పరిపూర్ణ తత్త్వ ప్రబోధకుడు

ABN , First Publish Date - 2023-01-27T02:12:00+05:30 IST

అది కన్నడ సీమలోని ఉడుపి పట్టణం. ఆ సాయం సమయంలో... సముద్రంలో ఒక పడవ కదలకుండా నిలిచిపోయింది. దాన్ని కదిలించడానికి నావికులు ఎన్ని ప్రయత్నాలు

పరిపూర్ణ తత్త్వ ప్రబోధకుడు

అది కన్నడ సీమలోని ఉడుపి పట్టణం. ఆ సాయం సమయంలో... సముద్రంలో ఒక పడవ కదలకుండా నిలిచిపోయింది. దాన్ని కదిలించడానికి నావికులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. తీరంలో ఉన్న ప్రజలను సాయం చెయ్యాలని కోరుతూ ఆ నావికులు బిగ్గరగా అరుస్తున్నారు. సముద్రంలో అలలు పోటు మీద ఉండడంతో... ఎవరూ ముందుకు వెళ్ళడానికి సాహసించలేకపోతున్నారు. ఆ సముద్ర తీరంలో... ఒక ఇసుక తిన్నె మీద కూర్చొని, దైవ ధ్యానం చేస్తున్న ఒక యతీశ్వరుడు... ఆ శబ్దాలను విని కళ్ళు తెరిచి చూశారు. పరిస్థితి గ్రహించారు. తన భుజం మీద ఉన్న కాషాయాంబరాన్ని తీసి, పడవను రమ్మన్నట్టుగా ఊపారు. వెంటనే పెనుగాలి వీచింది. సముద్రంలో చిక్కుకున్న పడవ ఒక్కసారిగా ఊగి, సముద్రం వైపు కొట్టుకువచ్చింది. పడవలోని నావికులు, ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడిన ఆ యతీశ్వరుణ్ణి అనేక విధాలుగా ప్రశంసించారు. ఆ యతీశ్వరుడే శ్రీ మధ్వాచార్యులు. వాయుదేవుడి మూడవ అవతారంగా ఆయన కీర్తి పొందారు.

ఉడుపిలో శ్రీ కృష్ణప్రతిమను ప్రతిష్ఠించాలనే సంకల్పంతో శ్రీ మధ్వాచార్యులు ఆ రోజు అక్కడికి వచ్చి ధ్యానం చేస్తున్నారు. ఏదైనా వస్తువు తీసుకోమన్న నావికుల అభ్యర్థన మేరకు... పడవ నలుమూలలా పరిశీలించారు. ఎక్కడో అడుగున పడి ఉన్న గోపీ చందనపు గడ్డను చూశారు. దాన్ని బహుమతిగా ఇస్తే చాలంటూ స్వీకరించారు. ఆయన ఆజ్ఞ ప్రకారం... ఎంతో బరువుగా ఉన్న ఆ గడ్డను ఆయన శిష్యులు సరోవరం దగ్గరకు తీసుకువచ్చారు. సరోవర జలంతో గోపీ చందనాన్ని తొలగించి చూస్తే... సాలగ్రామ శిలతో తయారైన, అత్యంత సుందరమైన బాలకృష్ణుని విగ్రహం బయటపడింది. గోపీ చందనాన్ని తీసి శుభ్రపరిచాక... విగ్రహాన్ని వేరే చోట ఉంచడానికి శిష్యులు ప్రయత్నించారు. కానీ వారికి సాధ్యం కాలేదు. అప్పుడు శ్రీ మధ్యాచార్యులు దాన్ని ఒంటి చేతితో సునాయాసంగా పైకెత్తి, సరైన ప్రదేశంలో ఉంచి, శాస్త్రవిధుల ప్రకారం ప్రతిష్ఠించారు.

ద్వాపర యుగాంతంలో... ద్వారకలో రుక్మిణీదేవి అర్చించిన బాలకృష్ణుని ముగ్ధమోహనం రూపం అది. అంతటి అసాధారణమైన, భగవత్సాన్నిధ్యం కలిగిన ప్రతిమ కాబట్టే... అంతమంది శిష్యులున్నా దాన్ని మోయలేకపోయారు. అయితే, ఆ ప్రతిమ మహాత్మ్యం, విశిష్టత ప్రపంచానికి తెలియాలి. జనులలో పరమాత్మ పట్ల భక్తి విశ్వాసాలు పెరగాలి. అందుకే మొదట శిష్యులతో ఆయన ప్రయత్నం చేయించారు.

