మోదీ ఓ విచ్ఛిన్న శక్తి

ABN , First Publish Date - 2023-01-26T01:34:55+05:30 IST

బీబీసీ ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ పేరుతో గత వారం విడుదల చేసిన డాక్యుమెంటరీ మొదటి భాగంపై ఉద్రిక్తతలు నెలకొంటున్న తరుణంలో..

మోదీ ఓ విచ్ఛిన్న శక్తి

లండన్‌, జనవరి 25: బీబీసీ ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ పేరుతో గత వారం విడుదల చేసిన డాక్యుమెంటరీ మొదటి భాగంపై ఉద్రిక్తతలు నెలకొంటున్న తరుణంలో.. మంగళవారం రాత్రి బ్రిటన్‌లో ఆ డాక్యుమెంటరీ రెండవ/చివరి ఎపిసోడ్‌ ప్రసారమైంది. ఈ ఎపిసోడ్‌లో బీబీసీ నేరుగా ప్రధాని మోదీని ఓ విచ్ఛిన్నకర శక్తిగా అభివర్ణించింది. మోదీ చెబుతున్న ‘నవ భారత్‌’ అనే పదం.. విభేదాలు, మతపరమైన ఆందోళనలకు నెలవైందని వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ, భారతీయ ముస్లింలకు మధ్య సమస్యాత్మకమైన సంబంధాలు నెలకొన్నాయని బీబీసీ డాక్యుమెంటరీ ఆరోపించింది. మోదీ 2019లో రెండోసారి ప్రధాని అయ్యాక ఇది తీవ్రమైందని ఆరోపించింది.

మూకదాడులు పెరిగాయి

మోదీ 2014లో అధికారంలోకి రాగానే.. ముస్లింలకు వ్యతిరేకంగా మూకదాడులు పెరిగాయంటూ ఈ డాక్యుమెంటరీ ప్రారంభమవుతుంది. ‘‘మాంసం రవాణాను వివాదాస్పదంగా మార్చారు. ముఖ్యంగా గోమాంసంపై చాలా రాష్ట్రాల్లో నిషేధం విధించారు. గోరక్షకులు హింసకు పాల్పడుతున్నారు’ అని బీబీసీ విమర్శించింది. 2015 మే నుంచి 2018 డిసెంబరు మధ్య కాలంలో దేశంలో 44 మందిని గోవధ పేరుతో హతమార్చారని, గోరక్షకుల దాడుల్లో 280 మంది గాయపడ్డారని వివరించింది.

సీఏఏ, ఢిల్లీ అల్లర్లు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తీసుకురావడాన్ని బీబీసీ తీవ్రంగా విమర్శిస్తూ.. పౌరసత్వానికి మతాన్ని జోడించారని వ్యాఖ్యానించింది. సీఏఏ వ్యతిరేక నిరసనలు, ఈ సందర్భంగా జరిగిన మతకల్లోలాల్లో 53 మంది చనిపోయారని పేర్కొంది. ఢిల్లీ అల్లర్లలో చనిపోయిన వారిలో మూడింట రెండొంతులు ముస్లింలేనని ఈ డాక్యుమెంటరీ పేర్కొంది.

బీబీసీకి ఫీడ్‌ ఇచ్చింది పాకిస్థానే!

బీబీసీ రూపొందించిన ‘ఇండియా! ద మోదీ క్వశ్చన్‌’ రెండు భాగాల డాక్యుమెంటరీకి సింహభాగం ఫీడ్‌(ఫుటేజీ) ఇచ్చింది పాకిస్థానే అని తెలుస్తోంది. పాక్‌ సైన్యం భారత్‌కు వ్యతిరేక ప్రచార కార్యకలాపాల్లో భాగంగా ఈ ఫీడ్‌ను సేకరించిందని సమాచారం. పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన పౌర సంబంధాల విభాగం ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌(ఐఎ్‌సపీఆర్‌) ఖతార్‌ మీదుగా ఈ ఫీడ్‌ను బీబీసీకి అందజేసినట్లు.. ఇందుకు పాక్‌ మీడియా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వంటి సంస్థలు సహకరించినట్లు సీఎన్‌ఎన్‌-న్యూస్‌18 సంస్థ పేర్కొంది.

Updated Date - 2023-01-26T01:34:56+05:30 IST