Modi: ఒకే దేశం ఒకే గ్రిడ్‌

ABN , First Publish Date - 2023-02-07T03:18:42+05:30 IST

దేశ విద్యుత్‌ అవసరాలను సంపూర్ణంగా తీర్చేలా, పర్యావరణానికి ముప్పులేని రీతిలో వన్‌ నేషన్‌ వన్‌ గ్రిడ్‌ పరికల్పన సాకారం చేయబోతున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.

Modi: ఒకే దేశం ఒకే గ్రిడ్‌

ఇంధన రంగంలో స్వావలంబన సాధించాలి: మోదీ

ఈవీల వినియోగం ఇంకా పెరగాలి: మోదీ

కర్ణాటకలో ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రధాని

తుమకూరులో దేశంలోనే అతిపెద్ద

హెలికాప్టర్‌ తయారీ కేంద్రం ప్రారంభం

బెంగళూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): దేశ విద్యుత్‌ అవసరాలను సంపూర్ణంగా తీర్చేలా, పర్యావరణానికి ముప్పులేని రీతిలో వన్‌ నేషన్‌ వన్‌ గ్రిడ్‌ పరికల్పన సాకారం చేయబోతున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. బెంగళూరులోని అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రంలో సోమవారం ఇండియా ఎనర్జీ వీక్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఇంధన రంగంలో స్వావలంబన సాధించి, ప్రకృతి సిద్ధ వనరులను గరిష్ఠంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకించి పెట్రోల్‌, డీజిల్‌ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చిననాడు ప్రజలపై భారం తగ్గుతుందని చెప్పారు. బడ్జెట్‌లో సంప్రదాయేతర ఇంధన వనరుల రంగానికి ప్రాధాన్యంకల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశ విద్యుత్‌ అవసరాల్లో సౌరశక్తి ఉత్పాదన 20 శాతానికి చేరుకోవడం శుభ పరిణామమన్నారు. విద్యుత్‌ వాహనాల వినియోగం మరింత పెరగాలన్నారు.

రక్షణ రంగం వైపు అగ్ర దేశాల చూపు..

రక్షణ రంగంలో భారత్‌ స్వావలంబన దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని మోదీ చెప్పారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలో 615 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్‌ తయారీ కేంద్రాన్ని ప్రధాని సోమవారం జాతికి అంకితం చేశారు. ఇక్కడ ఏటా 40 హెలికాప్టర్లు తయారు చేయనున్నట్టు తెలిపారు. గతంలో సైనికావసరాల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు సైతం భారత రక్షణ వ్యవస్థ వైపు ఆకర్షితులవుతున్నాయన్నారు. అదానీ వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మోదీ తిప్పికొట్టారు. కాలమే వీటికి తగిన సమాధానం చెబుతుందన్నారు.

Updated Date - 2023-02-07T03:19:41+05:30 IST