CDs, audios: ఎన్నికల వేళ సీడీలు, ఆడియోల గోల

ABN , First Publish Date - 2023-02-02T11:25:41+05:30 IST

ఎన్నికల వేళ రాష్ట్రంలో ఆడియోలు, సీడీల గోల తీవ్రమవుతోంది. రాసలీల సీడీ విడుదలతో రమేష్‌ జార్కిహొళి మంత్రి పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే

CDs, audios: ఎన్నికల వేళ సీడీలు, ఆడియోల గోల

- డీకే శివకుమార్‌పై రమేష్‌ జార్కిహొళి ఆరోపణలు

- కాంగ్రెస్‌ వర్గాల ఆగ్రహం

బెంగళూరు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వేళ రాష్ట్రంలో ఆడియోలు, సీడీల గోల తీవ్రమవుతోంది. రాసలీల సీడీ విడుదలతో రమేష్‌ జార్కిహొళి మంత్రి పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(DK Shivakumar)పై ఉన్న కోపంతో రమేష్‌ జార్కిహొళి(Ramesh Jarkiholi) పలుమార్లు సవాల్‌ విసిరారు. తాజాగా సోమవారం డీకే శివకుమార్‌కు చెందిన ఓ ఆడియోను విడుదల చేశారు. అది కాంగ్రెస్‌ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. బెంగళూరు సదాశివనగర్‌లోని రమేష్‌ జార్కిహొళి నివాసంలోకి కాంగ్రెస్‌ కార్యకర్తలు దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని వారిని అక్కడి నుంచి తరిమివేశారు. కాగా ఇండిపెండెంట్‌ ఎమ్మెల్సీ లఖన్‌ జార్కిహొళి తీవ్రమైన ఆరోపణలు చేశారు. బెళగావి కేంద్రంగా కొన్నేళ్లుగా సీడీల తయారీ సాగుతోందని, ఇక్కడి నుంచే కనకపుర కేంద్రానికి, ఆ తర్వాత బెంగళూరుకు వెళుతున్నాయన్నారు. సీడీల తయారీ వెనుక కుట్రను వెలికి తీయాలంటే సీబీఐ లాంటి సంస్థ ద్వారా దర్యాప్తు జరిపించాలన్నారు. తాజాగా కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌) చైర్మన్‌, ఎమ్మెల్యే బాలచంద్ర జార్కిహొళి మరో విధంగా మాట్లాడారు. మంగళవారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ సీడీలు, ఆడియోల సవాళ్లతో రమేష్‌ జార్కిహోళికే కాదని డీకే శివకుమార్‌తో పాటు ఎమ్మెల్యే లక్ష్మీహెబ్బాళ్కర్‌కు రాజకీయంగా ఇబ్బందికరమే అన్నారు. ముగ్గురు పేరున్న వారని, కుటుంబాలకు చరిత్ర ఉందని ఒకరిపై మరొకరు కక్ష తీర్చుకునేందుకు మరింత ముందుకెళితే ప్రమాదకరమే అన్నారు. ఎన్నికలలో పార్టీలు, సిద్ధాంతాల పరంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఇటువంటి విధానాలు సరికాదన్నారు. కొన్ని విషయాలు సీఎం, హోంశాఖ మంత్రితో కలిసి చర్చిస్తామని, అనవసరంగా ముందుకెళ్లడం మంచిది కాదన్నారు.

ఇది కూడా చదవండి: Movie actor Srikanth: పాఠశాలను పరిశీలించిన సినీ నటుడు శ్రీకాంత్‌

Updated Date - 2023-02-02T11:25:43+05:30 IST