Chief Minister: పరిశోధనలకు పెద్దపీట

ABN , First Publish Date - 2023-02-02T07:21:10+05:30 IST

విద్యారంగంలో పరిశోధనలకు పెద్దపీట వేస్తామని, పరిశోధనలే కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాయని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) పేర్కొన్నారు.

Chief Minister: పరిశోధనలకు పెద్దపీట

- వీఐటీలో సీఎం స్టాలిన్‌

వేలూరు(చెన్నై), ఫిబ్రవరి 1: విద్యారంగంలో పరిశోధనలకు పెద్దపీట వేస్తామని, పరిశోధనలే కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాయని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) పేర్కొన్నారు. వేలూరులోని ‘వేలూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (వీఐటీ) ప్రాంగణంలో నిర్మించిన కరుణానిధి హాస్టల్‌ బ్లాక్‌, పెరల్‌ రీసెర్చ్‌ పార్క్‌లను బుధవారం సాయంత్రం ప్రారంభించిన సీఎం మాట్లాడుతూ.. వేలూరును ‘క్యాపిటల్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ స్టడీ్‌స’గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రాష్ట్ర యువత విద్య, జ్ఞానం, ఆలోచనా సామర్థ్యం, విశిష్ట సామర్థ్యాలతో అత్యుత్తమ వ్యక్తులుగా ఎదగడానికి ఇలాంటి పరిశోధనా పార్కులు, కళాశాలలు, హాస్టళ్లు ఎంతో అవసరమన్నారు. వాటిని సృష్టించేందుకు తమ ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వీఐటీ దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని అభినందించారు. అంత గొప్ప యూనివర్సిటీలో తన తండ్రి కరుణానిధి పేరుతో హాస్టల్‌ బ్లాక్‌ నిర్మించడం గర్వించదగ్గ విషయమన్నారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో వీఐటీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ విశ్వనాధన్‌కు చిరకాల బంధముందని గుర్తు చేసుకున్నారు. 180 మంది విద్యార్థులతో ప్రారంభమైన వీఐటీ నేడు 80 వేల మందికి విద్య అందిస్తుండడం సామాన్యమైన విషయం కాదన్నారు. పిల్లలకు తమిళంలో పేర్లు పెట్టాలనేది కరుణానిధి ఆకాంక్ష అని, దానిని ఆచరించాలని సూచించారు. భారతదేశానికి మార్గనిర్దేశం చేయగలిగేలా తమ పాలన పురోగతిలో వుందని, ఈ విషయం గ్రహించిన అనేక మంది పెట్టుబడులు పెట్టేందుకు, కొత్త కంపెనీలను పెట్టేందుకు రాష్ట్రానికి వస్తున్నారన్నారు. కార్యక్రమంలో వీఐటీ ఛాన్స్‌లర్‌ విశ్వనాధన్‌ మాట్లాడుతూ.. తమ యూనివర్సిటీకి వచ్చిన తొలి ముఖ్యమంత్రి కరుణానిధి కాగా, రెండో ముఖ్యమంత్రి ఆయన తనయుడు స్టాలిన్‌ కావడం విశేషమన్నారు. వీఐటీ అభ్యున్నతిలో కరుణానిధి పాత్ర వుందని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ మంత్రులు కె.పొన్ముడి, దురైమురుగన్‌, ఆర్‌.గాంధీ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీఐటీ ఉపాధ్యక్షుడు శంకర్‌ విశ్వనాధన్‌, శేఖర్‌ విశ్వనాధన్‌, జీవీ సెల్వం, వైస్‌ఛాన్స్‌లర్లు రాంబాబు, ప్రొ వైస్‌ఛాన్స్‌లర్‌ పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T07:21:12+05:30 IST