Madhavisharma : పఠనానికి పండగొచ్చింది!

ABN , First Publish Date - 2023-02-02T02:39:40+05:30 IST

కన్నవాళ్ల ఆస్తులు పంచుకొనే తోబుట్టువులు కారు వీరు... తండ్రి ఆశయాన్ని భుజానికెత్తుకున్న అన్నాచెల్లెళ్లు. ఊరూ వాడా గ్రంథాలయాలు నెలకొల్పి...

Madhavisharma : పఠనానికి పండగొచ్చింది!

కన్నవాళ్ల ఆస్తులు పంచుకొనే తోబుట్టువులు కారు వీరు... తండ్రి ఆశయాన్ని భుజానికెత్తుకున్న అన్నాచెల్లెళ్లు. ఊరూ వాడా గ్రంథాలయాలు నెలకొల్పి... అక్షరాస్యులందరినీ సాహిత్యాభిమానులుగా మార్చాలనే లక్ష్యంతో ‘ఫుడ్‌ 4 థాట్‌’కు శ్రీకారం చుట్టారు మాధవీశర్మ, శ్రీనివాసరావు. ఈ అక్షర యజ్ఞం విశేషాలను ‘నవ్య’తో పంచుకున్నారు మాధవీశర్మ.

‘‘శారీరక ఆరోగ్యానికి పోషకాహారం ఎంత అవసరమో... మానసిక వికాసానికి మంచి పుస్తకాలు అంతే ముఖ్యమ’ని మా ప్రగాఢ నమ్మకం. అందుకే ‘ఫుడ్‌ 4 థాట్‌’ పేరుతో గ్రంథాలయోద్యమాన్ని ప్రారంభించాం. ప్రభుత్వ పాఠశాలు, ఆస్పత్రులు, గ్రామ కమ్యూనిటీ కేంద్రాలు, కారాగారాలు... ఇలా ఇప్పటివరకు రకరకాల ప్రదేశాల్లో 550కు పైగా లైబ్రరీలను నెలకొల్పాం. ఆరేళ్ల కిందట మొదలైన మా ఉద్యమం... ఎన్నో జీవితాలను నిలబెట్టింది. కొన్నాళ్ల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రి యాజమాన్యాన్ని ఒప్పించి అక్కడ గ్రంథాలయాన్ని ప్రారంభించాం. తద్వారా రోగులే కాదు వాళ్ల వెంట వచ్చే కుటుంబ సభ్యులు కూడా ఉచితంగా పుస్తకాలు చదవుకునే వెసులుబాటు కల్పించాం. అలా చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఒకతను... ‘పుస్తక పఠనం పరిచయం కావడంవల్లే డిప్రెషన్‌ను జయించాన’ని మమ్మల్ని కలిసి చెప్పాడు. ఆ మాటలకు వెయ్యేనుగల బలం పొందినంత ఆనందం కలిగింది. ఆ స్ఫూర్తితో చెన్నై, ఢిల్లీలోని మరికొన్ని ఆస్పత్రుల్లోనూ గ్రంథాలయాలను ప్రారంభించాం. మా కార్యాచరణ నచ్చి, ఓ రోజు గువహటి సెంట్రల్‌ జైలు అధికారి మమ్మల్ని సంప్రతించారు. వాళ్ల కారాగారంలోనూ గ్రంథాలయాన్ని ప్రారంభించాల్సిందిగా కోరారు. ఆయన సహకారంతో నిరుడు అక్కడ 440 పుస్తకాలతో గ్రంథాలయం తెరిచాం. ఇప్పుడు దాన్ని యావజ్జీవ శిక్షను అనుభవిస్తన్న ఓ ఖైదీ నిర్వహిస్తున్నాడు. ఏటా మేము నిర్వహించే ‘ఇండియా రీడింగ్‌ ఒలింపియాడ్‌’ జాతీయ స్థాయి పోటీలో ఉత్తమ గ్రంథాలయ నిర్వాహకుడిగా అతను, ఉత్తమ పాఠకుడిగా మరొక ఖైదీ బహుమతులు అందుకున్నారు. ‘లైబ్రరీ వచ్చాక జైలు వాతావరణం హాస్టల్‌ను తలపిస్తోంద’ని జైలర్‌ నుంచి కితాబు అందుకోవడం మాకు గొప్ప అనుభూతి. పుస్తకాలు మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతాయి అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఆపై వరంగల్‌తో పాటు దేశంలోని మరికొన్ని కేంద్ర కారాగారాల్లోనూ లైబ్రరీలను తెరిచాం.

