Bihar: సమాధాన్ యాత్రలో నిలదీసిన రైతులు, తక్షణం స్పందించిన సీఎం

ABN , First Publish Date - 2023-01-25T19:06:58+05:30 IST

బిహార్ రాష్ట్రంలో తనకున్న పట్టును మరింత పదిలం చేసుకునేందుకు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, వివిధ జిల్లాలు-గ్రామాల్లో ముఖ్యమంత్రి..

Bihar: సమాధాన్ యాత్రలో నిలదీసిన రైతులు, తక్షణం స్పందించిన సీఎం

పాట్నా: బిహార్ రాష్ట్రంలో తనకున్న పట్టును మరింత పదిలం చేసుకునేందుకు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, వివిధ జిల్లాలు-గ్రామాల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేపట్టిన 'సమాధాన్ యాత్ర'కు భోజ్‌పూర్ జిల్లాలో బుధవారంనాడు ఒకింత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. తమ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యలు లేవని, ఇతర అభివృద్ధి పనులు జరగడం లేదని రైతులు సీఎంను నిలదీశారు. తమను కాపాడాలని, లేదంటే తమకు ఆకలి చావులు తప్పవంటూ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ సమయంలో నితీష్ వెంట ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా బయటకు వచ్చింది.

''మేము ఆకలితో అలమటిస్తున్నాం. చావులు అనివార్యం కావచ్చు. మమ్మల్ని కాపాడండి. మీరు ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి కూడా కావచ్చు, మమ్మల్ని కాపాడండి. మీరే స్వయంగా చూడండి. ఈ ప్రాంతంలో అబివృద్ధి పనులేమీ జరగడం లేదు'' అని రైతులు తమ గోడు చెప్పుకున్నారు. ఈ సమయంలో సీఎం వెంట ఉన్న అధికారులు రైతులను అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో సీఎం వారిని నివారించారు. స్వయంగా ముఖ్యమంత్రే పరిస్థితిని సమీక్షించాలని రైతులు తిరిగి కోరడంతో ఆయన వెంటనే స్పందించారు. రైతు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం)ను ఆదేశించారు.

నిలదీసిన బీజేపీ..తిప్పికొట్టిన జేడీయూ

కాగా, ఈ ఘటనపై బీజేపీ, ఇతర విపక్ష పార్టీలు తక్షణం స్పందించాయి. రాష్ట్రాన్ని 18 ఏళ్లుగా పాలిస్తున్నప్పటికీ ప్రజానీకానికి కనీస సౌకర్యాలు కల్పించడంలో నితీష్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించాయి. ఈ ఆరోపణలను జేడీయూ వెంటనే తిప్పికొట్టింది. నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఉన్న ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా ఈ ఘటన సృష్టించారని ఆ పార్టీ ఆరోపించింది.

Updated Date - 2023-01-25T19:07:06+05:30 IST