Earthquake: 2600 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2023-02-07T03:08:51+05:30 IST

పశ్చిమాసియా దేశాలు తుర్కియే, సిరియాల్లో కాలికింద భూమి బద్దలైంది. ఆకాశ హార్మ్యాలు పేకమేడల్లా కూలిపోయాయి.

Earthquake: 2600 మంది దుర్మరణం

తుర్కియే, సిరియాల్లో భారీ భూకంపం..

మృతుల సంఖ్య 10 వేలకు చేరే అవకాశం

తెల్లవారుజామున ఘటన.. నిద్రలోనే మృత్యుఒడికి వందల మంది

ఉదయం, మధ్యాహ్నం వేళల్లో మరో రెండు భారీ భూకంపాలు

రోజులో 39 సార్లు కంపించిన భూమి.. కుప్పకూలిన అపార్టుమెంట్లు

వేల మందికి గాయాలు.. శిథిలాల కింద చిక్కిన వందల మంది

తుర్కియేను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని మోదీ ప్రకటన

E.jpg

అంకారా/డమాస్కస్‌, ఫిబ్రవరి 6: పశ్చిమాసియా దేశాలు తుర్కియే, సిరియాల్లో కాలికింద భూమి బద్దలైంది. ఆకాశ హార్మ్యాలు పేకమేడల్లా కూలిపోయాయి. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ భూకంపంతో వందల మంది నిద్రలోనే మృత్యు కౌగిలిలోకి ఒదిగిపోయారు. ప్రజలు ఆర్తనాదాలు చేస్తూ.. వీధుల్లోకి పరుగులు తీశారు..! ఒకటి కాదు.. రెండు కాదు 15 నిమిషాల వ్యవధిలోనే పలుమార్లు భూ ప్రకంపనలు..! ఆ తర్వాత మరో భారీ భూకంపం..! మధ్యాహ్నానికి ఇంకో భూకంపం..! సాయంత్రం వరకు 39 సార్లు భూమి కంపించగా.. 2,600 మందికి పైగా దుర్మరణం పాలైనట్లు ఆయా దేశాల అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని, శిథిలాల కిందే వందల మంది ఉండి ఉంటారని తెలిపాయి. ఈ రెండు దేశాల్లో వేల మంది క్షతగాత్రులయ్యారు. మృతుల్లో సిరియా ప్రధాని సోదరి, ఆమె 11 మంది పిల్లలు ఉన్నారు. రాత్రి కడపటి వార్తలందేసరికి కూడా.. భూకంప హెచ్చరికలతో ప్రజలు చలిలో గజగజ వణుకుతూ.. ఆరుబయటే కాపుకాచారు. భూకంప కల్లోలిత తుర్కియే, సిరియాలకు ఆపన్న హస్తమందించేందుకు ప్రపంచదేశాలు ముందుకు వచ్చాయి. సహాయక చర్యల కోసం భారత్‌ 100 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాన్ని పంపుతోంది. వైద్య బృందాలు, మందులు, ఆహార ధాన్యాలను కూడా తరలిస్తోంది. తుర్కియే, సిరియాల్లో భూకంప విలయం పట్ల ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

E2.jpg

తెల్లవారుజామునే ఉత్పాతం

తుర్కియే కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 4.17 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆగ్నేయ తుర్కియేలోని గాజియాన్‌టె్‌పకు 33 కిలోమీటర్ల దూరంలో, 17 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరియా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. దీని ప్రభావం దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాలో తీవ్రంగా కనిపించింది. ఆ వెంటనే.. 15 నిమిషాల వ్యవధిలో 20 సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సరిగ్గా 15 నిమిషాల తర్వాత రిక్టర్‌ స్కేల్‌పై 6-7 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. తుర్కియేలోని 10 నగరాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. అటు సిరియాలోని డమాస్కస్‌, హామ, అలెప్పొ నగరాలు విలవిలలాడిపోయాయి. ఈ ఘటనల్లో తుర్కియేలో 950 మంది, సిరియాలో 320 మంది చనిపోయినట్లు అధికారులు తొలుత ప్రకటించారు. మధ్యాహ్నం 1.27 సమయంలో ఎనోజు నగరం కేంద్రంగా రిక్టర్‌ స్కేల్‌పై 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. దీంతో.. మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. తుర్కియేలోని దియార్‌బాకిర్‌ నగరంలో మీడియా భూకంప దృశ్యాలను చిత్రీకరిస్తుండగా.. అక్కడే ఉన్న ఓ 14 అంతస్తుల భవనం పేకమేడలా కూలిపోయింది. మూడో భూకంపం తీవ్రతతో ఘహ్రామ్‌మరాష్‌ పట్టణంలోని గ్యాస్‌ పైప్‌లైన ధ్వంసమై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

దట్టమైన పొగ కొన్ని కిలోమీటర్ల దాకా కనిపించింది. అక్కడ మరణాల సంఖ్య ఇంకా తెలియరాలేదు. రాత్రి కడపటి వార్తలందేసరికి ఇరుదేశాల్లో మరణాల సంఖ్య 2,600 దాటిందని, 3 వేలకు పైగా భవనాలు కుప్పకూలిపోయాయని అధికారులు తెలిపారు. తుర్కియేలో 1,541, సిరియాలో 783 మృతదేహాలను వెలికితీసినట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకుని ఉంటారని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 10 వేలు దాటొచ్చని అంచనా. వరుస భూకంపాల తీవ్రతకు అదానా, హాటె విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి. హాటెలో రన్‌వే పూర్తిగా ధ్వంసమైంది. దీంతో.. ఆ రెండు విమానాశ్రయాల్లో సేవలను నిలిపివేశారు. 238 విమానాలను రద్దు చేశారు. ఒక్క ఇస్తాంబుల్‌ నుంచి మాత్రమే ఇరాన్‌కు విమాన సేవలు కొనసాగుతున్నాయి.

