Adani Group : అదానీ గ్రూప్‌ పెద్ద అక్రమాల పుట్ట!

ABN , First Publish Date - 2023-01-26T02:29:20+05:30 IST

అదానీ గ్రూప్‌ ఆర్థిక పరిస్థితిపై మరోసారి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పులకుప్పలా మారిన గ్రూప్‌ కంపెనీల ఆర్థిక సత్తాపై హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది.

Adani Group : అదానీ గ్రూప్‌ పెద్ద అక్రమాల పుట్ట!

లెక్కల ఖాతాలకు నగిషీలు.. ఎడాపెడా అప్పుల సేకరణ

నిస్సిగ్గుగా స్టాక్‌ మార్కెట్‌ దందా.. డొల్ల సంస్థలతో మాయ

గ్రూప్‌ కంపెనీల షేర్లు 85ు మేర కుప్పకూలిపోయే ముప్పు

ఆ షేర్లలో పెట్టుబడులు పెట్టొద్దు.. హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ నివేదిక

పెట్టుబడిదారుల్లో ఆందోళన.. భయంతో షేర్ల అమ్మకాలు

గ్రూపు కంపెనీల మార్కెట్‌ విలువ 55వేల కోట్లు ఆవిరి

మా కంపెనీల షేర్ల పెరుగుదల, అప్పుల్లో మతలబు లేదు

కుట్ర, దురుద్దేశాలతోనే ఈ నివేదిక: అదానీ గ్రూప్‌ ఆగ్రహం

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ

తాజా ఎఫ్‌పీవోలో 5,985 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు

అపర కుబేరుడు గౌతమ్‌ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్‌ కంపెనీలు అప్పుల కుప్పల్లా మారాయంటూ అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ రిసెర్చ్‌ సంస్థ ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ ఓ సంచలన నివేదిక విడుదల చేసింది! ప్రమోటర్ల మార్కెట్‌ మాయాజాలంతో చుక్కలంటిన ఈ గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలు కుప్పకూలే ప్రమాదం ఉందని.. వాటిలో పెట్టుబడులు ఎంతమాత్రం మంచిది కాదని స్పష్టం చేసింది. దీంతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లన్నీ బుధవారం ‘బేర్‌’మన్నాయి. గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.55,000 కోట్లు హరించుకుపోయింది.

న్యూఢిల్లీ, జనవరి 25: అదానీ గ్రూప్‌ ఆర్థిక పరిస్థితిపై మరోసారి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పులకుప్పలా మారిన గ్రూప్‌ కంపెనీల ఆర్థిక సత్తాపై హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. పద్దు పుస్తకాలకు నగిషీలు చెక్కడం, స్టాక్‌ మార్కెట్‌ మాయాజాలం ద్వారా ఈ గ్రూప్‌ ఎడాపెడా అప్పులు చేస్తూ నెట్టుకొస్తోందని పేర్కొంటూ హిండెన్‌బర్గ్‌ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. అందులో అదానీ గ్రూపు కంపెనీలపై పలు సంచలన ఆరోపణలు చేసింది. తన ఏడు లిస్టెడ్‌ కంపెనీల షేర్ల ధరలు పెంచుకునేందుకు అదానీ గ్రూప్‌ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడిందని.. షేర్ల ధరలు అనూహ్యంగా పెంచి, ఆ ధరల వద్ద షేర్లను తాకట్టు పెట్టి, ప్రమోటర్లు మరిన్ని అప్పులు చేస్తున్నట్టు పేర్కొంది. దీంతో అదానీ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్‌ కంపెనీల షేర్ల ధర 85 శాతం పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గత మూడేళ్లలోనే అదానీ గ్రూప్‌ కంపెనీలకు మహర్దశ పట్టడాన్ని హిండెన్‌బర్గ్‌ తన నివేదికలో గుర్తుచేసింది. ఈ కాలంలో అదానీ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్‌ కంపెనీల షేర్ల మార్కెట్‌ ధర సగటున 819 శాతం పెరగడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ సూపర్‌ డూపర్‌ ర్యాలీ వెనుక ప్రమోటర్ల హస్తం ఉందని ఆరోపించింది. ఇలా అక్రమంగా షేర్ల ధరలు పెంచి, ఆ అధిక ధరల వద్ద ఇంటాబయటా అదానీ గ్రూప్‌ అడ్డగోలుగా అప్పులు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుత అదానీ గ్రూప్‌ నెట్‌వర్త్‌ 12,000 కోట్ల డాలర్లలో 10,000 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌ గత మూడేళ్లలోనే సమకూరడంపైనా హిండెన్‌బర్గ్‌ అనుమానాలు వెలిబుచ్చింది. గత ఏడాది (2022) మార్చి నాటికి అదానీ గ్రూప్‌ కంపెనీల అప్పు రూ.2.2 లక్షల కోట్లు. అందులో 40 శాతం.. ఒక్క ఏడాది కాలంలోనే పెరిగిన విషయాన్నీ గుర్తు చేసింది. అదానీ గ్రూప్‌ కంపెనీల గుట్టురట్టు చేసేందుకు ఈ సంస్థ రెండేళ్ల పాటు శ్రమించింది. ఇందుకోసం ఆరడజనుకుపైగా దేశాలను సందర్శించి, వేలాది డాక్యుమెంట్లను పరిశీలించింది. అదానీ గ్రూప్‌ కంపెనీల మాజీ ఉన్నతోద్యోగులతోనూ మాట్లాడి నివేదిక రూపొందించింది. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలుగా ప్రసిద్ధి చెందిన కరీబియన్‌ దీవులు, సైప్రస్‌, మారిషస్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వంటి దేశాల్లో అదానీ గ్రూప్‌ ప్రమోటర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఉన్న అనేక డొల్ల (షెల్‌) కంపెనీలు జాడ కూడా తమ దర్యాప్తులో బయటపడినట్టు తెలిపింది. ప్రమోటర్ల అవినీతి, అక్రమ నగదు లావాదేవీలు, గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల లాభాలను దారి మళ్లించేందుకు ఈ డొల్ల కంపెనీలను ఉపయోగిస్తున్నట్టు హిండెన్‌బర్గ్‌ తేల్చింది. ఈ దందా ఈ నాటిది కాదని.. కొన్ని దశాబ్దాలుగా ఇది కొనసాగుతోందని పేర్కొంది.

నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు

గ్రూపునకు చెందిన ఏడు లిస్టెడ్‌ కంపెనీల్లో ఐదు కంపెనీల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే

అదానీ గ్రూప్‌ కంపెనీల 22 మంది డైరెక్టర్లలో 8 మంది అదానీ కుటుంబ సభ్యులు

కీలక నిర్ణయాలన్నీ కుటుంబ సభ్యుల చేతుల్లోనే

అక్రమంగా 1,700 కోట్ల డాలర్లు కాజేశారనే ఆరోపణలపై కుటుంబసభ్యులపై గతంలో నాలుగుసార్లు దర్యాప్తు

ఫోర్జరీ, మోసాల ఆరోపణలపై రెండుసార్లు అరెస్టయిన గౌతమ్‌ అదానీ సోదరుడు రాజేశ్‌ అదానీ

వజ్రాల ఎగుమతి, దిగుమతుల అక్రమాల్లో గౌతమ్‌ అదానీ బావ సమీర్‌ వోరా పాత్రపైనా గతంలో దర్యాప్తు

గౌతమ్‌ అదానీ అన్న వినోద్‌ అదానీ విదేశాల్లో 38 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు

విదేశాల్లోని సొంత డొల్ల కంపెనీల ద్వారా గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల షేర్లలో 90 శాతానికిపైగా పెట్టుబడులు

గుజరాత్‌కు చెందిన స్టాక్‌ బ్రోకర్‌ కేతన్‌ పరేఖ్‌తోనూ పరోక్ష సంబంధాలు

కంపెనీల ఆడిటర్లుగా పెద్దగా ఊరూ పేరూ లేని వ్యక్తులు

లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ ఇన్వెస్టర్ల పేరు వెల్లడించని అదానీ గ్రూప్‌ కుప్పకూలిన గ్రూప్‌ కంపెనీల షేర్లు

హిండెన్‌బర్గ్‌ నివేదికతో బుధవారం అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు ‘బేర్‌’మన్నాయి. ఎక్కడ పుట్టి మునుగుతుందోనన్న భయంతో ఇన్వెస్టర్లు పొలోమంటూ అమ్మకాలకు దిగారు. దీంతో అదానీ గ్రూప్‌ ఏడు లిస్టెడ్‌ కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) బుధవారం ఒక్కరోజే రూ.55,000 కోట్లు హరించుకుపోయింది.

Updated Date - 2023-01-26T09:55:57+05:30 IST