Arvind Kejriwal: కేజ్రీ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-02-07T14:14:34+05:30 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి (Chief Minister of Delhi) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Arvind Kejriwal: కేజ్రీ కీలక నిర్ణయం
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ (Delhi Mayor) ఎన్నిక ముచ్చటగా మూడోసారి కూడా వాయిదా పడటంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి (Chief Minister of Delhi) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం విచారణ జరపనుంది.

నిన్న ప్రతిపక్ష బీజేపీ(BJP) సభ్యులు, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సభ్యుల మధ్య సభలో మళ్లీ గందరగోళం చెలరేగడంతో మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోకుండానే సభ వాయిదా పడింది. మునిసిపల్ హౌస్ సమావేశమైన తర్వాత పాత ఘటనలే పునరావృతమ్యాయి. ఆప్ నిరసనలతో సభకు అంతరాయం కలిగింది. గతంలో రెండుసార్లు ఎన్నిక వాయిదా పడి మూడోసారి సభ సమావేశమైంది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) నామినేట్ చేసిన 10 మంది ఢిల్లీ కౌన్సిలర్లు ఓటు వేసేందుకు అనుమతించడంతో ఆప్ విరుచుకుపడింది. దీంతో సభా కార్యక్రమాల్లో అంతరాయం తలెత్తింది.

కీలకమైన 18 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులలో ఆరుగురిని కూడా ఎన్నుకోవాల్సి ఉంది. మిగిలిన 12 మందిని జోనల్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు. కాగా, కీలకమైన ఆరుగురు సభ్యుల ఎన్నికలో మూడు సీట్లు ఆప్ గెలుచుకోనుండగా, బీజేపీ రెండు సీట్లు దక్కుంచుకోనుంది. కీలకమైన ఆరో సీటు విషయంలోనే సభలో గందరగోళం తలెత్తింది. నామినేట్ సభ్యులను ఓటింగ్‌కు అనుమతిస్తే బీజేపీకి ఆ సీటు దక్కే అవకాశం ఉంది. ఇది ఆప్‌కు ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆప్ నిరసనకు దిగింది.

ఢిల్లీ మున్సిపల్ యాక్ట్-1957 ప్రకారం తొలి మున్సిపల్ సమావేశాల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఈనెల 6, 24 తేదీల్లో జరిగిన రెండు సమావేశాలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఈనెల 6న తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు ఎల్జీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

250 స్థానాలున్న ఢిల్లీ మున్సిపాలిటీకి గత డిసెంబర్ 4న ఎన్నికలు జరుగగా, డిసెంబర్ 7న ఫలితాలు వెలువడ్డాయి. ఆప్ 134 సీట్లు గెలుచుకుని, మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సీట్లు గెలుచుకుంది. బీజేపీ 104 వార్డులు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుంది. కాగా, ఆప్ తరఫున ఢిల్లీ మేయర్‌ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ పోటీ పడుతున్నారు. బీజేపీ తరఫున రేఖా గుప్తా పోటీ చేస్తు్న్నారు. డిప్యూటీ మేయర్ పదవికి ఆప్ తరఫున అలెయ్ మొహమ్మద్ ఇక్బాల్, బీజేపీ నుంచి కమల్ బాగ్రి పోటీ పడుతున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు ఎంసీడీ స్టాడింగ్ కమిటీకి ఆరుగురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది.

Updated Date - 2023-02-07T14:40:37+05:30 IST