Jairam Ramesh : అదానీని దాచలేరు

ABN , First Publish Date - 2023-02-06T01:08:47+05:30 IST

అదానీ గ్రూప్‌పై వచ్చిన భారీ ఆరోపణలు, స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణంపై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో స్పందించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. అదానీతో ఉన్న లింకులను దాచలేరని వ్యాఖ్యానించింది. ‘‘మీ మహా మౌనం కుమ్మక్కు కాదా? ప్రశ్నల నుంచి మీరు తప్పించుకోలేరు

 Jairam Ramesh : అదానీని దాచలేరు

మీరు మౌనం వీడే వరకు రోజుకు మూడు ప్రశ్నలు సంధిస్తాం

వాటి నుంచి తప్పించుకోలేరు.. మహా మౌనం కుమ్మక్కు కాదా?

అదానీకి మీరేమవుతారో చెప్పండి.. మోదీపై కాంగ్రెస్‌ నిప్పులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): అదానీ గ్రూప్‌పై వచ్చిన భారీ ఆరోపణలు, స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణంపై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో స్పందించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. అదానీతో ఉన్న లింకులను దాచలేరని వ్యాఖ్యానించింది. ‘‘మీ మహా మౌనం కుమ్మక్కు కాదా? ప్రశ్నల నుంచి మీరు తప్పించుకోలేరు. మోదీ.. అదానీకి మీరేమవుతారు? మీరు మౌనం వీడే వరకు రోజుకు మూడు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం’’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పనామా పేపర్లు లీకైనప్పుడు పన్ను ఎగవేతను ప్రోత్సహించే దేశాల నుంచి ధన ప్రవాహంపై విచారణ సాగిస్తానని 2016 ఏప్రిల్‌ 4న మోదీ స్వయంగా చెప్పారని అన్నారు. అదేవిధంగా చైనాలో జీ-20 సమావేశాలు జరిగిన సమయంలో మనీలాండరింగ్‌ చేసే వారిని బేషరతుగా తెచ్చేందుకు ఉన్న అంతర్జాతీయ నిబంధనలను సడలించాలని, బ్యాంకింగ్‌ రహస్యాలను బద్దలు కొట్టి అవినీతిని బహిర్గతం చేయాలని 2016 సెప్టెంబరు 5న మోదీ ప్రకటించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘హం అదానీ కీ హై కౌన్‌’ అని ప్రశ్నించుకోవాల న్నారు. ‘అదానీ మహా మెగా స్కామ్‌’పై ప్రధాని మౌనాన్ని తాము ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి జైరాం రమేశ్‌ కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటినుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు.

  • బహమాస్‌, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో వ్యాపార సంస్థలు నడుపుతున్న గౌతం అదానీ సోదరుడు వినోద్‌ అదానీ పేరు పనామా, పండోరా పేపర్లలో వచ్చింది. అనేక షెల్‌ కంపెనీలతో ఆయన స్టాక్‌ మార్కెట్‌ బిజినె్‌సలో అక్రమ లావాదేవీలు నిర్వహించారని, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడ్డారని తేలింది. అవినీతిని ఎదుర్కోవడంలో మీకు నిజాయితీ ఉందని చెప్పారు. అందుకోసం భారీ ఎత్తున పెద్ద నోట్ల రద్దు కూడా చేశారు. మీతో సన్నిహిత సం బంధం ఉన్న వ్యాపార సంస్థే అక్రమాలకు పాల్పడిన విష యం వాస్తవం కాదా, మీ దర్యాప్తులో నిజాయితీ ఉందా?

  • గత కొన్నేళ్లుగా మీరు ఈడీ , సీబీఐ, రెవెన్యూ ఇంటలిజెన్స్‌ వంటి ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు. మీ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు, అనుకూల వ్యక్తుల వ్యాపార ప్రయోజనాలకు తోడ్పడని వ్యాపార సంస్థలను శిక్షించేందుకు వాటిని ఉపయోగించుకున్నారు. అదానీ గ్రూప్‌పై చాలా ఏళ్లుగా వస్తున్న తీవ్రమైన ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మీ హయాంలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగే అవకాశం ఉందా?

  • భారత్‌లో ఒక పెద్ద సంస్థ (అదానీ) దేశంలోని విమానాశ్రయాలు, రేవులు చేజిక్కించుకుని గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. ఆ సంస్థపై పలు ఆరోపణలు వచ్చినప్పటికీ ఎందుకు దర్యాప్తు చేయించలేదు? మిగతా వ్యాపార సంస్థలు అంతకంటే తక్కు వ తప్పులు చేసినప్పటికీ శిక్షించారు. ఇన్నేళ్లుగా అవినీతి వ్యతిరేకత పేరుతో మీరు ప్రదర్శిస్తున్న వాగాడంబరం అదానీ గ్రూప్‌నకు లాభం చేకూర్చేందుకేనా? అని జైరాం రమేశ్‌ నిప్పులు చెరిగారు.

దేశ ప్రతిష్ఠ దెబ్బతింది: మాయావతి

అదానీ వ్యవహారంతో దేశ ప్రతిష్ఠ దెబ్బతిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. రవిదాస్‌ జయంతి సందర్భంగా ఆదివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి అంశాలపై పరిష్కారాలు కనుగొనేబదులు ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ ప్రభుత్వం కొత్త వాగ్దానాలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం అదానీ అంశాన్ని తేలిగ్గా తీసుకోవడంపై ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉన్నారన్నారు. ఒక వ్యాపార వేత్త కార్యకలాపాల వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థ నిరాశా నిస్పృహలకు గురైందన్నారు.

Updated Date - 2023-02-06T01:08:49+05:30 IST