ఎక్కడ చూసినా హాహాకారాలు

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఎక్కడ చూసినా.. క్షతగాత్రుల హాహాకారాలు, తమవారు కనిపించడం లేదంటూ ప్రజల రోదనలు కనిపించాయి. మధ్యాహ్నం సంభవించిన భూకంపం తర్వాత.. ఇళ్లలో, బహుళ అంతస్తుల్లో ఎవరూ ఉండకూడదంటూ తుర్కియే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో, మంచుకురుస్తున్నా.. చలిలోనే ప్రజలు ఆరుబయట పడిగాపులుకాచారు. సిరియాలోని డమాస్కస్‌, హామ్‌, తీరప్రాంతమైన లటోయాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) దుశ్చర్యతో ఇప్పటికే సగం దెబ్బతిన్న భవనాలు.. సోమవారం నాటి భూకంపంతో చాలా వరకు కుప్పకూలిపోయాయి. సిరియా ముఖ్యపట్టణం డమాస్క్‌సలో క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయి. చివరకు ప్రసూతి ఆస్పత్రుల్లో ఉన్న శిశువులను వేరే భవనాలకు తరలించి, క్షతగాత్రులకు చికిత్సనందిస్తున్నారు. భూకంపం ధాటికి డమాస్క్‌సలోని సిరియా ప్రధాని హుస్సేన్‌ అర్నాస్‌ సోదరి వెసుమ్‌ అర్నాస్‌ నివాసముంటున్న భవనం కూలిపోయింది. ఈ ఘటనలో వెసుమ్‌, ఆమె 11 మంది పిల్లలు మృతిచెందారు. తుర్కియేలోని గాజియాంటె్‌పలో కొండపై ఉన్న ప్రపంచ వారసత్వ కట్టడం, 2,200 సంవత్సరాల పురాతన కోట దాదాపుగా ధ్వంసమైంది. ఆ కోటను అప్పట్లో రోమన్లు నిర్మించారు. ఆ కోట ఆవరణలో ఉన్న 17వ శతాబ్ది నాటి గేబుల్‌ మసీదు మినార్లు కూలిపోయాయి. మాలట్యా నగరంలోని 13వ శతాబ్ది నాటి పురాతన మసీదు కూడా పాక్షికంగా ధ్వంసమైంది. కాగా, తుర్కియేలో ఇదే ప్రాంతంలో 1939లో వచ్చిన భూకంపంలో 37వేల మంది, 1999లో 17వేల మంది మృతి చెందారు.

E4.jpg

ముందే హెచ్చరించిన పరిశోధకుడు

తుర్కియే, సిరియాతోపాటు.. జోర్దాన్‌, లెబెనాన్‌లకు భూకంపం ముప్పు పొంచి ఉందని ఈ నెల 3న హెచ్చరికలు జారీ చేశామని నెదర్లాండ్స్‌లోని సోలార్‌ సిస్టమ్‌ జామెట్రీ సర్వే(ఎ్‌సఎ్‌సజీఈవోఎ్‌స)కు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్‌ హూగర్బీట్‌ వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.5గా ఉండే అవకాశాలున్నట్లు ట్విటర్‌ ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. అయినా.. ప్రభుత్వాలు స్పందించలేదని విమర్శించారు.

ఒక్కసారిగా భయపడిపోయాం

మేము భూకంప కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసేరి ప్రాంతంలో ఉంటున్నాం. తెల్లవారుజామున 4.17 సమయంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో ఉలిక్కిపడి నిద్రలేచాం. కాసేపటికి కుదుటపడిందనుకున్నంతలో వరుసగా భూప్రకంపనలు వచ్చాయి. వెంటనే అపార్ట్‌మెంట్‌లోంచి బయటకు వచ్చాం. బయట మంచు కురుస్తోంది. కారులో హీటర్‌ ఆన్‌ చేసుకుని కూర్చున్నాం. తెల్లారేదాకా కార్లోనే ఉన్నాం. తర్వాత అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాం. మధ్యాహ్నం వచ్చిన భూకంపంతో అపార్ట్‌మెంట్‌లోని అందరం బయటకు పరుగులు తీశాం. మంచు కురుస్తుండగానే.. టాక్సీ స్టాండ్‌లో కూర్చున్నాం. ఊళ్లలో ఇండిపెండెంట్‌ ఇళ్లు ఉన్నవారు వెళ్లిపోయారు. మా స్నేహితుడొకరు ఫోన్‌ చేసి, తమ ఊరికి రమ్మని పిలిస్తే వెళ్లి, తలదాచుకున్నాం.

- ప్రగతి, ఆదిత్య, భారతీయులు

..........

Updated Date - 2023-02-07T03:08:52+05:30 IST