పాత ఫ్రిడ్జే బీరువా...

మారుమూల పల్లెలకూ పుస్తకాలు తీసుకెళుతున్నాం. ముఖ్యంగా పిల్లల్లో సాహిత్యాభిలాషను రేకిత్తించాలనేది మా ప్రధాన ఉద్దేశం. అందుకోసం స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉపాధ్యాయుల సహకారంతో ఒక్కోచోట 250 పుస్తకాలతో లైబ్రరీలు ప్రారంభించాం. ఖమ్మం జిల్లాలోని అన్నారం ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీకి ప్రత్యేక గది లేకపోవడంతో తరగతి గదిలోనే దుస్తులు ఆరేసినట్టుగా, తాడు కట్టి, దానికి పుస్తకాలను తగిలించాం. మరొక స్కూల్లో అయితే పాడైన ప్రిడ్జ్‌ను రూ.1,200కి కొని, దాన్ని పుస్తకాల బీరువాగా మార్చాం. ఇంకోచోట ఒక ట్రంకు పెట్టెను సమకూర్చాం. ఇలా ఒక్కోచోట ఒక్కో తీరుగా మా గ్రంథాలయాలు నడుస్తున్నాయి. ప్రతిచోటా నిత్యం పుస్తక పఠనానికి ఉపాధ్యాయులు ప్రత్యేక పీరియడ్‌ కేటాయిస్తుండడం మంచి పరిణామం. ఆంధ్రా, తెలంగాణతో పాటు కర్ణాటక, మేఘాలయ, అసోం, ఒడిశా... ఇలా 22 రాష్ట్రాల్లో ‘ఫుడ్‌ 4 థాట్‌’ లైబ్రరీలు కనిపిస్తాయి. అవన్నీ బాగా నడుస్తున్నాయి. కొన్ని స్కూలు లైబ్రరీల నిర్వహణ బాధ్యతలను అక్కడి పిల్లలకే అప్పగించాం. దాంతో కేవలం వాళ్ల మాతృభాషలోనే కాదు, ఆంగ్ల భాషా సాహిత్యం మీదా గ్రామీణ విద్యార్థుల్లో మక్కువ పెరగడం చూస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లోని స్కూలు విద్యార్థుల కోసం భారత, రామాయణ తదితర గాథలను 11 భాషల్లో ఆడియో బుక్స్‌ రూపంలోనూ అందుబాటులో ఉంచాం. వాళ్లకు పుస్తక పఠనాభిరుచిని కలిగించేందుకు దీన్నొక మార్గంగా ఎంచుకున్నాం.

ఎంపిక చేసిన పుస్తకాలే...

‘ఫుడ్‌ 4 థాట్‌’ ఫౌండేషన్‌ కోసం పుస్తకాలను మాత్రమే విరాళంగా స్వీకరిస్తాం. పాఠ్యపుస్తకాలను అస్సలు తీసుకోము. మావద్దకు వచ్చిన పుస్తకాలను పిల్లలవి, పెద్దలవి అని విభజిస్తాం. వాటిల్లోనూ ఫిక్షన్‌, నాన్‌ఫిక్షన్‌, మైథాలజీ, మోరల్‌... ఇలా సబ్జెక్టుల వారీగా వేరు చేస్తాం. తర్వాత పిల్లల మనోవికాసానికి తోడ్పడే విధంగా, సలహాదారుల బృందం ఎంపిక చేసిన పుస్తకాలను మాత్రమే స్కూళ్లకు అందిస్తాం. అలా ప్రతి గ్రంథాలయంలో 150 ఆంగ్ల పుస్తకాలతో పాటు 100 స్థానిక భాషకు చెందిన సాహిత్య గ్రంథాలు ఉండేలా చూస్తాం. అయితే భారతీయ భాషల పుస్తకాలు తక్కువ సంఖ్యలో మాకు వస్తుంటాయి. మా లైబ్రరీల ద్వారా గ్రామీణ విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించగలుగుతున్నాం.

