DMK: ‘ఎయిమ్స్‌ ఎక్కడ?’

ABN , First Publish Date - 2023-01-25T08:24:50+05:30 IST

మదురై ఎయిమ్స్‌(AIIMS Madurai) నిర్మాణపనుల్లో జాప్యం జరగడాన్ని నిరసిస్తూ డీఎంకే, కూటమి పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం భారీ

DMK: ‘ఎయిమ్స్‌ ఎక్కడ?’

- మదురైలో డీఎంకే కూటమి ధర్నా

పెరంబూర్‌(చెన్నై), జనవరి 24: మదురై ఎయిమ్స్‌(AIIMS Madurai) నిర్మాణపనుల్లో జాప్యం జరగడాన్ని నిరసిస్తూ డీఎంకే, కూటమి పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా జరిగింది. రాష్ట్రంలో ఎయిమ్స్‌ ఆస్పత్రి ఏర్పాటుచేస్తామని 2015 ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసం స్థలం ఎంపిక చేసినా, ఆస్పత్రి భవనాల నిర్మాణాలు ముందుకు సాగలేదు. ఇప్పటికూడా పూర్తిస్థాయి పనులు ప్రారంభం కాలేదు. కానీ, ఎయిమ్స్‌ వైద్య కళాశాల ఆస్పత్రికి అడ్మిషన్లు పూర్తిచేసి, విద్యార్థులకు రామనాథపురం(Ramanathapuram) ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిలో తరగతులు నిర్వహిస్తున్నారు. జపాన్‌ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ నిధులు రావడంలో జాప్యం అయిన నేపథ్యంలో, కేంద్రప్రభుత్వ తన వాటాగా రూ.400 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. ఈ నేపథ్యంలో, మదురై ఎయిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణపనులు ప్రారంభించాలని కోరుతూ డీఎంకే కూటమి పార్టీల ఆధ్వర్యంలో మదురై పలంగాత్తమ్‌ ప్రాంతంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ‘మా ఎయిమ్స్‌ ఎక్కడ?’ అనే నినాదంతో చేపట్టిన ఈ ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్‌, ఎంపీ ఎస్‌.వెంకటేశన్‌, డీఎంకే ఎమ్మెల్యే దళపతి, ఎండీఎంకే ఎమ్మెల్యే భూమినాధన్‌, కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్‌ ఠాగూర్‌, నవాజ్‌ ఘనీ తదితరులు ‘ఎయిమ్స్‌’ పేరు ముద్రించిన ఇటుక చేతబట్టి కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.

Updated Date - 2023-01-25T08:24:52+05:30 IST