ఈ సెంట్‌ కొట్టాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే!

ABN , First Publish Date - 2023-01-29T11:49:44+05:30 IST

సెంట్‌ బాటిల్‌ చూడటానికి చిన్నగా కనిపించొచ్చు... కానీ దాని గుభాళింపు చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారమే. సాధారణంగా ఒక పర్‌ఫ్యూమ్‌ బాటిల్‌ ధర ఎంతుంటుంది? అంటే...

ఈ సెంట్‌ కొట్టాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే!

సెంట్‌ బాటిల్‌ చూడటానికి చిన్నగా కనిపించొచ్చు... కానీ దాని గుభాళింపు చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారమే. సాధారణంగా ఒక పర్‌ఫ్యూమ్‌ బాటిల్‌ ధర ఎంతుంటుంది? అంటే... మహా అయితే వెయ్యి రూపాయలు ఉంటుందంటారు. కానీ కొన్ని పర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌ కొనాలంటే లక్షలు, కోట్లు కుమ్మరించాల్సిందే. వజ్రవైడూర్యాలు పొదిగిన ఆ అత్తరు బాటిళ్లను చూస్తేనే మత్తెక్కడం, మతిపోవడం ఖాయం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పర్‌ఫ్యూమ్‌లుగా గుర్తింపు పొందిన అలాంటి కొన్ని సెంట్‌ బాటిళ్ల విశేషాలివి...

130 ఏళ్ల ప్రత్యేకం...

ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్‌ బల్గారీ 130వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ‘ఒపెరా ప్రైమా’ పర్‌ఫ్యూమ్‌ను విడుదల చేసింది. దీని ధర సుమారు రూ.1.8 కోట్లు. ఈ పర్‌ఫ్యూమ్‌ బాటిల్‌ డిజైన్‌లో 250 క్యారెట్ల సిట్రిన్‌, 4.5 క్యారెట్ల అమెథిస్ట్‌, 25 క్యారెట్ల డైమండ్‌ను ఉపయోగించారు. నిమ్మ, నారింజపువ్వు, కస్తూరి వంటి సువాసనలతో కూడిన మెడిటరేనియన్‌ టోన్‌ను కలిగి ఉంటుంది.

గిన్నిస్‌ రికార్డులు...

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పర్‌ఫ్యూమ్‌ ఏదంటే... షుముఖ్‌. దీని ధర సుమారు రూ. 9.3 కోట్లు. 2019లో దుబాయి మాల్‌లో నబీల్‌ పర్‌ఫ్యూమ్స్‌ అనే సంస్థ దీన్ని విడుదల చేసింది. చందనం, ఇండియన్‌ అగర్‌వుడ్‌, ఇండియన్‌ రోజ్‌, అంబర్‌, టర్కిష్‌ రోజ్‌ ఆయిల్‌ వంటి సుగంధద్రవ్యాలతో ఈ అత్తరును తయారుచేశారు. అయితే బయటకు వెల్లడించని మరికొన్ని పదార్థాలు కూడా ఇందులో కలుపుతారు. ఈ పర్‌ఫ్యూమ్‌ ఖరీదుకు కారణం దాని ప్యాకింగ్‌. 3500 డైమండ్లు, ముత్యాలు, రెండున్నర కిలోల 18 క్యారెట్ల బంగారం, 5.9 కిలోల స్వచ్ఛమైన వెండితో రూపొందించిన ఖరీదైన ప్యాకింగ్‌తో దీన్ని అందిస్తారు. మూడు లీటర్ల పర్‌ఫ్యూమ్‌ను తయారుచేయడానికి మూడేళ్లకు పైగా శ్రమించారు. సరైన సువాసన కోసం 490 సార్లు ప్రయత్నించి చివరికి సఫలమయ్యారు. ఈ పర్‌ఫ్యూమ్‌ రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను నమోదు చేసింది. ఎక్కువ డైమండ్లు కలిగి ఉన్న పర్‌ఫ్యూమ్‌ బాటిల్‌గా ఒక రికార్డు నెలకొల్పితే, రిమోట్‌తో పనిచేసే స్ర్పే బాటిల్‌గా మరో రికార్డును నమోదు చేసింది.

సెంట్‌ సీసా రాజసం...

