Neuro Care : వెన్ను వేధిస్తోందా?

ABN , First Publish Date - 2023-01-23T23:12:49+05:30 IST

మేనుకు దన్నుగా ఉండే వెన్నులో సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. లేదంటే చిటికలో పోయే సమస్యలు అదే పనిగా చీకాకు పెడతాయి. కొన్ని సందర్భాల్లో సర్జరీకి కూడా దారి తీస్తాయి అంటున్నారు నాడీ వైద్యులు.

 Neuro Care : వెన్ను వేధిస్తోందా?

మేనుకు దన్నుగా ఉండే వెన్నులో సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. లేదంటే చిటికలో పోయే సమస్యలు అదే పనిగా చీకాకు పెడతాయి. కొన్ని సందర్భాల్లో సర్జరీకి కూడా దారి తీస్తాయి అంటున్నారు నాడీ వైద్యులు.

వెన్నులో మెడ, వీపు, కటి భాగం (సర్వైకల్‌, థొరాసిక్‌, లంబార్‌).. ఈ మూడు ప్రదేశాల్లో సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. వీటిలో తలెత్తే ప్రతి నొప్పినీ అంత తీవ్రంగా పరిగణించవలసిన అవసరం లేకపోయినా, కొన్ని నొప్పులను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా మెడలో వచ్చే నొప్పుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడి నాడులు దెబ్బతింటే చేతులు, కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయే ప్రమాదం ఉంటుంది.

మెడ సమస్యలు ఇవే!

సాధారణంగా మెడను శ్రమకు గురి చేసినప్పుడే మెడ నొప్పులు మొదలవుతాయి. ఎక్కువ సమయాల పాటు ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు వాడడం ద్వారా మెడను ఎక్కువ సమయం పాటు వంచి ఉంచడం వల్ల మెడ నొప్పులు మొదలవుతాయి. మెడ తలను మోయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ సమయం పాటు నేరుగా చూడడానికి తగినట్టు మాత్రమే రూపొందింది. అలాగే తాత్కాలికంగా పక్కలకు, పైకి, కిందకు చూడవచ్చు. కానీ తాత్కాలికంగా చేయవలసిన ఈ పనులను ఎక్కువ సమయం పాటు కొనసాగిస్తే, మెడలో నొప్పులు మొదలవుతాయి. మన మెడ రివర్స్‌ ‘సి’ ఆకారంలో ఉంటుంది. మెడను ఎక్కువ సమయాల పాటు కిందకు వంచి ఉంచినప్పుడు, దాని ఆకారం నిటారుగా లేదా సాధారణ ‘సి’ ఆకారంలోకి మారుతుంది. ఈ మార్పుతో మెడ కండరాల మీద ఒత్తిడి పెరిగి, నొప్పులు మొదలవుతాయి. అయితే ఈ రకమైన నొప్పులు ఆయా అలవాట్లను సరిదిద్దుకుని, మెడ కండరాలకు విశ్రాంతినిస్తే సర్దుకుంటాయి. ప్రమాదాల్లో హఠాత్తుగా కుదుపుకు గురైనప్పుడు మెడ డిస్క్‌లు పట్టు తప్పుతాయి. దాంతో నాడి నొక్కుకుపోయి చేతుల్లో తిమ్మిర్లు, నొప్పి మొదలవుతాయి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నొప్పి పెరగడం, చేతులు పట్టు కోల్పోవడం లాంటి లక్షణాలు మొదలవుతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రతించి, చికిత్స మొదలుపెట్టాలి.

ఎప్పుడు తీవ్రంగా పరిగణించాలి?

మెడ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. పక్కలకు, పైకీ, కిందకూ తలను తిప్పలేకపోతుంటే వైద్యులను తప్పక సంప్రతించాలి. బైక్‌ లేదా కారు నడుపుతూ సడెన్‌ బ్రేక్‌ వేసినప్పుడు, టు వీలర్‌ మీద నుంచి పడిపోయినప్పుడు, తల ఒక్కసారిగా కుదుపుకు గురవుతుంది. ఇలాంటి హై వెలాసిటీ ఇంజురీ్‌సతో మెడ విప్లా్‌షకు గురవుతుంది. ఆ తర్వాతి నుంచి మెడలో, చేతుల్లో అసౌకర్యం, నొప్పి మొదలైతే ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. ఒకవేళ నొప్పి తక్కువగా ఉండి, మెడలో ఎలాంటి అసౌకర్యం లేకపోతే ఒకట్రెండు రోజులు పెయిన్‌ కిల్లర్స్‌ వాడి, విశ్రాంతి తీసుకుని అప్పటికీ మెడలో అసౌకర్యం తగ్గకపోతే వైద్యులను కలవాలి.

