా? ముందు దూరంగా పో’’ అంటూ కసిరికొట్టాడు మాండవ్యుడు.

‘‘అయ్యా! నీ ఇంట్లో రోజూ ఎందరికో అన్నదానం జరుగుతుందని తెలిసి వచ్చాను’’ అన్నాడు మాతంగుడు.

‘‘నా ఇంట జరిగే అన్నదానం కులీనులకు, పండితులకు. నీలాంటి అంటరానివారికి కాదు. పో... పో’’ అంటూ ఈసడించుకున్నాడు మాండవ్యుడు.

‘‘నాయనా! దానం శ్రేష్టమైనది. దానానికి కులం, మతం ఉండదు. దానం ఎవరికి ఇచ్చినా అది మంచి ఫలితాన్నే అందిస్తుంది. దాత రైతులా వ్యవహరించాలి. రైతు తనకు ఉన్న మెరక పొలంలోనైనా, పల్లపు మడిలోనైనా, చదును నేలమీద అయినా... శ్రమించి పంట వేస్తాడు. పల్లపు నేల పనికిరాదు అనుకోడు. దాన్ని పాడుపెట్టడు. అలాగే దాత దానం చెయ్యాలి కానీ... వీరికే చెయ్యాలి అనుకోకూడదు. పరిధులు లేనిదే దానం. రైతులకు శ్రమ, దాతకు శ్రద్ధ ఉండాలి. అప్పుడే ఫలితాలు అందుకుంటారు’’ అని చెప్పాడు మాతంగుడు.

దానికి మాండవ్యుడు పెద్దగా నవ్వి ‘‘ఓరీ మురికి సన్నాసీ! నాకే మహా బోధ చేస్తున్నావా? సుక్షేత్రంలో మాత్రమే విత్తిన విత్తు మంచి పంటనిస్తుంది. నేనూ ఉన్నత కులం వారికే దానం చేస్తాను. అదే నాకు మంచి క్షేత్రం. అవతలికి పో. వ్యర్థ ప్రేలాపనలు మాను’’ అన్నాడు.

‘‘పిచ్చివాడా! ఈర్ష్య, ద్వేషం, జాతి మదం, ముర్ఖత్వం, అహంకారం.... ఇవి లేనిదే మంచి క్షేత్రం. నీకు లేనిది అదే’’ అన్నాడు మాతంగుడు.

‘‘ఓరీ అహంభావీ! మూర్ఖుడా! నన్నే అంటావా?’’ అంటూ మాండవ్యుడు తన సేవకులను పిలిచి, మాతంగుణ్ణి నడి వీధిలోకి నెట్టించాడు.

పైకి లేచిన మాతంగుడు కోపంతో చూశాడు. ఆ నేత్రాల తీక్షణతకు మాండవ్యుడు భయపడ్డాడు, వణికాడు. అతని కాళ్ళూ, చేతులూ చచ్చుబడిపోయాయి. నోటి మాట పడిపోయింది. వెనక్కి విరుచుకు పడిపోయాడు. అందరూ కేకలు వేశారు. ఆ కేకలు విని... ఇంట్లోంచీ మంగళిక పరుగు పరుగున వచ్చింది. జరిగిందేమిటో తెలుసుకొని... మాతంగుడి పాదాల మీద పడింది. అతను తన భర్త అని గుర్తు పట్టింది. కొడుకును బతికించాలని వేడుకుంది.

మాతంగుడు తాను తిన్న ఎంగిలి కూడు ఒక ముద్ద ఇచ్చి, దాన్ని మాండవ్యుడి నోట్లో వేయమన్నాడు. ఆమె అలాగే చేసింది. మాండవ్యుడు మెల్లగా లేచాడు. విషయం తెలుసుకొని ‘కులం కన్నా జ్ఞానం శ్రేష్టం’ అని గ్రహించాడు. అప్పటికే మాతంగుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాతంగుని పాదచిహ్నాలను తాకి... క్షమాపణలు వేడుకున్నాడు మాండవ్యుడు.

‘‘మానవులు కులం అనేదాన్ని అజ్ఞానంతో తగిలించుకున్నారు. గుణం, జ్ఞానం, శీలం మాత్రమే గౌరవాన్నీ మహా శక్తినీ ఇస్తాయి’’ అంటూ బుద్ధుడు చెప్పిన గొప్ప కథ ఇది.

బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2023-01-27T02:20:54+05:30 IST