ప్రపంచంలోనే రెండో ఖరీదైన పర్‌ఫ్యూమ్‌ ‘డికేఎన్‌వై గోల్డెన్‌ డెలిసియస్‌’. ప్రముఖ డిజైనర్‌ డికేఎన్‌వై, మరో ప్రముఖ జ్యువెలరీ డిజైనర్‌ మార్టిన్‌ కట్జ్‌తో కలిసి ఈ ఖరీదైన పర్‌ఫ్యూమ్‌ను తయారుచేశారు. ఆపిల్‌ ఆకారంలో ఉండే పర్‌ఫ్యూమ్‌ సీసాను ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన అత్యంత విలువైన 2909 స్టోన్స్‌తో డిజైన్‌ చేశారు. అందులో 183 కనగపుష్యరాగం, 2700 వైట్‌ డైమండ్స్‌, శ్రీలంక నుంచి సేకరించిన 7.18 క్యారెట్ల ఓవల్‌ కాబోకాన్‌ సఫైర్‌, ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన 15 గులాబీ రంగు వజ్రాలు, 3.07 క్యారెట్ల ఓవల్‌ రూబీ, 4.03 క్యారెట్ల పియర్‌ షేప్డ్‌ రోజ్‌ కట్‌ డైమండ్‌తో డిజైన్‌ చేశారు. 2.43 క్యారెట్ల యెల్లో డైమండ్‌తో చేసిన సీసా క్యాప్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇంతటి విలువైన రాళ్లతో ఒక సీసాను డిజైన్‌ చేయడానికి కనీసం 1500 గంటల సమయం పడుతుందట. ఇక దీని ధర సుమారు రూ.7.7 కోట్లుగా ఉంది.

లగ్జరీ బ్రాండ్‌

ఫ్రెంచ్‌ పర్‌ఫ్యూమర్‌ ఎర్నెస్ట్‌ డాలా్ట్రఫ్‌ 1904లో ‘కారన్స్‌ పోవెర్‌’ అనే పర్‌ఫ్యూమ్‌ తయారీ సంస్థను స్థాపించారు. ఫ్రాన్స్‌లో ఇది ఒక లగ్జరీ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ఈ పర్‌ఫ్యూమ్‌ బాకార్ట్‌ క్రిస్టల్‌ బాటిల్‌లో బంగారు మూతతో ఆకట్టుకునేలా ఉంటుంది. 1954లో మొదటిసారి ప్రత్యేకంగా మహిళల కోసం ఈ స్పైసీ సువాసనతో కూడిన పర్‌ఫ్యూమ్‌ను తయారుచేశారు. అయితే మహిళలతోపాటు పురుషులను సైతం ఈ పర్‌ఫ్యూమ్‌ బాగా ఆకర్షించింది. లవంగాలు, మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు, జేరేనియం, గులాబీ, మల్లె, ఓక్‌మాస్‌, ఒప్పోనాక్స్‌, గంధం వంటి మిశ్రమాల కలయికతో ఈ పర్‌ఫ్యూమ్‌ను తయారుచేస్తున్నారు. 90 ఎంఎల్‌ బాటిల్‌ ధర రూ. 2 లక్షలుగా ఉంది.

మైఖెల్‌ జాక్సన్‌ మెచ్చాడు!

‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’గా పేరొందిన మైఖెల్‌ జాక్సన్‌ ఇష్టపడిన పర్‌ఫ్యూమ్‌ ‘జియానీ వీవ్‌ సుల్మాన్‌’. 1998లో మార్కెట్లోకి ఇది విడుదలైనప్పుడు కొన్ని బాటిల్స్‌ను ఆయన కొనుగోలు చేశారు. మల్లెపూలు, ప్రత్యేక గులాబీలను సేకరించి ఈ పర్‌ఫ్యూమ్‌ను తయారుచేశారు. బంగారంతో తయారుచేసిన సీసా, డైమండ్‌ స్టాపర్‌, పచ్చలు, కెంపులు, బంగారు తాళంచెవితో డిజైన్‌ చేసిన ఈ పర్‌ఫ్యూమ్‌ ధర సుమారు రూ. 68 లక్షలు.

అరుదైన సువాసన

లిమిటెడ్‌ ఎడిషన్‌లో విడుదల చేసిన ‘చానెల్‌ గ్రాండ్‌ ఎక్స్‌ట్రేట్‌’ పెర్‌ఫ్యూమ్‌ ధర సుమారు రూ. 2.7 లక్షలుగా ఉంది. బాటిల్‌ ప్రత్యేకమైన లుక్‌తో మాస్టర్‌పీస్‌లా ఉంటుంది. బాటిల్‌ డిజైన్‌ శిల్పకళను గుర్తుకుతెస్తుంది. ఈ పర్‌ఫ్యూమ్‌ వెదజల్లే సువాసన అత్యంత అరుదైనదిగా గుర్తింపు ఉంది. 1921లో కోకో చానల్‌, పర్‌ఫ్యూమర్‌ ఎర్నెస్ట్‌ కలిసి సంయుక్తంగా హై-ఎండ్‌ పర్‌ఫ్యూమ్స్‌ తయారీని ప్రారంభించారు.