లక్ష్యం... వెయ్యి గ్రంథాలయాలు...

ఇప్పటివరకు మా దృష్టంతా పాఠశాలల మీద కేంద్రీకరించాం. ప్రస్తుతం పిల్లలు, పెద్దలు అందరికీ అందుబాటులో ఉండేలా గ్రామీణ (కమ్యూనిటీ) గ్రంథాలయాలను నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నాం. మరో రెండేళ్లలో గ్రంథాలయాల సంఖ్యను వెయ్యికి పెంచాలనేది మా లక్ష్యం. ఆ దిశగా మేమంతా పనిచేస్తున్నాం. నా పూర్తి సమయాన్ని సంస్థ సేవలకే కేటాయించాను. ఇప్పటివరకు 1.5 లక్షల పుస్తకాలను 4.3 లక్షలమందికి చేరువ చేయగలిగాం. ఇందుకు మా అన్నయ్య శ్రీనివాసరావు, వదిన షెఫాలీరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మా వదిన షెఫాలి పుస్తక ప్రేమికురాలు. ఆమె చొరవవల్లే ఆరేళ్లలో ‘ఫుడ్‌4థాట్‌’ సేవలు ఇంతగా విస్తరించాయి. మా వదిన పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి పుస్తక పఠనం మీద ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహిస్తుంటారు. అక్షరాస్యులంతా సాహిత్యాభిమానులు అవ్వాలనేది మా కోరిక. అందుకోసం మా వంతుగా ప్రతిచోటా లైబ్రరీలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం. ‘రీడింగ్‌ రెవెల్యూషన్‌’ రావాలనేదే ‘ఫుడ్‌ 4 థాట్‌’ నినాదం కూడా.’’

మా నాన్నే స్ఫూర్తి...

మా నాన్న కేవీఎస్‌ రావు మంచి చదువరి. ఆయన వ్యక్తిగత గ్రంథాలయంలో అయిదు వేలకు పైగా పుస్తకాలుండేవి. నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి నేను, మా అన్నయ్య ‘చందమామ, బాలమిత్ర, అమరచిత్ర’ తదితర కథల పుస్తకాలు బాగా చదివేవాళ్లం. తర్వాత అదే మాలో మంచి పఠనాసక్తిని కలిగించింది. నేటికీ రోజూ పుస్తకం చదవకుండా నిద్రపోం. అలా మా వ్యక్తిగత గ్రంథాలయాల్లోనూ నాలుగు వేల పుస్తకాలకుపైగా ఉంటాయి. ఓ రోజు మా నాన్న నన్ను, అన్నయ్యను పిలిచి... ‘మన దగ్గర ఇప్పుడంటే ఇన్ని పుస్తకాలున్నాయి. నా చిన్నతనంలో ఒక చిన్న పుస్తకం కొనాలన్నా డబ్బులు ఉండేవి కావు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. మరి దీనికి మీరేమైనా చేయచ్చు కదా’ అన్నారు. మా నాన్న స్ఫూర్తితోనే నేను, అన్నయ్య కలిసి ‘ఫుడ్‌ 4 థాట్‌’ సంస్థను నెలకొల్పాం. పుస్తకాభిలాషి అయిన మా వదిన మమ్మల్ని సరైన దారిలో నడిపించారు. దాంతో తొలి ఏడాది 57 గ్రంథాలయాలు ప్రారంభించాం. అప్పుడు మాకు ఉపాధ్యాయుల నుంచి పుస్తకాల ఎంపికలో మంచి సలహాలు, సూచనలు వచ్చాయి. దాంతో అంతా కలిసి ఓ కుటుంబంలా ‘ఫుడ్‌ 4 థాట్‌’ను ముందుకు తీసుకెళుతున్నాం.

కె.వెంకటేశ్‌

Updated Date - 2023-02-02T02:39:41+05:30 IST