Jayaho Nari Shakti : జయహో నారీ శక్తి

ABN , First Publish Date - 2023-01-27T02:58:09+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కర్తవ్య పథ్‌లో తొలిసారి నిర్వహించిన ఆర్మీ కవాతులో త్రివిధ దళాలు తమ సత్తాను చాటిచెప్పాయి.

Jayaho Nari Shakti : జయహో నారీ శక్తి

దేశ రాజధానిలో ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు

కర్తవ్య పథ్‌ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఆత్మనిర్భర్‌ ఆయుధాలు, నారీ శక్తి

సైనిక కవాతులో పాల్గొన్న అగ్నివీర్‌లు

న్యూఢిల్లీ, జనవరి 26: దేశ రాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కర్తవ్య పథ్‌లో తొలిసారి నిర్వహించిన ఆర్మీ కవాతులో త్రివిధ దళాలు తమ సత్తాను చాటిచెప్పాయి. ‘నారీ శక్తి’ నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ముఖ్య అతిథిగా ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్‌ అల్‌-సిసీ హాజరయ్యారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రతిబింబించేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 105-ఎంఎం ఇండియన్‌ ఫీల్డ్‌ గన్‌లతో సాయుధ దళాలు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం రాష్ట్రపతి ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో వేడుకలు మొదలయ్యాయి. అంతకుముందు జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవాతులో కొత్తగా సైన్యంలో చేరిన తొమ్మిది మంది అగ్నివీరుల (ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు) బృందం భాగమైంది. కల్నల్‌ మహమూద్‌ మొహమ్మద్‌ అబ్దెల్‌ ఫతేహ్‌ ఎల్ఖరాసావీ నేతృత్వంలో 144మంది ఈజిప్షియన్‌ సైనిక బ్యాండ్‌ కవాతులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అబ్బురపరిచిన వైమానిక విన్యాసాలు

కర్తవ్యపథ్‌లో భారత వైమానిక దళం (ఐఏఎ్‌ఫ)కు చెందిన 45 విమానాలు సహా 50 విమానాలు విన్యాసాలను ప్రదర్శించాయి. నౌకాదళంలో 42 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన సముద్ర నిఘా విమానం ఐఎల్‌-38 కూడా తొలిసారి, చివరిసారిగా ప్రదర్శనలో నిలిచింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ను ప్రతిబింబించేలా ఈసారి వేడుకల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధాన యుద్ధ ట్యాంకు అర్జున్‌, నాగ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ (ఎన్‌ఏఎంఐఎ్‌స), కే-9 వజ్ర హోవిట్జర్‌ను ప్రదర్శించారు. నారీశక్తి నినాదంతో ఆకాశ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సైళ్లకు లెఫ్టినెంట్‌ చేతనా శర్మ నేతృత్వం వహించారు. కాగా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న వివిధ ఔట్‌పో్‌స్టల వద్ద బీఎ్‌సఎఫ్‌, పాకిస్థాన్‌ రేంజర్లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.

ఒంటెల బ్యాండ్‌ సందడి

బీఎ్‌సఎ్‌ఫకు చెందిన ఒంటెల బ్యాండ్‌ పరేడ్‌లో సందడి చేసింది. ముగ్గురు పరమవీరచక్ర, ముగ్గురు అశోకచక్ర అవార్డు గ్రహీతలు కవాతులో పాల్గొన్నారు. భారతదేశ శక్తిమంతమైన సాంస్కృతిక, వారసత్వం, ఆర్థిక, సామాజిక పురోగతిని ప్రతిబింబించేలా గణతంత్ర వేడుకల్లో 23 శకటాలను ప్రదర్శించారు. వీటిలో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి రాగా మరో 6 వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందినవి ఉన్నాయి. వాయుసేన, నౌకాదళాలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్రపంచవ్యాప్తంగా త్రివర్ణ పతాక రెపరెపలు

లండన్‌, జనవరి 26: భారత 74వ గణతంత్ర వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు కూడా భారత్‌కు గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు... ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌.. భూటాన్‌ ప్రధాని లోటో టెహ్రింగ్‌... యూఏఈ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌లు భారత్‌తో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌లోని ఇండియా హౌస్‌లో త్రివర్ణ పతాకావిష్కరణ ఘనంగా జరిగింది.

Updated Date - 2023-01-27T02:58:12+05:30 IST