IBM and SAP : ‘వేటు’ బాటలో ఐబీఎం, ఎస్‌ఏపీ

ABN , First Publish Date - 2023-01-27T02:52:47+05:30 IST

ఉద్యోగులను తొలగించే కంపెనీల జాబితాలో జర్మనీ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఎస్‌ఏపీ, అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషిన్స్‌ (ఐబీఎం), ఫిన్లాండ్‌కు చెందిన ఎలివేటర్ల తయారీ కంపెనీ

IBM and SAP : ‘వేటు’ బాటలో ఐబీఎం, ఎస్‌ఏపీ

3,900 మందిని తొలగిస్తామన్న ఐబీఎం

3వేల మందికి ఉద్వాసన తప్పదన్న ఎస్‌ఏపీ

డౌలో 2 వేలు, కోనెలో వెయ్యి మందిపై వేటు

న్యూయార్క్‌/బెర్లిన్‌, జనవరి 26: ఉద్యోగులను తొలగించే కంపెనీల జాబితాలో జర్మనీ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఎస్‌ఏపీ, అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషిన్స్‌ (ఐబీఎం), ఫిన్లాండ్‌కు చెందిన ఎలివేటర్ల తయారీ కంపెనీ కోనె, మెటీరియల్స్‌ సైన్స్‌ కంపెనీ డౌ చేరిపోయాయి. ఈ ఏడాదిలో 3,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్టు గురువారం ఎస్‌ఏపీ ప్రకటించడంతో ఆ కంపెనీ ఉద్యోగుల్లో బాంబు పేలినంత పనైంది. అదేతీరులో ఐబీఎం కార్ప్‌ సైతం 3,900 మందిని తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఎస్‌ఏపీలో దాదాపు 1.20 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కంపెనీ చేపట్టే పునర్‌వ్యవస్థీకరణ ద్వారా 2024 నుంచి వార్షికంగా 300-350 మిలియన్‌ యూరోలు ఆదా కానున్నట్టు అంచనా. ఇక ఐబీఎం విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల్లో దాదాపు 1.5 శాతం అంటే 3,900 మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఐబీఎంలో 2.60 లక్షల మంది ఉద్యోగులున్నారు. కంపెనీ వార్షిక నగదు లక్ష్యాలను అందుకోలేకపోయిందని, అధిక వృద్ధికి అవకాశం ఉన్న విభాగాల్లో ఉద్యోగులను నియమించుకుంటామని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పేర్కొన్నారు. అలాగే, ఫిన్లాండ్‌కు చెందిన ఎలివేటర్ల తయారీ కంపెనీ కోనె.. ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది వరకు ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగులను తగ్గించుకోవడం వల్ల వచ్చే ఏడాది నుంచి కంపెనీకి వార్షికంగా 100 మిలియన్‌ యూరోలు ఆదా కానుంది. మెటీరియల్స్‌ సైన్స్‌ కంపెనీ డౌ.. దాదాపు 2,000 మంది ఉద్యోగులను తగ్గించుకుంటోంది. ఈ ఏడాదిలో 100 కోట్ల డాలర్ల వ్యయాలను ఆదా చేసుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. దీన్ని చేరుకోవడానికి కంపెనీ ఉద్యోగులపై వేటుకు సిద్ధమైంది.

Updated Date - 2023-01-27T02:52:48+05:30 IST