శ్రీ మధ్వాచార్యులు ఒకసారి కర్ణాటకలోని కళస అనే గ్రామంలో... భద్రా నదీతీరం దగ్గర ఉన్నారు. ఆయనను దర్శించుకోవడానికి వందలాదిమంది వచ్చారు. ఆ నదిలోకి ఎత్తైన ప్రదేశం నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని నిలువరించడానికి... అతి పెద్ద బండరాయిని వెయ్యి మంది జనం కష్టం మీద మోసుకువచ్చారు. కానీ దాన్ని ప్రవాహం మీద సరిగ్గా అమర్చలేక వదిలేశారు. అది భీముడిలాంటి బలశాలి వల్ల మాత్రమే సాధ్యమంటూ వారు తమ అశక్తతను వ్యక్తం చేశారు. అప్పుడు డెబ్భయ్యేళ్ళ వయసులో ఉన్న శ్రీ మధ్వాచార్యులు ఆ బండరాయిని అవలీలగా ఎత్తి, ప్రవాహానికి అడ్డు వేసి, ఆ ఊరి జనుల సమస్య తీర్చారు. ఈ ఘటన అప్పటి మైసూరు రాష్ట్ర గెజిట్‌లో నమోదయింది. దీనికి సంబంధించిన శిలాశాసనం ఇప్పటికీ ఉంది. ఆ బండరాయిని ఎత్తినట్టు... ఆచార్యులు సకల జీవులను సంసార సాగరంలో పడకుండా ఉద్ధరించి, భగవత్‌ ప్రసాదానికి యోగ్యులుగా చేస్తారనే తత్త్వాన్ని ఈ సంఘటన ద్వారా ఆయన సూచించారని గ్రహించాలి.

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కొలిపేక గ్రామంలో... శ్రీ మధ్వాచార్యులు ఒకసారి చాతుర్మాస వ్రతం ఆచరించారు. ఆయన వ్రతాన్ని ముగించుకొని వెళుతూ, స్థానికుల కోరిక మేరకు... తాను కొలిచిన నరసింహ స్వామి మూర్తికి కుడివైపున ఉన్న రాతి మీద అంగారం (బొగ్గు)తో గీయగా... రుక్మిణీ, సత్యభామా సమేత సంతాన గోపాలకృష్ణ విగ్రహం ఆవిర్భవించింది. ‘‘మరి మిమ్మల్ని ఎలా కొలుచుకోవాలి?’’ అని గ్రామస్తులు అడిగారు. అప్పుడు ఆయన మరో రాతి మీద బొగ్గుతో ఒక రేఖను గీసి, ‘‘నేను బదరికాశ్రమానికి వెళ్ళాక... ఆ రేఖ నా రూపంలోకి మారుతుంది’’ అని చెప్పారు. ఆ గ్రామంలో రాతి మీద ఆయన రూపాన్ని ఈనాటికీ చూడవచ్చు. శ్రీ మధ్వాచార్యులు బదరికాశ్రమంలో ప్రవేశించిన రోజును ‘మధ్వ నవమి’గా పాటిస్తారు.

వ్యక్తి తత్త్వానికి దేన్ని జోడిస్తే... పరిపూర్ణ తత్త్వం తెలుస్తుందో... అదే నిజమైన తత్త్వజ్ఞానం అవుతుంది. ఆలోచించే మనసు, బాహ్య ప్రపంచ వాస్తవాలు, ఈ సమస్త విశ్వాన్నీ నడిపించే అనంతమైన, స్వతంత్రమైన శక్తి గురించి తెలియజేసే విషయాలు ఆ జ్ఞానం పరిపూర్ణతను పొందడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏదో ఒక్కదాన్ని మాత్రమే ఆధారం చేసుకొని ప్రతిపాదించే తత్త్వం సంపూర్ణం కాదు. ఆ మూడిటినీ శ్రీమధ్వాచార్యులు సమన్వయపరిచారు. పరిపూర్ణ తత్త్వజ్ఞానాన్ని ప్రతిపాదించారు. ఆయన స్మరణ మంగళప్రదం, శ్రీహరి అనుగ్రహానికి అత్యంత ఆవశ్యకం.

రవీంద్రనాథ్‌, 9440258841

Updated Date - 2023-01-27T02:12:04+05:30 IST