UP: షాకింగ్.. యూపీలోనూ ఢిల్లీ సీన్

ABN , First Publish Date - 2023-02-07T16:21:46+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కొత్తసంవత్సరం రోజున స్కూటర్‌పై వెళ్లున్న ఓ యువతినిని కారుతో ఢీకొని 4 కిలోమీటర్లు ఊడ్చుకెళ్లడంతో ఆమె మృతి చెందిన ఘటన ఇంకా మరిచిపోకముందే ఇదే తరహా షాకింగ్ ఘటన..

UP: షాకింగ్.. యూపీలోనూ ఢిల్లీ సీన్

మధుర: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తసంవత్సరం రోజున స్కూటర్‌పై వెళ్లున్న ఓ యువతినిని కారుతో ఢీకొని 4 కిలోమీటర్లు ఊడ్చుకెళ్లడంతో ఆమె మృతి చెందిన ఘటన ఇంకా మరిచిపోకముందే ఇదే తరహా షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి మృతదేహాన్ని 10 కిలోమీటర్లుకు పైగా కారు ఈడ్చుకెళ్లిన ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. హిట్-అండ్ డ్రాగ్ (Hit and Drag) కేసుగా పోలీసులు దీనిని అనుమానిస్తున్నారు. కారును నడుపుతున్న ఢిల్లీ నివాసి వీరేందర్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, వేరే ప్రమాదంలో మరణించిన వ్యక్తి తన కారు కింద చిక్కుకున్నట్టు నిందితుడు చెబుతున్నాడు. మృతదేహాన్ని పోలీసులు ఇంకా గుర్తించాల్సి ఉంది.

సంఘటన వివరాల ప్రకారం, వీరేందర్ సింగ్ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆగ్రా నుంచి నొయిడా వస్తున్నాడు. అతని కారు కింద మృతదేహం చిక్కుకోవడాన్ని యమున ఎక్స్‌ప్రెస్‌వే ఉన్న మధుర సమీపంలోని టోల్ బూత్ వద్దనున్న సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. కారును ఆపే సమయానికి మృతదేహం ఛిద్రమై ఉంది. వెంటనే సింగ్‌ను పోలీసులు అరెస్టు చేయగా, సోమవారం అర్ధరాత్రి దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో తన కారు కింద మృతదేహం చిక్కుకున్న విషయాన్ని తాను గుర్తించలేదని నిందితుడు చెప్పినట్టు ఎస్పీ త్రిగుణ్ బైసెన్ తెలిపారు. కాగా, మృతిచెందిన వ్యక్తి ఎవరు? ఎలా చనిపోయాడనే విషయాన్ని నిర్ధారించేందుకు కారు ప్రయాణించిన మార్గంలో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో గత జనవరి 1న ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. స్కూటర్‌పై వెళ్తున్న 20 ఏళ్ల అంజలీ సింగ్‌ను కారు ఢీకొని 13 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె అరుపులను కూడా కారులోని వ్యక్తులు పట్టించుకోలేదు. మృతదేహాన్ని విదిలించుకునేందుకు కారు అనేక మలుపులు తిప్పారు. ఈ ఘటన అనంతరం కారులోని ఐదుగురు వ్యక్తులతో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. రోడ్డు భద్రత ప్రశ్నార్ధకంగా మారినట్టు అనేక మంది నిరసనలు తెలియజేశారు.

Updated Date - 2023-02-07T16:21:47+05:30 IST