అమ్మ కోసం.. తుపాన్‌ కలకలం

ABN , First Publish Date - 2023-02-05T05:11:40+05:30 IST

అంజలీదేవి, ఆదినారాయణ రావు దంపతులతో హీరో కృష కు ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. తను ఎదుగుతున్న దశలో వారి సొంత సినిమా ‘అమ్మ కోసం’ లో మంచి వేషం ఇచ్చి ప్రోత్సహించారనే కృతజ్ఞతాభావం

అమ్మ కోసం.. తుపాన్‌ కలకలం

అంజలీదేవి, ఆదినారాయణ రావు దంపతులతో హీరో కృష కు ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. తను ఎదుగుతున్న దశలో వారి సొంత సినిమా ‘అమ్మ కోసం’ లో మంచి వేషం ఇచ్చి ప్రోత్సహించారనే కృతజ్ఞతాభావం ఆయనలో ఉండేది. అందుకే పద్మాలయ బ్యానర్‌ పై తను నిర్మించిన ‘అగ్ని పరీక్ష’ , ‘మోసగాళ్లకు మోసగాడు,’ ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాలకు ఆదినారాయణరావును సంగీత దర్శకునిగా నియమించి, ఒక రకంగా కృష్ణ రుణం తీర్చుకున్నారనే చెప్పాలి.

తమ కుమారుడు చిన్నారావు నిర్మాతగా చిన్ని బ్రదర్స్‌ బ్యానర్‌ పై అంజలీ దేవి నిర్మించిన నాలుగో చిత్రం అమ్మ కోసం. 1969 మార్చి 19న చెన్నై లోని ఏవి ఎం స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ రోజు ఉగాది పర్వదినం కావడం గమనార్హం. అంజలీదేవిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మహానటి సావిత్రి క్లాప్‌ ఇచ్చి షూటింగ్‌ ప్రారంభించారు. ఎన్టీఆర్‌, జెమినీ గణేశన్‌ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ‘అమ్మ కోసం’ చిత్రం ప్రారంభమైన ఐదు రోజులకు తిరుపతి లో కృష్ణ, విజయనిర్మల పెళ్లి జరిగింది.

ఈ సినిమాలో అంజలీ దేవి కొడుకులుగా కృష్ణ, కృష్ణంరాజు నటించారు. కృష్ణంరాజు పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను, కృష్ణ దొంగ పాత్రను పోషించారు. కృష్ణది దొంగ పాత్రే అయినా మహా భారతం లోని కర్ణునితో పోల్చదగిన పాత్ర అని చెప్పాలి. జెమినీ గణేశన్‌, పుష్పవల్లి కూతురైన రేఖ హీరోయిన్‌ గా నటించిన తొలి సినిమా ఇదే. ఈ చిత్రంలో ఆమె కృష్ణంరాజు సరసన నటించారు. ఆ తర్వాత బాలీవుడ్‌ లో అడుగు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగారు.

‘అమ్మ కోసం’ చిత్రాన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌ లోనే నిర్మించారు. పార్ట్‌లీ కలర్‌ సినిమాల నిర్మాణం జోరుగా సాగుతున్న రోజులవి. అందుకే ఈ చిత్రంలోని మూడు పాటలను మాత్రం రంగుల్లో తీశారు. కృష్ణ , విజయనిర్మల పై రెండు పాటలు, కృష్ణంరాజు, రేఖపై ఒక పాట చిత్రీకరించారు.

పాటలు సహా కొన్ని సన్నివేశాలను గోదావరి నేపథ్యంలో తీయాలని ప్లాన్‌ చేశారు. అందరూ రాజమండ్రి చేరుకొన్నారు. అందరికీ పాపికొండలు సమీపంలోని గ్రామంలో వసతి ఏర్పాటు చేశారు. ‘మీరు కొత్తగా పెళ్లయిన జంట కదా .. ఎంచక్కా గోదావరిలో తేలే హౌస్‌ బోట్‌ లో ఉండండి’ అన్నారు ఆదినారాయణరావు. కృష్ణకు సన్నిహిత మిత్రుడు, జర్నలిస్ట్‌ మోహన్‌కుమార్‌ రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా ఒక హౌస్‌ బోట్‌ తెప్పించారు.

వారం రోజుల పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా షూటింగ్‌ జరిగింది. ఆ తర్వాత ఒక రోజు ఉన్నట్లుండి తుపాను మొదలైంది. గోదావరి అల్లకల్లోలమైంది. మే నెలలో ఎవరూ ఊహించని పెను తుపాను అది. క్రమంగా నీటి మట్టం పెరగడంతో గోదావరిలో ఆటు పొట్లు మొదలయ్యాయి. అలాగే చెట్లు కదిలి పోయెంతగా గాలి ఉగ్ర రూపం దాల్చింది. దాంతో చెట్టుకు కట్టిన తాళ్ళు తెగిపోవడంతో కృష్ణ, విజయనిర్మల ఉన్న బోట్‌ ఒక్కసారిగా కుదుపుకి లోనైంది. ఆటు పోట్ల వల్ల బోటు అటు ఇటు ఊ గసాగింది. దానికి తోడు బోట్‌ లో ఎక్కడో రంధ్రం పడడంతో లోపలికి నీళ్ళు రాసాగాయి. ఒక పక్క వర్షం, మరో పక్క ఈదురు గాలి. నీళ్లలోకి దూకి ఒడ్డుకు చేరుకుందామా అంటే కృష్ణకు, విజయనిర్మలకు ఈత రాదు. బోట్‌ అలా కదిలి ముందుకు వెళ్ళి పోతుంటే ఒడ్డునున్న వాళ్ళు హాహా కారాలు చేస్తున్నారు. ఏమి చేయాలో ఎవరికీ తోచలేదు. కృష్ణ, విజయనిర్మల మాత్రం తమకు అవే ఆఖరి ఘడియలు అనుకొన్నారు. అలాంటి పరిస్థితుల్లో స్టంట్‌ మాస్టర్‌ రాఘవులు ముందుగా స్పందించారు. అక్కడే ఉన్న నాలుగు గుర్రాలకు తాళ్ళు కట్టి , ఆ తాళ్ళు పట్టుకొని గోదావరి లో ఈదుకుంటూ బోట్‌ దగ్గరకు వెళ్ళి ఆ తాళ్ళు బిగీంచారు. గుర్రాలతో బోట్‌ లాగించి ఎలాగైతేనేం ఒడ్డుకు చేర్చారు.

Updated Date - 2023-02-05T05:11:41+05:30 IST