Congress: మోదీ 9 ఏళ్ల పాలనపై 9 ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2023-05-26T18:26:43+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవాల్టితో తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానిపై 9 సూటి ప్రశ్నలు సంధించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల ఆదాయం వంటి పలు అంశాలపై నిలదీసింది. తొమ్మిదేళ్ల హయాంలో ప్రజలను వంచించినందుకు క్షమాపణ చెప్పాలని, ఈరోజును 'మాఫీ దివస్'గా ప్రకటించాలని డిమాండ్ చేసింది.

Congress: మోదీ 9 ఏళ్ల పాలనపై 9 ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం ఇవాల్టితో తొమ్మిదేళ్ల పాలన (Nine years in office) పూర్తి చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రధానిపై 9 సూటి ప్రశ్నలు సంధించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల ఆదాయం వంటి పలు అంశాలపై నిలదీసింది. తొమ్మిదేళ్ల హయాంలో ప్రజలను వంచించినందుకు క్షమాపణ చెప్పాలని, ఈరోజును 'మాఫీ దివస్'గా ప్రకటించాలని డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ''భారత్ జోడో యాత్ర''లో లేవనెత్తిన అంశాల ఆధారంగానే మోదీ సర్కార్‌కు తొమ్మిది ప్రశ్నలు అడుగుతున్నట్టు శుక్రవారంనాడిక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ చెప్పారు. దీనికి ముందు, "నౌ సాల్, నౌ సవాల్'' పేరుతో ఒక బుక్‌లెట్‌ను జైరామ్ రమేష్, పార్టీ నేతలు పవన్ ఖేరా, సుప్రియా శ్రినటె విడుదల చేశారు. అనంతరం మీడియాతో జైరామ్ రమేష్ మాట్లాడుతూ, తొమ్మిదేళ్ల క్రితం మోదీ ఇదే రోజు ప్రధాని అయ్యారని, ఆయనను తమ పార్టీ తొమ్మిది ప్రశ్నలు అడగాలని అనుకుంటోందని చెప్పారు. తాము అడిగే తొమ్మిది ప్రశ్నలకు ప్రధాని మౌనం వీడి సమాధానం చెప్పాలనన్నారు.

''ద్రవ్యోల్బణం, నిరుద్యోగం భారతదేశంలో ఉవ్వెత్తున ఎగసిపడటానికి కారణం ఏమిటి? ధనవంతులు మరింత ధనవంతులు, పేదలు మరింత పేదలుగా ఎందుకు మారుతున్నారు? ప్రజా ఆస్తులను మోదీ మిత్రులకు ఎందుకు అమ్మేస్తున్నారు? పేదలు, ధనికుల మధ్య అసమానతలు ఎందుకు పెరిగాయి?. నల్లచట్టాలుగా ముద్రపడిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ వారితో రైతులతో చేసుకున్న అగ్రిమెంట్లను ఇంతవరకూ ఎందుకు అమలు చేయలేదు? కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేకపోయారు? తొమ్మిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు ఎందుకు కాలేదు?" అని జైరామ్ రమేష్ వరుస ప్రశ్నలు సంధించారు.

ప్రభుత్వం అవినీతి, ఆశ్రితపక్షపాతానికి పాల్పడుతోందని రమేష్ ఆరోపించారు. ఎల్ఐసీ, ఎస్‌బీఐలో ప్రజలు కష్టపడి దాచుకున్న సొమ్ములను తన మిత్రుడైన అదానీ ప్రయోజనాలకు ఎందుకు వెచ్చించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ''బీజేపీ పాలిత ప్రాంతాల్లో విచ్చలవిడి అవినీతిపై ఎందుకు మౌనంగా ఉన్నారు? భారతీయల కడగండ్లను ఎందుకు పట్టించుకోవడం లేదు?'' అని జైరామ్ రమేష్ ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ది కోసం విద్వేష రాజకీయాలకు ఎందుకు పాల్పడుతున్నారు? సమాజంలో భయాలు పెరుగుతున్న వాతావరణం ఎందుకు కల్పిస్తున్నారు? మహిళలు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? కుల గణన డిమాండ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కూడా ఆయన ఆరోపించారు. తద్వారా రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్థలు గత తొమ్మిదేళ్లుగా బలహీనపడుతున్నాయని అన్నారు.

ప్రతిపక్ష పార్టీలు, నేతలపై ఎందుకు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ధనబలంతో అస్థిరపరచేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని కూడా నిలదీశారు. కోవిడ్ కావలంలో 40 లక్షల మంది ప్రాణాలు కోల్పేతే వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల లక్షలాది మంది వసల కార్మికులు తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు ఎన్నో పాట్లు పడ్డారని, వారిని ఎందుకు ఆదుకోలేకపోయారని ప్రశ్నించారు. తాము అడిగిన ప్రశ్నలకు ఇప్పటికైనా ప్రధాని మౌనం వీడి సమాధానం ఇవ్వాలని జైరామ్ రమేష్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-05-26T18:28:46+05:30 IST