సొంత చికిత్సలు ప్రమాదకరం

సాధారణంగా మెడ నొప్పులను మనందరం ఎంతో కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. వైద్యుల దగ్గరకు వెళ్లకుండానే స్వయంగా తగ్గించుకునే ప్రయత్నాలను మొదలుపెడతాం. కొందరు అందుకోసం మర్దనను ఎంచుకుంటే, ఇంకొందరు యోగా, స్ట్రెచింగ్‌ వ్యాయామాలను ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి వాటి వల్ల సమస్య మరింత పెరుగుతుంది. సమస్యను అంచనా వేసిన తర్వాత, ఇలాంటివి చేయించుకోవడం సురక్షితమని వైద్యులు సూచించినప్పుడు మాత్రమే వీటిని అనుసరించాలి. అలా కాకుండా వైద్యులు వీటిని వారించినప్పటికీ, మర్దన, యోగా, ట్రాక్షన్‌లను ఎంచుకోవడం వల్ల అప్పటికే ఉన్న సమస్య రెట్టింపవుతుంది. హఠాత్తుగా చేతులు పట్టు కోల్పోవడం, నొప్పి పెరిగిపోవడం జరుగుతుంది.

ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదు

  • మెడలో నొప్పి

  • మెడను తిప్పలేకపోవడం

  • చేతుల్లో నొప్పి, తిమ్మిర్లు

  • చేతులు పట్టు కోల్పోవడం

  • చేతులు పైకి ఎత్తలేకపోవడం

  • చేతులు మొద్దుబారిపోవడం

  • తుమ్మినా, దగ్గినా షూటింగ్‌ పెయిన్‌ రావడం

వెన్ను మధ్యలో సమస్యలు

శరీరంలోని ప్రతి అవయవానికీ సంబంధించిన నాడులన్నీ వెన్నుపూసలోనే మొదలవుతాయి. వెన్నులోని పూసల్లో సమస్య ఏర్పడి, ఆ ప్రదేశంలోని నాడులు నొక్కుకుపోతే, దాంతో సంబంధం ఉన్న అవయవాల పనితీరు మీద ప్రభావం పడుతుంది. హై వెలాసిటీ ఇంజురీ్‌సలో థొరాసిక్‌ (మొండెం) ప్రాంతంలో ఫ్రాక్చర్లు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో తలెత్తే ట్యూమర్ల వల్ల కూడా వెన్ను సమస్యలు మొదలుకావచ్చు. మూత్రవిసర్జన మీద కూడా పట్టు కోల్పోవచ్చు. కాబట్టి వెన్ను మధ్యలో నొప్పితో పాటు చేతులు, కాళ్లు పూర్వంలా పని చేయకపోతే వైద్యులను సంప్రతించి పరీక్షలు చేయించుకోవాలి.

కటి ప్రదేశంలో ఇలా....

నడుము, కాళ్లు, చేతుల్లో నొప్పులకు ప్రధాన కారణం లంబార్‌ స్పాండిలోసిస్‌. వెన్నులోని కీళ్లలో కూడా కొందరికి అరుగుదల మొదలవుతుంది. అలా కాకుండా ఏదైనా ప్రమాదానికి గురైన తర్వాత ఈ సమస్యలు మొదలైతే, అందుకు కండరాలు, వెన్నుపూసల గాయాలు కారణం కావచ్చు. వెన్ను పూసల గాయాలకు సమస్య తీవ్రతను బట్టి మందులు వాడుకోవచ్చు. వ్యాయామాలతో పాటు, భంగిమలను సరి చేసుకోవడం లాంటివి అవసరమవుతాయి. ఇవేవీ ఫలితం చూపించని సందర్భాల్లో, దైనందిన పనులు చేసుకోలేని పరిస్థితుల్లో సర్జరీ కూడా అవసరం పడవచ్చు.

కాలర్లు, బెల్టులు ఎంతకాలం?

సర్వైకల్‌ (మెడ) స్పాండిలోసిస్‌, లంబార్‌ (నడుము) స్పాండిలోసి్‌సలకు కొంత కాలం పాటు కాలర్లు, బెల్టులు వాడవలసిన అవసరం ఉంటుంది. అయితే కొందరు, వైద్యులు సూచించినంత కాలం వాడి, వాటిని మానేయకుండా, నిరంతరంగా వాడుతూ ఉంటారు. ఇది సరి కాదు. ఇలా వాడడం వల్ల ఆయా ప్రదేశాల్లోని కండరాలు బలహీనపడతాయి. వెన్ను ఎముకలు ఫ్రాక్చర్లకు గురైనప్పుడు వీటిని దీర్ఘకాలం పాటు వాడుకోవలసి ఉంటుంది. అయితే తాత్కాలికమైన కండరాల గాయాలకు పరిమిత కాలం పాటు వీటిని వాడుకుంటే సరిపోతుంది.

పరీక్షలు ఇవే!