‘జార్‌’... హుషార్‌

హ్యాండ్‌ కట్‌ గ్లాస్‌ బాటిల్స్‌తో ‘జార్‌ - బోల్ట్‌ ఆఫ్‌ లైటెనింగ్‌’ పర్‌ఫ్యూమ్‌ లభిస్తుంది. 2001లో జార్‌ పర్‌ఫ్యూమ్స్‌ తయారీ సంస్థ ‘బోల్ట్‌ ఆఫ్‌ లైటెనింగ్‌’ పేరుతో ప్రత్యేకమైన సువాసన కలిగిన అత్తరును విడుదల చేసింది. ట్యూబెరోస్‌, ఓరియంటల్‌ పూల మిశ్రమంతో తయారుచేసిన ఈ పర్‌ఫ్యూమ్‌ సువాసన మనసును ఉత్తేజపరుస్తుంది. ఒక ఔన్సు ధర సుమారు రూ. 59 వేలుగా ఉంది. ప్యారిస్‌కు చెందిన జ్యువెలర్‌ జోసెఫ్‌ ఆర్థర్‌ రొసెంతల్‌ ఈ సంస్థను స్థాపించారు. ఆయన పేరును షార్ట్‌కట్‌గా చేసి ‘జార్‌’ అనే పేరుతో పర్‌ఫ్యూమ్స్‌ తయారీ సంస్థను ప్రారంభించారు.

సెంట్‌ ‘మహారాణి’

‘క్లైవ్‌ క్రిస్ట్రియన్‌ పర్‌ఫ్యూమ్‌’ సంస్థ ప్రపంచంలో ఫైనెస్ట్‌ పర్‌ఫ్యూమ్‌లు తయారుచేయాలనే లక్ష్యంతో 1872లో ప్రారంభమైంది. విక్టోరియా రాణి కిరీటం బొమ్మను తన పర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌పై ప్రచురించుకోవడానికి అనుమతి పొందిన ఏకైక సంస్థ ఇది. 5 క్యారెట్ల వైట్‌ డైమండ్‌, 18 క్యారెట్‌ గోల్డ్‌ కాలర్‌తో లిమిటెడ్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధర సుమారు రూ.1.6 కోట్లు. 2005లో 10 బాకరాట్‌ క్రిస్టల్‌ బాటిల్స్‌ను విడుదల చేస్తే అందులో ఏడింటిని ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేశారు. మిగతా మూడు బాటిల్స్‌ని సంస్థ అన్ని దేశాలకు స్పెషల్‌ కలెక్షన్‌గా టూర్‌కి పంపించింది. రోజ్‌ ఆయిల్‌, జాస్మిన్‌, తాహితియన్‌ వెనిలాల కలయికతో ఈ పర్‌ఫ్యూమ్‌ను ప్రముఖ బ్రిటిష్‌ పర్‌ఫ్యూమర్‌ రొసాడొవ్‌ డిజైన్‌ చేశారు.

సెంట్‌ సీసాకు బంగారు తాళం చెవి...

‘పాకో రాబన్నే వన్‌ మిలియన్‌ లక్స్‌ ఎడిషన్‌’ కమర్షియల్‌ పర్‌ఫ్యూమ్‌. 18 క్యారెట్ల బంగారం, 0.3 క్యారెట్ల డైమండ్‌తో తయారుచేసిన సంప్రదాయ బాటిల్‌ వినియోగదారులను ఆకట్టుకుంది. ఈ బాటిల్‌ను నాణ్యమైన లెదర్‌ బ్యాగుతో అందిస్తారు. దానికి ఒక బంగారు కీ కూడా ఉంటుంది. నారింజ, గ్రేప్‌, పుదీనా, గులాబీ, దాల్చిన చెక్క, వైట్‌ వుడ్‌, అంబర్‌, పచౌలి వంటి మిశ్రమాలతో తయారుచేసిన పర్‌ఫ్యూమ్‌ ఇది. దీని ధర సుమారు రూ. 44 లక్షలు.

సెంట్‌ ఆఫ్‌ ది సెంచరీ

ప్రముఖ ఫ్రెంచ్‌ డిజైనర్‌ జాన్‌ పాటూ డిజైన్‌ చేసిన క్లాసిక్‌, ఎక్స్‌క్లూజివ్‌ పర్‌ఫ్యూమ్‌లలో జాయ్‌ ఒకటి. 2000 సంవత్సరంలో ఫ్రాగరెన్స్‌ ఫౌండేషన్‌ ఫీఫీ అవార్డు కార్యక్రమంలో జాయ్‌ పర్‌ఫ్యూమ్‌ను ‘సెంట్‌ ఆఫ్‌ ద సెంచరీ’గా ఎన్నుకున్నారు. రకరకాల గులాబీలతో పాటు పదివేల మల్లెపూలను పర్‌ఫ్యూమ్‌ తయారీలో ఉపయోగించారు. ఈ పర్‌ఫ్యూమ్‌ ఒక ఔన్స్‌ ధర రూ. 65వేలుగా ఉంది.

Updated Date - 2023-01-29T11:49:45+05:30 IST