Chennai: నిఘా నీడలో రాష్ట్రం

ABN , First Publish Date - 2023-01-25T08:36:02+05:30 IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా భద్రత పెంచారు. జనసంచారం అధికంగా వుండే ప్రాంతాలు,

Chennai: నిఘా నీడలో రాష్ట్రం

- విమానాశ్రయాలకు ఏడంచెల భద్రత

- రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో పహారా

- ఆలయాలు, మసీదులు, చర్చీల వద్ద మోహరించిన సాయుధ బలగాలు

- లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు

చెన్నై, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా భద్రత పెంచారు. జనసంచారం అధికంగా వుండే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల(Airports, railway stations, bus stands) వద్ద భద్రత పటిష్ఠం చేశారు. అంతేగాక ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తూ పోలీసులు పరిస్థితి సమీక్షిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసాంఘిక శక్తులు పెచ్చురిల్లే అవకాశముందన్న కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నైతో పాటు రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో ఏడంచెల భద్రత పెంచారు. లగేజీ తనిఖీ చేసిన తరువాతే ప్రయాణీకులను లోనికి అనుమతిస్తున్నారు. అదే విధంగా విమానాశ్రయాల్లోకి సందర్శకుల ను నిషేధించారు. ఇక రైల్వేస్టేషన్లలోనూ ప్రయాణీకులను క్షుణ్ణంగా పరిశీలించి అమనుమానం ఉంటే లగేజీ తనిఖీ చేస్తున్నారు. బస్టాండ్లు కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఇక జనసంచారం అధికంగా వుండే ప్రాంతాలు, సమస్యాత్మాక ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పోలీసులు డేగకన్నుతో పరిశీలిస్తున్నారు. ఎక్కడికక్కడ లాడ్జీలు, హోటళ్లను తనిఖీ చేస్తున్న పోలీసులు.. కస్టమర్ల వివరాలు తెలుసుకుంటూ ఆరా తీస్తున్నారు. కాగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తక్షణం పోలీసులకు సమాచారమివ్వాలని డీజీసీ శైలేంద్రబాబు ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇటీవల కారు పేలుడు సంభవించిన కోయంబత్తూరుతో పాటు తిరునల్వేలి, మదురై, రామనాధపురం తదితర జిల్లాల్లోనూ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వున్న డ్యామ్‌ల వద్ద కూడా పహారా పెంచారు. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకూ సాయుధ బలగాలతో భద్రత పెంచారు.

మెరీనాలో ఐదంచెల భద్రత

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం జరిగే మెరీనాతీరం(Marina Beach)లో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. అదే విధంగా ఆ ప్రాంతమంతా డ్రోన్ల ద్వారా పర్యవేక్షించడంతో పాటు ఇతర డ్రోన్లు ఎగరడంపై నిషేధం విధించినట్లు చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ ప్రకటించారు. కార్మికుల చిహ్నం వద్ద గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి జాతీయ పతాకం ఎగురవేయనున్నందున ఆ ప్రాంతమంతా ఇప్పటికే పోలీసుల అదుపులోకి వెళ్లిపోయింది. అదనపు కమిషనర్లు అన్బు, ప్రేమ్‌ ఆనంద్‌ సిన్హా, కపిల్‌కుమార్‌ నేతృత్వంలో సహాయ కమిషనర్లు, ఇన్స్‌పెక్టర్లు, పోలీసులు మొత్తం 6,800 మందితో ఈ ప్రాంతంలో భద్రత ఏర్పాటైంది. అదే విధంగా మాధవరం, తిరువొత్తియూర్‌, మధురవాయల్‌, మీనంబాక్కం, దురైపాక్కం, నీలాంగరై తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌ ఏర్పాటుచేసిన పోలీసులు.. అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Updated Date - 2023-01-25T08:36:05+05:30 IST