Winter care: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ABN , First Publish Date - 2023-01-10T12:51:15+05:30 IST

చలికాలం (Winter) జలుబు, దగ్గు సహజం! అయుతే అవి సాధారణ రుగ్మతలేనా? లేక సాధారణ మందులకు లొంగని తీవ్ర సమస్యలా? ఈ కాలంలో దాడి చేసే జలుబు, దగ్గులు

Winter care: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
చలి పులి దాడి

చలికాలం (Winter) జలుబు, దగ్గు సహజం! అయుతే అవి సాధారణ రుగ్మతలేనా? లేక సాధారణ మందులకు లొంగని తీవ్ర సమస్యలా? ఈ కాలంలో దాడి చేసే జలుబు, దగ్గులు అన్నీ ఒకటి కావు. వాటి తత్వాల్లో, ప్రభావాల్లో తేడాలుంటాయి. కొన్నిటికి దీర్ఘకాల చికిత్స అవసరం కావచ్చు.

కామన్‌ కోల్డ్‌:

ఇది సాధారణంగా వేధించే నాసల్‌ ఇన్‌ఫెక్షన్‌ (Infection)! ముక్కు దిబ్బడ, నీరు కారడం, ముక్కులో దురద, పొడి దగ్గు ఈ సమస్య లక్షణాలు! ఈ సమస్యలు రెండు నుంచి మూడు రోజుల్లో అదుపులోకొస్తాయి. ఇది ‘రెస్పిరేటరీ సెన్షీసియల్‌ వైరస్‌’ మూలంగా వస్తుంది.

ఫ్లూ:

ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ మూలంగా ఫ్లూ సోకుతుంది. హెచ్‌1ఎన్‌1 స్వైన్‌ ఫ్లూ కూడా ఇన్‌ఫ్లుయెంజా కోవకు చెందినదే! ఈ రుగ్మత లక్షణాలు కూడా కామన్‌ కోల్డ్‌నే పోలి ఉంటాయి. ముక్కు దిబ్బడ, జ్వరం, గొంతు నొప్పి ప్రధానంగా కనిపిస్తాయి. మందులు తీసుకుంటే తగ్గినట్టే తగ్గి పెరుగుతాయి. ఇలాంటప్పుడు స్వైన్‌ ఫ్లూ పరీక్ష చేయించుకుని నిర్థారించుకోవాలి. ఈ రుగ్మతను ప్రారంభంలోనే గుర్తించకుండా నిర్లక్ష్యం చేసి, ఆలస్యంగా వైద్యులను సంప్రతించడం వల్ల వ్యాధి మరింత ముదిరి, ఇతర శరీరావయవాలకు పాకి, తీవ్ర పరిణాలకు దారి తీస్తూ ఉంటుంది.

గొంతు ఇన్‌ఫెక్షన్‌:

దీన్ని వైద్య పరిభాషలో ‘క్రోప్‌’ అంటారు. ఇది ‘స్ట్రెప్టోకోకస్‌ న్యుమోనియా’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. గొంతు నొప్పి, దగ్గు, దగ్గుతోపాటు కఫం ప్రధాన లక్షణాలు. ఈ సమస్యలన్నీ మందులతో నయమవుతాయి. అయితే వారానికి మించి తగ్గకపోయినా, రాత్రుళ్లు ఒక్కసారిగా దగ్గు తెరలు మొదలై నిద్రాభంగం కలుగుతున్నా, పిల్లల్లో దగ్గినప్పుడు పెద్ద శబ్దం (బార్కింగ్‌ కాఫ్‌) వెలువడుతున్నా వైద్యుల్ని సంప్రతించి తగిన యాంటీబయాటిక్స్‌ వాడాలి.

అలర్జిక్‌ బ్రాంఖైటిస్‌:

ఇది అలర్జీ లేదా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల రావచ్చు. మిగతా కాలాల్లో అలర్జీలు కొంత అదుపులోనే ఉంటున్నా, చలికాలంలో తీవ్రమవుతూ ఉంటాయి. వీటిని అదుపు చేసే మందులు వాడకపోతే, ఈ సమస్య క్రానిక్‌ ఆస్తమాగా మారుతుంది. కాబట్టి సమస్యకు అలర్జీ కారణమైతే యాంటీ అలర్జిక్‌ మందులు, నాసల్‌ స్ర్పేలు వాడవలసి ఉంటుంది.

బ్రాంఖియల్‌ ఆస్తమా:

సాధారణంగా ఆస్తమా వంశపారంపర్యంగా వస్తుంది అంటారు. కానీ కేవలం 10% మందికి మాత్రమే ఇలా సంక్రమించే అవకాశం ఉంది. మిగతా 90%, ఆస్తమా (Asthma)కు దారితీసే కారణాలను నిర్లక్ష్యం చేయడం మూలంగానే సోకేవే! కొందరిలో ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి నీరు కారడం, కళ్లు దురదతో మొదలవవచ్చు. మరికొందరిలో గొంతు నొప్పి, గొంతులో అసౌకర్యం, పొడి దగ్గు ఉంటాయి. సమస్య మరీ ముదిరిపోతే, ఛాతిలో అసౌకర్యం, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, పిల్లి కూతలు, అలసట కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల్ని సంప్రతించాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఒకసారి సోకే ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం 10% తరుగుతూ ఉంటుంది. పదే పదే ఇన్‌ఫెక్షన్లు సోకుతూ ఉంటే ఊపిరితిత్తుల సామర్ధ్యం క్రమేపీ తగ్గిపోయి, తిరిగి సరిదిద్దలేని పరిస్థితి వస్తుంది.

  • ముక్కు, నోరు, చెవులకు చల్లగాలి సోకకుండా స్కార్ఫ్‌ కట్టుకోవాలి.

  • విపరీతమైన చల్లదనం ఉండే వేళల్లో బయటకు వెళ్లకూడదు. మరీ ఉదయాన్నే లేదా రాత్రి వేళ ఇంటిపట్టునే ఉండాలి.

  • రెండు రోజుల్లో జలుబు తగ్గకపోయినా, జ్వరం మొదలైనా వైద్యుల్ని కలవాలి.ఆయాసం ఎక్కువైనా, కఫం రంగు మారినా వైద్యులను కలవటం తప్పనిసరి.

  • నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల కఫం తేలికగా కరిగి బయటకొస్తుంది. కాబట్టి నీళ్లు ఎక్కువ తాగాలి.

  • డీప్‌ బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ల వల్ల కూడా కఫం బయటకు వచ్చేస్తుంది.

  • ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు చలి కాలంలో ఏసి గదులకు దూరంగా ఉండాలి. సినిమా హాళ్లు, ఆడిటోరియంలు లాంటి జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవటమే మంచిది.

  • అగర్‌బత్తీలు, ఇతర పొగల వల్ల ఊపిరితిత్తులు అలసటకు లోనవుతాయి. కాబట్టి పొగలకు దూరంగా ఉండాలి.

  • కాలుష్యం కలగలసిన పొగమంచు...‘స్మాగ్‌’ ఊపిరితిత్తులకు చేటు చేస్తుంది. స్మాగ్‌ ఎక్కువగా ఉండే ఉదయం వేళల్లో బయటకు వెళ్లకపోవమే మంచిది.

Updated Date - 2023-01-10T12:51:15+05:30 IST