Nitish Kumar: కమలం గూటికి కుష్వాహ? అనుమానిస్తున్న నితీష్..!

ABN , First Publish Date - 2023-01-25T17:14:20+05:30 IST

కొద్దికాలంగా అసంతృప్తితో కనిపిస్తున్న జేడీ(యూ) పార్లమెంటరీ బోర్డు చీఫ్ ఉపేంద్ర కుష్వాహా బీజేపీతో మంతనాలు సాగిస్తున్నారా? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ..

Nitish Kumar: కమలం గూటికి కుష్వాహ? అనుమానిస్తున్న నితీష్..!

పాట్నా: కొద్దికాలంగా అసంతృప్తితో కనిపిస్తున్న జేడీ(యూ) పార్లమెంటరీ బోర్డు చీఫ్ ఉపేంద్ర కుష్వాహా (Upendra Kushwaha) బీజేపీతో మంతనాలు సాగిస్తున్నారా? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) పరోక్షంగా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తమ పార్టీ (JDU) బలహీనపడుతోందంటూ కుష్వాహ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు నితీష్ అనుమానానికి ప్రధాన కారణం. గత ఏడాది ఆగస్టులో బీజేపీతో తమ పార్టీ (జేడీయూ) తెగతెంపులు చేసినప్పటికీ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు బీజేపీతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారని నితీష్ అనుమానిస్తున్నారు.

కుష్వాహపై మీడియా అడిగిన ప్రశ్నలకు నితీష్ బుధవారంనాడు స్పందించారు. ''బీజేపీతో సంప్రదింపులు సాగిస్తున్న వారిలో కనీసం ఒకరి పేరును చెప్పగలను. జేడీయూ ఇటీవల బలహీనపడుతోందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు'' అని కుష్వాహ పేరును నేరుగా ప్రస్తావించకుండా నితీష్ సమాధానమిచ్చారు. పార్టీ బలహీనపడుతోందన్న వ్యాఖ్యల్లో ఎంతమాత్రం నిజం లేదని, తాజా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తమ బలం 50 లక్షల నుంచి 75 లక్షలకు పెరిగిందని చెప్పారు.

ఎనిమిదేళ్ల తర్వాత సొంతగూటికి..

తొలుత జేడీయూలో ఉన్న కుష్వాహా ఆ తర్వాత పార్టీని విడిచిపెట్టి సొంతంగా 'రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ'ని స్థాపించారు. ఎనిమిదేళ్ల తర్వాత 2021లో తిరిగి జేడీయూ గూటికి వచ్చారు. తన పార్టీని జేడీయూలో విలీనం చేసారు. పార్టీలో గౌరవప్రదమైన పదవిని చేపట్టారు. ఇంతోనే నితీష్‌కు, కుష్వాహకు మధ్య సంబంధాలు క్షీణించడం మొదలుపెట్టాయి. కుష్వాహ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఇటీవల ఒక వర్గం మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నితీష్ వెంటనే తోసిపుచ్చారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రి అని చెప్పారు. కుష్వాహ ప్రోద్బలంతోనే ఒక వర్గం మీడియా ఈ వార్తలు ప్రచురించిందని జేడీయూ అంతర్గత వర్గాలు అనుమానిస్తున్నాయి. కాగా, గత వారంలో మెడికల్ చెకప్ కోసం కుష్వాహ ఢిల్లీలో ఉన్నారు. ఎయిమ్స్‌లో ఆయన వెంట కొందరు బీజేపీ నేతలు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుష్వాహ మద్దతుదారులే ఉద్దేశపూర్వకంగా ఈ ఫోటోలను లీక్ చేసి ఉంటారని జేడీయూ అనుమానిస్తోంది.

కాగా, ముఖ్యమంత్రి నితీష్ మంగళవారంనాడు హాజరైన ఒక కార్యక్రమానికి కుష్వాహను ఆహ్వానించ లేదు. ఈ సమావేశంలోనే కుష్వాహ తిరిగి పార్టీని విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్టు పరోక్షంగా నితీష్ అనుమానాలు వ్యక్తం చేశారు. ''అసంపూర్తిగా మిగిలిన కోరికలు ఏమైనా ఉన్నాయా అనేది ఆయన (కుష్వాహ) ఎప్పుడూ నాకు చెప్పలేదు. ఆయనకు ఎక్కడ నచ్చితే అక్కడకు వెళ్లవచ్చు. కానీ ఆయనకు ఇక్కడ ఎంతో గౌరవం దొరుకుతోంది' అని నితీష్ అన్నారు.

నేను బీజేపీ సభ్యుడ్ని కాను: కుష్వాహ

కాగా, తానెప్పుడు బీజేపీ సభ్యుడిని కానని కుష్వాహ స్పష్టత ఇచ్చారు. సొంతంగా పార్టీ పెట్టడం కానీ, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్డీయేలో చేరడం కానీ చేసే అవకాశాలున్నాయా అని మీడియా అడిగినప్పుడు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు.

Updated Date - 2023-01-25T17:14:21+05:30 IST