China Spy balloon: చైనా బెలూన్‌ను కూల్చేసిన అమెరికా, పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న డ్రాగెన్

ABN , First Publish Date - 2023-02-05T13:49:24+05:30 IST

అమెరికా, చైనా మధ్య ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తమ గగనతలంలో ఎగురుతున్న చైనా నిఘా బెలూన్ ను..

China Spy balloon: చైనా బెలూన్‌ను కూల్చేసిన అమెరికా, పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న డ్రాగెన్

వాషింగ్టన్: అమెరికా, చైనా మధ్య ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తమ గగనతలంలో ఎగురుతున్న చైనా నిఘా బెలూన్ (China Spy balloon)ను

అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ గుర్తించింది. మోంటానా రాష్ట్రంలోని సున్నిత స్థావరాలపై తిరుగుతున్న నిఘా బెలూన్‌ను దక్షిణ కరోలినా తీరానికి దగ్గర్లో కూల్చేసినట్టు ప్రకటించింది. కాగా, పెంటగాన్ చర్యపై చైనా ఘాటుగా స్పందించింది. మానవరహిత బెలూన్‌ను పేల్చివేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్టు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికా అతిగా స్పందించిందని, అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఇది తీవ్ర ఉల్లంఘనేనని ఆరోపించింది. వాతావరణ పరిశోధనల కోసం తాము పౌర గగన నౌకను ప్రయోగించామని, గాలుల ప్రభావంతో అది దారితప్పి ఉండవచ్చని తెలిపింది. ఈ విషయంలో అమెరికా ప్రశాంతంగా, ప్రొఫెషనల్‌గా, సంయనంతో వ్యవహిరించి ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. దానిని కూల్చివేసినందుకు తగిన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది.

రంగంలోకి దిగిన ఫైటర్ జెట్లు

చైనా నిఘా బెలూన్ మోంటెనా రాష్ట్రంలోని సున్నిత స్థావరాలపై శనివారం ఉదయం తిరుగుతున్నట్టు అమెరికా అధికారులు గుర్తించారు. వెంటనే అధ్యక్షుడు జో బైడెన్‌తో అధికారులు సంప్రదింపులు జరిపి, ఆయన సూచనల మేరకు ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సాయంతో కూల్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా అమెరికా ఛానెళ్లలో ప్రసారమవుతున్నాయి. చైనా నిఘా బెలూన్ శకలాలు అట్లాంటిక్ సముద్రంలో పడినందున వాటిని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

శనివారం సాయంత్రం ఇదే విషయమై అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ మీడియాతో మాట్లాడుతూ, చైనా నిఘా బెలూన్ అమెరికా గగనతలంలోకి వచ్చిన విషయాన్ని గుర్తించామని, తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చైనా బెలూన్ సముద్ర తీరానికి చేరుకోవడంతో అమెరికా మిలటరీ విమానం నుంచి అధికారులు ముందుగా పరిశీలించారు. అనంతరం ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, కోస్ట్ గార్డులు రంగంలోకి దిగారు. ఎయిర్‌స్పేస్, బెలూన్ కింద ఉన్న జలాలను క్లియర్ చేశారు. ఎఫ్-22 యుద్ధ విమానాల సాయంతో ఆ బెలూన్‌ను సముద్రతలాల వైపునకు తీసుకు వచ్చి పేల్చేసినట్టు పెంటగాన్ ప్రకటించింది. కూల్చివేత ఆపరేషన్‌కు ముందు, కరోలినా తీరప్రాంతం మీదుగా ఎయిర్‌స్పేన్‌ను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) మూసివేసింది. చార్లెస్‌టన్, సౌత్ కరోలినా, విల్మింగ్‌టన్, నార్త్ కరోలినా విమానాశ్రయాలను మూసేసింది. ఎయిర్ ట్రాఫిక్‌ను వేరే రూట్లకు మళ్లించింది. దీంతో విమనాల రాకపోకల్లో జాప్యం తలెత్తింది.

Updated Date - 2023-02-05T15:25:15+05:30 IST