Mamata Banerjee: ఇంత అమానవీయమా?..ఈడీపై మమత ఫైర్

ABN , First Publish Date - 2023-06-06T15:31:49+05:30 IST

యూఈఏ వెళ్లాలనుకున్న తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిర బెనర్జీని విమానాశ్రయం వద్ద అధికారులు అడ్డుకోవడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యను తప్పుపట్టారు. ఇది అత్యంత అమానవీయ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mamata Banerjee: ఇంత అమానవీయమా?..ఈడీపై మమత ఫైర్

కోల్‌కతా: యూఈఏ వెళ్లాలనుకున్న తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhisehk Banerjee) భార్య రుజిర బెనర్జీని (Rujira Banerjee) విమానాశ్రయం వద్ద అధికారులు అడ్డుకోవడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మండిపడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చర్యను తప్పుపట్టారు. ఇది అత్యంత అమానవీయ చర్య (Inhuman act) అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలలో రుజిర సోమవారం ఉదయం నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయానికి వెళ్లినప్పుడు ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఈడీ లుక్‌ ఔట్ నోటీసును ప్రస్తావిస్తూ ఆమెను వెనక్కి తిప్పిపంపారు.

దీనిపై మమతా బెనర్జీ మంగళవారంనాడు ఘాటుగా స్పందించారు. ''రుజిర తల్లికి ఆరోగ్యం బాగోలేదు. చాలా విషమంగా ఉంది. తన తల్లిని కలుసుకునేందుకు రుజిర వెళ్లాలనుకుంది. రుజిర విదేశీ పర్యటనలపై సుప్రీంకోర్టు కూడా ఎలాంటి ఆంక్షలు విధించలేదు. విదేశాలకు వెళ్లే మందు ఈడీకి తెలియజేయమని మాత్రమే అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. రుజిర తన పర్యటనపై ముందుగానే ఈడీకి సమాచారం ఇచ్చింది'' అని మమతా బెనర్జీ తెలిపారు. అప్పుడే అనుమతి నిరాకరించిట్టు ఈడీ చెప్పి ఉండాల్సిందని, అలాకాకుండా విమానం ఎక్కేముందు ఆమెను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. విమానాశ్రయంలోనే రుజిరకు సమన్లు ఇచ్చి జూన్ 8న తమను కలవాలని చెప్పడం కన్నా అమానవీయ చర్య మరొకటి ఉండదని ఆక్రోశం వ్యక్తం చేశారు.

అభిషేక్ సవాల్..

పంచాయతీ ఎన్నికల కోసం టీఎంసీ చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని బీజేపీ చూస్తోందని, అందులో భాగంగానే తన కుటుంబాన్ని వేధిస్తోందని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. తమ విదేశీ పర్యటనలపై ఎలాంటి ఆంక్షలు లేవని, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా తన భార్యను ఈడీ అడ్డుకోవడం సరికాదని అన్నారు. అవినీతి చేసినట్టు ఆధారాలు ఉంటే ఈడీ తనను, తన భార్యను అరెస్టు చేసుకోవచ్చంటూ ఆయన సవాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ రాజకీయంగా ఎదుర్కోలేకనే వేధింపులకు దిగుతున్నారని, వాళ్లు కావాలనుకుంటే తన పిల్లల్ని కూడా అరెస్టు చేసుకోవచ్చని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘనపై కోర్టుకు వెళ్లనున్నట్టు టీఎంసీ ఎంపీ అభిషేక్ తెలిపారు.

Updated Date - 2023-06-06T16:14:41+05:30 IST