పిల్లల నిద్ర కోసం...

ABN , First Publish Date - 2023-01-29T11:34:44+05:30 IST

చిన్న పిల్లలను నిద్రపుచ్చడం సులువైన పనేం కాదు. రాత్రంతా నిద్రలేకుండా చేస్తూ తల్లులను ఇబ్బంది పెట్టే పిల్లల కోసం మార్కెట్లో కొన్ని గ్యాడ్జెట్‌లున్నాయి...

పిల్లల నిద్ర కోసం...

చిన్న పిల్లలను నిద్రపుచ్చడం సులువైన పనేం కాదు. రాత్రంతా నిద్రలేకుండా చేస్తూ తల్లులను ఇబ్బంది పెట్టే పిల్లల కోసం మార్కెట్లో కొన్ని గ్యాడ్జెట్‌లున్నాయి. వీటితో పిల్లలు నిద్రలోకి జారుకునేలా చేయవచ్చు. అంతేనా... పిల్లల కదలికలపై నిరంతరం ఓ కన్నేసి ఉంచొచ్చు. అలాంటి కొన్ని మోడ్రన్‌ గ్యాడ్జెట్స్‌ ఇవి...

స్మార్ట్‌ థర్మామీటర్‌

పిల్లలకు అనారోగ్యంగా ఉంటే తల్లులు ప్రశాంతంగా ఉండలేరు. పిల్లలు జ్వరంతో బాధపడుతున్నట్లయితే గుర్తించడానికి డిజిటల్‌ థర్మామీటర్‌కు బదులుగా ‘స్మార్ట్‌ థర్మామీటర్‌’ను ఉపయోగించొచ్చు. ఈ గ్యాడ్జెట్‌కు ఉన్న సిలికాన్‌ ప్యాచ్‌ను పిల్లల చంక భాగంలో పెడితే... టెంపరేచర్‌ రీడింగ్స్‌ను థర్మామీటర్‌కు పంపిస్తుంది. ఈ డేటాను స్మార్ట్‌ఫోన్‌లోనూ చూడొచ్చు. ఒకవేళ పిల్లల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలకన్నా ఎక్కువ ఉన్నట్లయితే అలర్ట్‌ సందేశం పంపిస్తుంది. దానివల్ల వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవచ్చు.

కదలికల స్లీపర్‌

చిన్న పిల్లలను నిద్ర పుచ్చడం తల్లులకు ప్రతిరోజూ సవాలుగానే ఉంటుంది. కొంతమంది పిల్లలు పగలు బాగా నిద్రపోయి, రాత్రుళ్లు నిద్రపోకుండా ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారి కోసం ఈ ‘స్మార్ట్‌ స్లీపర్‌’. దీని కదలికల మూలంగా పిల్లలు అలసిపోయి వెంటనే నిద్రపోతారు. యాప్‌ సహాయంతో స్మార్ట్‌ స్లీపర్‌ను నియంత్రించే వీలుంది. పిల్లలకు అనువుగా ఉండేలా ఎత్తు పెంచడం, తగ్గించడం చేసుకోవచ్చు.

బేబీ మానిటర్‌

చంటి పిల్లలున్న ప్రతి ఇంట్లో ఉండాల్సిన గ్యాడ్జెట్‌ ఇది. పిల్లలు రాత్రంతా హాయిగా నిద్రపోయేందుకు, వారిపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచేందుకు ‘స్మార్ట్‌ బేబీ మానిటర్‌’ ఉపయోగపడుతుంది. ఈ మానిటర్‌కు వీడియో కెమెరా ఉంటుంది. మీరు ఇతర గదుల్లో పనుల్లో బిజీగా ఉన్నా, యాప్‌ సహాయంతో ఆన్‌లైన్‌లో బేబీని గమనించేందుకు వీలవుతుంది. కెమెరా నైట్‌ విజన్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. బేబీ నిద్రలేచినా, ఏడ్చినా అలర్ట్‌ రూపంలో సందేశం అందుతుంది. బేబీ సరిగ్గా నిద్రపోతోందా లేదా అనే బెంగ ఉండదు.

బాటిల్‌ వార్మర్‌

పిల్లలకు పాలు పట్టించాలనుకుంటే స్మార్ట్‌ బాటిల్‌ వార్మర్‌ బెస్ట్‌ ఆప్షన్‌. ఈ హ్యాండీ గ్యాడ్జెట్‌ సహాయంతో పాలను త్వరగా, సులభంగా వేడి చేసుకోవచ్చు. ఇది కూలింగ్‌, హీటింగ్‌ ఎలిమెంట్‌తో వస్తుంది. పిల్లలకు ఎప్పటికప్పుడూ తాజాగా వేడి పాలు అందివ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ఫోన్‌ సహాయంతోనూ గ్యాడ్జెట్‌ను నియంత్రించే వీలుంది.

బేబీ సౌండ్‌ మెషీన్‌

నవజాత శిశువుల కోసం ‘బేబీ సౌండ్‌ మెషీన్‌’లు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్యాడ్జెట్‌ ఉంటే పిల్లలు ఏడుపు మానేసి హాయిగా నిద్రపోతారు. ఫోన్‌ నుంచి గ్యాడ్జెట్‌ను నియంత్రించే వీలుంది. ఇంట్లో ఏ గదిలో ఉన్నా సౌండ్‌ లెవెల్స్‌ను అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. జోల పాట మొదలుకుని రకరకాల పాటలు ఇందులో ఉంటాయి. పిల్లలు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే ఓదార్పునిచ్చేలా శబ్ధం చేస్తుంది. పిల్లలు సులభంగా నిద్రలోకి జారుకోవడానికి అవసరమైన వాతావరణాన్ని ఈ గ్యాడ్జెట్‌ క్రియేట్‌ చేస్తుంది.

Updated Date - 2023-01-29T11:34:45+05:30 IST