ఎక్స్‌రేలో ఎముకల గాయాలు, వెన్ను అలైన్‌మెంట్‌ వివరాలు తెలుస్తాయి. తలకూ, వెన్నుకూ గాయాలైనప్పుడు ఎక్స్‌రేతో పాటు సిటి స్కాన్‌ చేయించడం తప్పనిసరి. సిటి స్కాన్‌తో ఎక్స్‌రేను మించిన సమాచారం తెలుస్తుంది. అయితే ఎముక చుట్టూరా ఉన్న సున్నితమైన నరాలు, కండరాలు, వెన్ను చుట్టూరా ఉన్న నీరు, జాగాలు లాంటి మృదు కణజాలం గురించిన వివరాలు తెలుసుకోవడం కోసం ఎమ్మారై మీద ఆధారపడక తప్పదు. కొన్ని సందర్భాల్లో మొదట ఎమ్మారై, తర్వాత సిటి స్కాన్‌ అవసరం పడవచ్చు.

వెన్ను సర్జరీలు సురక్షితం

పూర్వం వెన్ను సర్జరీలు చేసే విధానం భిన్నంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఎన్నో అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. ఎండోస్కోప్స్‌, మైక్రోస్కోప్స్‌ వాడకంతో పాటు మినిమల్లీ ఇన్వేసివ్‌ విధానాలను నేటి వైద్యులు అనుసరిస్తున్నారు. కాబట్టి పొరపాట్లకు ఆస్కారాలు తక్కువ. సర్జరీ తదనంతరం అవయవాలు బలహీనపడే అవకాశాలు కేవలం ఒక్క శాతమే! అయితే ఈ బలహీనత తాత్కాలికమే! సర్జరీ తదనంతరం వారం నుంచి మూడు వారాలు లేదా గరిష్ఠంగా ఆరు నెలలు ఈ సమస్య ఉండి, ఫిజియోథెరపీతో తగ్గిపోతుంది. సర్జరీలో నాడులకు జరిగే నష్టం వల్ల లేదా సర్జరీకి ముందే నాడికి జరిగిపోయిన నష్టం వల్ల అరుదుగా కొందర్లో బలహీనత శాశ్వతంగా ఉండిపోవచ్చు. అయితే అవకయవాల్లో బలహీనత తాత్కాలికమైనదైనా, శాశ్వతమైనదైనా, అది అందరూ అనుకున్నంత తీవ్రంగా ఉండదు. కాబట్టి అనవసరపు భయాలు వీడి నిర్భయంగా, వెన్ను సర్జరీలను ఆశ్రయించవచ్చు.

వెన్ను సమస్యలు రాకుండా...

  • ఎక్కువ సమయాల పాటు ఫోన్లు, ల్యాప్‌టా్‌పల వాడకం తగ్గించాలి.

  • ఫోన్‌ను తలకు ఎదురుగా ఉంచుకుని ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి.

  • కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పల ముందు పని చేసేటప్పుడు మానిటర్‌ కళ్లకు ఎదురుగా ఉండేలా కూర్చోవాలి.

  • సోఫాల్లో చేరగిలబడి కూర్చోవడం, హఠాత్తుగా అధిక బరువులు ఎత్తడం లాంటివి చేయకూడదు.

  • బరువులు ఎత్తేటప్పుడు వెన్ను నిటారుగా ఉంచి, కటి ప్రదేశం, మోకాళ్లను వంచి కుంగి, బరువును లేపాలి.

  • ఒకేసారి తీవ్రమైన వ్యాయామాలు చేయకుండా తీవ్రతను క్రమేపీ పెంచాలి.

మెడ, నడుం పట్టేస్తే?

ఈ సమస్యలు సర్వసాధారణం. సాధారణంగా ఈ నొప్పులు రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతూ ఉంటాయి. మెడ, నడుం పట్టేస్తే నరాలు పట్టేశాయని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఆయా ప్రదేశాల్లోని కండరాలు శ్రమకు గురవడం మూలంగా అవి పట్టేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిని మరింత శ్రమకు గురిచేయకుండా విశ్రాంతినిస్తే నొప్పులు తగ్గుతాయి. కాబట్టి మెడ పట్టేసినప్పుడు, మెడను బలవంతంగా తిప్పడం, మర్దన చేయించుకోవడం, యోగాసనాలు వేయడం లాంటివి చేయకూడదు. భరించలేనంత నొప్పి ఉంటే పెయిన్‌ కిల్లర్స్‌ వాడుకోవచ్చు. ఉపశమనం కోసం అనుభవజ్ఞులైన ఫిజియోథెరపిస్టుల పర్యవేక్షణలో స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేయవచ్చు. వేడి నీటి కాపడం పెట్టుకోవచ్చు.

స్కోలియోసిస్‌ సర్జరీ

పుట్టుకతో వెన్ను వంకర ఉన్నప్పుడు, పెరిగే క్రమంలో తలెత్తే సమస్యలు, వంపు పెరుగుదలను అంచనా వేసి, అవసరాన్ని బట్టి సర్జరీతో వెన్ను వంపును సరిదిద్దుకోవచ్చు. కాబట్టి స్కోలియోసి్‌సతో జీవితాంతం బాధపడవలసిన అవసరం లేదు.

డాక్టర్‌ అనిల్‌కుమార్‌,

సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరో

అండ్‌ స్పైన్‌ సర్జన్‌,

స్టార్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌

Updated Date - 2023-01-23T23:13:22+05:30 IST